Begin typing your search above and press return to search.

కేంద్రం క్లారిటీ.. కక్కాలేని మింగాలేని పవన్!

By:  Tupaki Desk   |   5 Feb 2020 5:04 AM GMT
కేంద్రం క్లారిటీ.. కక్కాలేని మింగాలేని పవన్!
X
రాజధాని ఏర్పాటుకు సంబంధించి తాజాగా కేంద్రం తేల్చేసింది. ఒక రాష్ట్రం తన రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్న విషయానికి సంబంధించిన పూర్తి స్వేచ్ఛ ఆయా రాష్ట్రాలకు ఉంటుందన్న విషయాన్ని కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై ఆయన ప్రశ్నలు వేశారు. వీటికి సమాధానమిస్తూ కేంద్రం.. తన భౌగోళిక సరిహద్దుల్లో రాజధానుల్ని నిర్ణయించుకోవటం అన్నది ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశమని.. కేంద్రానికి సంబంధం లేదన్న విషయాన్ని స్పస్టం చేసింది.

ఏపీ రాజధానులపై కేంద్రం ఇచ్చిన సమాధానం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇబ్బందికరంగా మారిందని చెప్పక తప్పదు. మూడు రాజధానుల ఏర్పాటును పవన్ వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. రెండు పార్టీలు కలిసి పోరాడతాయని.. ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగుతాయని పవన్ చెప్పారు. మరి.. భాగస్వామ్య పక్షం వినిపిస్తున్న వాదనకు భిన్నంగా తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అమరావతి విషయంలో సానుకూల వ్యాఖ్య ఏమాత్రం చేయకపోవటం ఆసక్తికరంగా మారింది.

తన స్టాండ్ కు భిన్నమైన ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ అంశంలో పవన్ స్పందన ఏమిటన్నది ప్రశ్నగా మారింది. రాష్ట్ర రాజధాని అంశం ఆయా రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఇప్పటివరకూ రాజధాని అంశంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా కేంద్రం స్పందిస్తుందని భావిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బలపర్చేలా కేంద్రం ప్రకటన ఉంది. దీంతో.. ఈ అంశంపై ఎలా స్పందించాలన్న అంశంపై పవన్ కక్కాలేక మింగాలేని పరిస్థితుల్లోకి పవన్ వెళ్లారని చెప్పక తప్పదు.