Begin typing your search above and press return to search.

తెలంగాణ‌పై పిచ్చి ప్రేమ స‌రే.. ప్ర‌శ్నించ‌వే ప‌వ‌న్‌?

By:  Tupaki Desk   |   16 Aug 2018 5:07 AM GMT
తెలంగాణ‌పై పిచ్చి ప్రేమ స‌రే.. ప్ర‌శ్నించ‌వే ప‌వ‌న్‌?
X
ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టిన‌ట్లుగా చెప్పుకుంటారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఎవ‌రిష్టం వారిది. ఎవ‌రికి తోచిన‌ట్లుగా వారు పార్టీ పెట్టుకోవ‌చ్చు. ఆద‌రిస్తారా? లేదా? అన్న‌ది ప్ర‌జ‌ల ఇష్టం. కానీ.. చెప్పిన నాలుగు మాట‌లైనా ఆచ‌రిస్తే బాగుంటుంది. కానీ.. అలాంటిదేమీ ప‌ట్ట‌ని తీరు ప‌వ‌న్ లో క‌నిపిస్తుంద‌ని చెప్పాలి. తాను చెప్పే మాట‌ల‌కు పొంత‌న లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం ప‌వ‌న్ కు మాత్ర‌మే చెల్లుతుంది.

ఒక‌సారి చెప్పిన మాట‌.. మ‌రోసారి చెప్పే మాట‌కు చాలాసార్లు మ్యాచ్ కాదు. రెండు తెలుగు రాష్ట్రాలు త‌న‌కు ముఖ్య‌మ‌ని చెప్పే ఆయ‌న‌.. తెలంగాణ గురించి అస్స‌లు మాట్లాడ‌రు. అంతేనా? తెలంగాణ రాష్ట్రంలో అవినీతి భారీగా సాగుతుంద‌ని కాంగ్రెస్ నేత‌లు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నా.. కేసీఆర్ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడే సాహ‌సం చేయ‌ని తీరు ప‌వ‌న్ లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. తాజాగా కొత్త రాగాన్ని ఆల‌పించారు. వీలైన‌న్ని స్థానాల్లో తాము బ‌రిలోకి దిగుతామ‌న్నారు. పోటీలోకి దిగ‌టం త‌ర్వాత‌.. తెలంగాణ అధికార‌ప‌క్షం చేస్తున్న త‌ప్పుల మీద ప‌వ‌న్ ఎందుకు గ‌ళం విప్ప‌రు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం దొర‌క‌ని ప‌రిస్థితి. గ‌డిచిన కొద్దిరోజులుగా ఏపీలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్‌.. అక్క‌డి అంశాలకే ప‌రిమితం అవుతున్నారే త‌ప్పించి తెలంగాణపై ఏ మాత్రం దృష్టి పెట్ట‌టం లేదు.

దీనికి త‌గ్గ‌ట్లే పార్టీ విజ‌న్ డాక్యుమెంట్లోనూ తెలంగాణ ప్ర‌స్తావ‌న లేదు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌.. తెలంగాణ అంశాల్ని కూడా ప్ర‌స్తావిస్తే బాగుండేద‌న్న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పార్టీ అధినేత‌గా.. తానేం కోరుకుంటున్నాన‌న్న విష‌యాన్ని పార్టీ ముఖ్యుల‌కు.. విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌పై చ‌ర్చించే పార్టీ ముఖ్యులు ఆ అంశాల మీదా దృష్టి పెడ‌తారు. అలాంటిదేమీ చెప్ప‌కుండా.. త‌గిన సూచ‌న‌లు చేయ‌కుండా ఏకాఏకిన విమ‌ర్శ‌లు చేయ‌టం స‌రికాద‌న్న మాట వినిపిస్తోంది.

పార్టీ ముచ్చ‌ట ఇలా ఉంటే.. ప‌వ‌న్ త‌న‌కు తానుగా తెలంగాణ ఇష్యూల మీద మాట్లాడి ఎంత‌కాల‌మైంది? తెలంగాణ అధికార‌ప‌క్షంపై ఎన్నో ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి విప‌క్షాలు. వాటిపై త‌న స్పంద‌న ఏమిటి? తెలంగాణ అధికార‌ప‌క్షం పాల‌న ఎలా ఉంద‌న్న దానిపై ఇప్ప‌టివ‌ర‌కూ మాట్లాడ‌ని ప‌వ‌న్ తీరుచూస్తుంటే.. త‌న పార్టీని ఏపీకే ప‌రిమితం చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు. అదే నిజ‌మైతే.. ప‌వ‌న్ చెప్పిన మాట‌ల‌కు చేత‌ల‌కు ఏ మాత్రం లంకె కుద‌ర‌న‌ట్లే. తెలంగాణ‌పై పిచ్చి ప్రేమ ఉంద‌ని స్టేట్ మెంట్లు ఇస్తే స‌రిపోదు.. త‌న‌లో అదెంతన్న‌ది త‌న చ‌ర్య‌ల‌తో అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చేయాలి ప‌వ‌న్ మాష్టారూ!