Begin typing your search above and press return to search.

అన్న‌య్య మీద అభిమానాన్ని పొంగించిన ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   6 Dec 2017 6:22 PM GMT
అన్న‌య్య మీద అభిమానాన్ని పొంగించిన ప‌వ‌న్‌
X
దేశంలో చిత్ర‌మైన రాజ‌కీయం ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. గ‌తంలో మాదిరి ప్ర‌త్యర్థుల మీద విరుచుకుప‌డ‌టం.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడేయ‌టం.. అన‌రాని మాట‌లు అనేయ‌టం లాంటి వాటికి కాలం చెల్లిన‌ట్లుగా క‌నిపిస్తుంది. మాట్లాడే మాట‌ల‌న్ని ఉన్న‌తంగా ఉండాలి. విన్నంత‌నే.. అరే.. ఏం చెప్పిండు భ‌య్‌. ఇలా ఆలోచించే మొన‌గాడే ఇప్ప‌టిదాకా రాలేదే అన్నంత‌గా మ‌న‌సు దోచేయాలి.

ఇలా మాట‌లు చెప్పే పెద్ద‌మ‌నిషి ఈ రోజు దేశాన్ని ఏలేయ‌ట‌మే కాదు.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల ఉనికే లేనంత‌గా బ‌ల‌ప‌డిపోతున్న వైనం తెలిసిందే. రాజ‌కీయంగా గ‌ళం విప్పితే చాలు.. సీబీఐ.. ఈడీ లాంటి విచార‌ణ సంస్థ‌లు బిల‌బిల‌మంటూ వెళ్లిపోతున్నాయి. చివ‌ర‌కు సీఎం ఆఫీస్ అయినా స‌రే.. డోన్ట్ కేర్ అన‌ట‌మే కాదు.. ఏకంగా సీఎం ఇంట్లో సీఎం లేన‌ప్పుడు వెళ్లి మ‌రీ చెకింగ్ చేసే ప‌రిస్థితి వ‌రకూ వెళ్లిపోయింది.

అలా అని.. చేసే రాజ‌కీయాన్ని నోటితో చెప్ప‌కుండా.. చేత్తో చేసుకుంటూ పోయే సిత్ర‌మైన రాజ‌కీయంలోని విల‌క్ష‌ణ‌త ఇప్ప‌టికీ చాలామందికి వంట‌బ‌ట్ట‌ని రీతిలో ఉంది. ఇప్పుడు దాన్ని మించిన వ్యూహాన్ని ప‌వ‌న్ అమ‌లు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. త‌న‌కు మ‌తం.. కులం.. ప్రాంతం లాంటివి చిరాకు అనేయ‌ట‌మే కాదు.. ప‌వ‌ర్ కోసం పార్టీ పెట్ట‌లేద‌ని చెప్పేస్తున్న ఆయ‌న‌.. తాజాగా చేసిన ప్ర‌సంగం వ్యూహాత్మకంగా మారింద‌ని చెప్పాలి.

సామాన్యుడికే కాదు.. రాజ‌కీయ వ‌ర్గాల‌కు సైతం అయోమ‌యానికి గురి చేసిన ప‌వ‌న్ ప్ర‌సంగంలో లోతుల్ని వెతికితే కొత్త కొత్త తీరాలు క‌నిపించ‌టం ఖాయం.  ఇవాల్టి మాట‌ల్ని ప్ర‌స్తావించే ముందు.. నాలుగేళ్ల కింద‌ట త‌న జ‌న‌సేన పార్టీ పెట్టే వేళ‌లో.. ఇంట్లో జ‌రిగిన పంచాయితీ గురించి రేఖామాత్రంగా చెప్పారు. త‌ను పార్టీ పెట్ట‌టం ఇంట్లో అన్న‌కి ఇష్టం లేద‌ని.. చివ‌ర‌కు త‌న త‌ల్లికి కూడా చెప్ప‌లేద‌న్న మాట‌ను చెప్పేశారు.

ప్ర‌జారాజ్యం ఎపిసోడ్ లో చిరుతో తీవ్రంగా వ్య‌తిరేకించిన‌ట్లుగా జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని ప‌రోక్షంగా ప‌లుమార్లు ప‌వ‌న్ ప్ర‌స్తావించారు కూడా. ప్ర‌జ‌ల కోసం దేవుడు లాంటి అన్న‌య్య‌తో సైతం విబేదించిన‌ట్లుగా చెప్పారు. మ‌రి.. ఇన్ని మాట‌లు చెప్పిన ప‌వ‌న్‌.. ఈ రోజు (బుధ‌వారం) అందుకు భిన్నంగా మాట్లాడేశారు. ఇప్ప‌టిదాకా ప్ర‌జారాజ్యం ఎపిసోడ్ కు సంబంధించి భిన్న‌మైన వాద‌న‌ను వినిపించారు. దేవుడు లాంటి త‌న అన్న చిరును అక్ష‌రాల మోసం చేశార‌ని చెప్పారు అంతేనా.. ఆయ‌న్ను మోసం చేసిన‌.. ద్రోహం చేసిన వారిని గుర్తు పెట్టుకున్నాన‌ని.. అంత‌కంత‌కూ బ‌దులు తీర్చుకుంటాన‌ని శ‌ప‌ధం చేసినంత ప‌ని చేశారు.

అరే.. అదేంటి నిన్న‌టి వ‌ర‌కూ రాజ‌కీయంగా త‌న అన్న‌ను విభేదించిన‌ట్లుగా చెప్పిన ప‌వ‌న్.. ఉన్న‌ట్లుండి త‌న అన్నను ఎవ‌రో దారుణంగా మోసం చేసిన‌ట్లుగా చెప్పటం ఇప్పుడు ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. మ‌రి.. చిరు అంత‌గా మోస‌గించ‌బ‌డితే.. కేంద్ర‌మంత్రి ప‌ద‌విని ఎలా సొంతం చేసుకున్న‌ట్లు అన్న ప్ర‌శ్న‌కు స‌మాదానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.  

రాష్ట్రాన్ని రెండు ముక్క‌లు చేస్తున్న‌వేళ‌.. రాజ్య‌స‌భ‌లో చేష్ట‌లుడిగిపోయిన‌ట్లుగా చూస్తుండిపోయారే త‌ప్పించి..చేతిలో ఉన్న మంత్రి ప‌ద‌విని త్య‌జించ‌టానికి మాత్రం ఇష్ట‌ప‌డ‌ని ప‌రిస్థితి. మ‌రి.. అలాంటి అన్న‌ను ఇప్పుడు త‌మ్ముడు ఇంత‌లా వెన‌కేసుకురావ‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఉదాత్త‌మైన సందేశాన్ని ఇచ్చిన‌ట్లుగా క‌నిపించే ప‌వ‌న్‌. ప్ర‌సంగం అద్యంతం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి.  చీలిపోయిన మెగా అభిమానుల్ని ఒక తాటి మీద‌కు తెచ్చే చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌టమే కాదు.. అన్న మీద తాను చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా మెగా అభిమానులు ఒక్క‌టైన‌ట్లు అయిపోయారు. చిరును పొగిడేయ‌టం అంటే... మెగా ఫ్యామిలీ మొత్తం ఒక‌టైన‌ట్లేన‌ని చెప్పాలి.  నిజానికి ఈ త‌ర‌హా ప్యాచ‌ప్ లు ప‌వ‌న్ లో క‌నిపించేవి కావు. ఈ మ‌ధ్య‌లోనే ఆయ‌నలో మార్పు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ఈ మ‌ధ్య‌నే పుట్టిన త‌న కొడుక్కి అన్న‌య్య పేరు క‌లిసి వ‌చ్చేలా మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ అంటూ పెట్టి మ‌న‌సు దోచేసుకున్న జ‌న‌సేనాధినేత‌.. తాజా స్టెప్ తో మెగాభిమానులంద‌రిని.. వారికి అండ‌గా నిలిచే వారంద‌రిని ఏక‌తాటి మీద‌కు తెచ్చార‌ని చెప్పాలి. ఉదాత్త‌మైన మాట‌ల వెనుక ఇంత వ్యూహం ఉందా ప‌వ‌న్ అనిపించేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.