Begin typing your search above and press return to search.

'దేశం' ఓట్లకు పవన్ గండికొడతారా..!?

By:  Tupaki Desk   |   30 Nov 2018 6:08 AM GMT
దేశం ఓట్లకు పవన్ గండికొడతారా..!?
X
ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం నాయకులను పవన్ భయం వెంటాడుతోంది. గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ అండతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని అవే ఓట్లు అధికారానికి దూరం చేస్తాయా... అని ఆందోళన చెందుతున్నారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి భారతీయ జనతా పార్టీ ఓ చేయి - పవన్ కల్యాణ్ మరో చేయి వేశారు. తాజా పరిస్థితులలో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ దూరమైంది. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా జనసేన పేరుతో పార్టీపెట్టి చంద్రబాబు నాయుడిని - తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన రెడ్డికి తనకంటూ ప్రతి నియోజకవర్గంలోను ఓట్ బ్యాంక్ ఉంది. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్‌ కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ వైపు మళ్లింది. అయితే ఆ లోటును పవన్ కల్యాణ్ - భారతీయ జనతా పార్టీ తమ ఓట్లతో పూడ్చాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీకి వైరి పక్షంగా మారాయి. దీంతో పవన్ ఓటు బ్యాంకు జనసేన పార్టీకి మారుతుందని - దీని వలన తీవ్రంగా నష్టపోయేది తెలుగుదేశం పార్టీయే అని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.

జనసేనకు ఉభయ గోదావరి జిల్లాలలో - కృష్ణా జిల్లా లో కొన్ని నియోజక వర్గాలలోను గణనీయ స్దాయిలో ఓట్ బ్యాంక్ ఉంది. ఇక నెల్లూరు - ప్రకాశంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలలోను పవన్ కల్యాణ‌్ కు అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వారి ఓట్లన్ని గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకే పడ్డాయి. ఈసారి మాత్రం తమ ఓట్లు తమ పార్టీకే వేసుకుంటామని జనసేన నాయకులు - కార్యకర్తలు ఎక్కడికక్కడ తీర్మానాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఇంటేలిజెన్స్ విభాగం కూడా నిర్దారించిందంటున్నారు.

దీంతో తెలుగుదేశం నాయకులు - ప్రజాప్రతినిధులలో గుబులు పెరుగుతోంది. మరోవైపు తమ నాయకుడు చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత స్వార్దంతో కాంగ్రెస్‌ తో చేతులు కలపడం వల్ల తెలుగుదేశం ఓటర్లలో కూడా వ్యతిరేకత వస్తోందని చెబుతున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ పట్ల ఆంద్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తమ రాష‌్ట్రం ఆర్థికంగాను - అభివృద్ది విషయంలోను వెనుకబడి పోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని నమ్ముతున్నారు. ఈ ఆగ్రహం చల్లారాలంటే కనీసం 20 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ కు దూరంగా ఉండాలని ఆంద్రప్రదేశ్ ప్రజలు పట్టుదలగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతున్న చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం ఓటర్ల నుంచి కూడా ఎదురు దెబ్బ తప్పదని అంటున్నారు. ఈ క్రమంలో అటు పవన్ కల్యాణ్ ఓటు బ్యాంకుకు ఇటు స్వంత ఓటు బ్యాంకుకు కూడా చంద్రబాబు నాయుడు దూరం కాక తప్పదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.