Begin typing your search above and press return to search.

ప్ర‌శ్నించ‌టం కాదు క‌నీసం స్పందించ‌వా ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   3 Dec 2017 8:10 AM GMT
ప్ర‌శ్నించ‌టం కాదు క‌నీసం స్పందించ‌వా ప‌వ‌న్‌
X
నిల‌దీసేందుకే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా అని చెప్పి మ‌రీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నేత ప‌వ‌న్ క‌ల్యాణ్. ఎవ‌రూ అడ‌గ‌కున్నా త‌న‌కు తాను పాలిటిక్స్ లోకి వ‌చ్చిన ప‌వ‌న్‌.. ఎప్పుడు దేని మీద రియాక్ట్ అవుతారో ఆయ‌న‌కు మాత్ర‌మే తెలుసు. ఎవ‌రికి అందుబాటులో ఉండ‌కుండా.. ఏదో చేస్తాన‌నే ప‌వ‌న్ ఏం చేస్తారా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.

ఇటీవ‌ల కాలంలో ఏపీకి సంబంధించి చాలా ప‌రిణామాలు చోటు చేసుకున్నా.. గ‌డిచిన మూడు.. నాలుగు రోజుల్లో కీల‌క‌మైన రెండు అంశాలు తెర మీద‌కు వ‌చ్చాయి. అందులో ఒక‌టి పోల‌వ‌రం ప‌నులు నిలిపివేయ‌టం..రెండోది కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశం. పోల‌వ‌రం అంశానికి సంబంధించి చూస్తే.. ఏపీ అధికార‌ప‌క్షానికి.. కేంద్రానికి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది.

టీడీపీ.. బీజేపీ నేత‌ల మ‌ధ్య త‌ప్పు మీదంటే మీద‌న్న‌ట్లుగా ప‌ర‌స్ప‌ర నింద‌లు వేసుకోవ‌టం క‌నిపించింది.

ఇంత‌కీ ఏం జ‌రిగింద‌న్న చూస్తే.. పోల‌వ‌రం స్పిల్ వే ప‌నుల్ని నిలిపివేయాల‌ని కేంద్రం ఆదేశించ‌టం.. కేంద్రం నుంచి వ‌చ్చిన ఆదేశాల‌తో ఏపీ ముఖ్య‌మంత్రి బ‌ర‌స్ట్ కావ‌ట‌మే కాదు.. ఏపీ ప్ర‌జ‌లు కోరుకుంటే ఈ ప్రాజెక్టు ప‌నులు త‌క్ష‌ణ‌మే తాను కేంద్రానికి అప్ప‌గిస్తాన‌ని చెప్పేశారు.

అన్ని మాట‌లు చెప్పిన చంద్ర‌బాబు.. త‌ర్వాతి రోజు ఆ ఊసునే ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. పోల‌వ‌రం ఇష్యూ కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య గ్యాప్ పెరుగుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతున్న వేళ‌.. ఊహించ‌ని రీతిలో కాపు రిజ‌ర్వేష‌న్ల అంశం తెర మీద‌కు వ‌చ్చింది.

కాపుల్ని బీసీల్లో చేర్చే అంశంపై నివేదిక ఇవ్వాలంటూ జ‌స్టిస్ మంజునాథ క‌మిష‌న్ ను ఏర్పాటు చేసింది ఏపీ స‌ర్కారు. అయితే.. నెల‌లు గ‌డుస్తున్నా నివేదిక ఇవ్వ‌లేదు. గ‌డువు ముగిసిన‌ప్ప‌టికీ స్పంద‌న లేదు. ఇదిలా ఉంటే.. కాపుల్ని బీసీల్లోకి చేర్చాలంటూ ఆందోళ‌న పెద్ద ఎత్తున చోటు చేసుకున్న‌ప్ప‌టికీ జ‌స్టిస్ మంజునాథ క‌మిష‌న్ త‌న నివేదిక ఇవ్వ‌లేదు. ఇలాంటి వేళ‌లో రాత్రికి రాత్రి క‌మిష‌న్ స‌భ్యులు నివేదిక ఇవ్వ‌టం.. ప‌క్క‌రోజు పొద్దున మంత్రి వ‌ర్గ భేటీలో ఆమోదించ‌టం.. గంట‌ల వ్య‌వ‌ధిలో ఏపీ అసెంబ్లీలో బిల్లు రూపంలో పెట్ట‌టం.. ఆమోదించ‌టం జ‌రిగిపోయాయి.

అసెంబ్లీ ఆమోదించ‌టంతోనే ఏపీ స‌ర్కారు చెప్పిన‌ట్లుగా 5 శాతం రిజ‌ర్వేష‌న్లు (రాజ‌కీయ రిజ‌ర్వేషన్లు మిన‌హాయించి) అమ‌ల్లోకి వ‌స్తాయా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.

ఓప‌క్క రిజ‌ర్వేష‌న్ల అమ‌లు అంశంపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌లోనే.. ఏపీ అధికార‌పక్షం కేకులు కోసుకోవ‌టం.. మిఠాయిలు ఒక‌రికొక‌రు తినిపించుకోవ‌టం లాంటివి జ‌రిగిపోయాయి. మ‌రి ఇంత జ‌రిగినా ప‌వ‌న్ ఎందుకు స్పందించ‌రు. రెండు కీల‌క‌మైన అంశాలు చోటు చేసుకున్న వేళ‌.. త‌న రియాక్ష‌న్ ఏమిట‌న్న‌ది ప్ర‌శ్న‌. ఏం జ‌రిగినా మౌనంగా ఉండ‌టం.. తాను మాట్లాడాల‌నుకున్న‌ప్పుడు మాట్లాడ‌టమ‌నే రాజ‌కీయ వ్యూహం ప‌వ‌న్ వ‌ర‌కూ బాగుండొచ్చు.. కానీ.. ఆయ‌న మీద కోటి ఆశ‌లు పెట్టుకున్న ప్రజ‌ల్ని మాత్రం ఆక‌ట్టుకోద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ప‌వ‌న్‌కు న‌చ్చిన రోజున ప్ర‌జ‌ల‌కు రియాక్ట్ కావ‌టం మానేస్తే.. అదెలా ఉంటుందో వ‌ప‌న్‌కు అర్థ‌మ‌వుతుందేమో?