Begin typing your search above and press return to search.

ధర్మపరిరక్షణ దీక్షలో పాల్గొన్న పవన్ కల్యాణ్

By:  Tupaki Desk   |   10 Sep 2020 5:30 PM GMT
ధర్మపరిరక్షణ దీక్షలో పాల్గొన్న పవన్ కల్యాణ్
X
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని చారిత్రక రథం దగ్ధం ఘటన ఏపీతో పాటు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా`ధర్మ పరిరక్షణ దీక్ష`కు పిలుపునిచ్చాయి. గురువారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 11 గంటల పాటు చేపట్టనున్న ధర్మ పరిరక్షణ దీక్షలో పాల్గొనాలని ఇరు పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో హిందూ ఆలయాలు, ఆలయాలకు సంబంధించిన ఆస్తులపై దాడులను ఖండిస్తూ దీక్ష చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా ట్వీట్లు, పత్రికా ప్రకటనలతో వార్తల్లో నిలుస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా నిరసన దీక్షలో పాల్గొంటున్న సందర్భంగా మీడియా ముందుకు వచ్చారు. నల్ల బ్యాడ్జి ధరించిన పవన్... హైదరాబాదులోని తన ఇంట్లోని ఫాం హౌస్ లో పవన్ దీక్ష చేపట్టారు.

ఈ దీక్ష చేపట్టడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ సీనియర్ నాయకులతో పవన్ చర్చించారు. అన్ని జిల్లాల్లో జనసేన నాయకులు, శ్రేణులు ఈ దీక్ష చేపట్టడం గురించి పవన్ కళ్యాణ్ చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నేతలు దీక్షలు చేపట్టారని పవన్ కళ్యాణ్‌కు నేతలు తెలియజేశారు. మరోవైపు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తన ఇంట్లో నిరసన దీక్షకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా దీక్ష చేపట్టారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ ఢిల్లీలోని తన నివాసంలో దీక్ష చేయగా...బీజేపీ నేతలు సునీల్ దేవధర్, సత్య కుమార్ కూడా దీక్షకు దిగారు. ఇక, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు శుక్రవారం నాడు దీక్ష చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలోని తన నివాసంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు 8 గంటలపాటు దీక్ష చేయబోతున్నానని తెలిపారు. కొంతకాలంగా ఏపీలోని హిందూ దేవాలయాలు, ఆస్తులపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు.