Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే బీజేపీకి లెక్కేలేదా?

By:  Tupaki Desk   |   24 Jan 2016 10:55 AM GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే బీజేపీకి లెక్కేలేదా?
X
ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు పొలిటిక‌ల్ స‌ర్కిల్‌ లోనూ గొప్ప క్రేజ్ ఉన్న ప‌ర్స‌నాలిటీ. 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ కూట‌మిని గెలిపించ‌డంతో ప‌వ‌న్ స‌త్తా రూఢీ అయింది. అనంత‌రం ఆయ‌న సొంత పార్టీ జ‌న‌సేన‌కు రాజ‌కీయ గుర్తింపు ద‌క్కినప్ప‌టికీ దానితో పెద్ద‌గా యాక్టివ్ కాలేదు. పైపెచ్చు టీడీపీ-బీజేపీ మిత్ర‌ప‌క్షాల నాయ‌కుడిగా ఉంటూ వ‌స్తున్నారు. అయితే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ప‌ట్ల పార్టీల దృష్టి మారిన‌ట్లు క‌నిపిస్తోంది.

మిత్ర‌ప‌క్షాలైన టీడీపీ-బీజేపీ త‌ర‌ఫున ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌చారానికి వ‌స్తార‌నే వార్త‌లు గ్రేట‌ర్ ఎన్నిక‌ల సమ‌యంలో జోరుగా వినిపించాయి. ఒక‌ద‌శ‌లో ఈ వార్త‌ల‌పై ప్ర‌తిప‌క్షాలు కూడా అల‌ర్ట్ అయ్యాయి. అధికారప‌క్ష‌మైన టీఆర్ ఎస్ అయితే విమ‌ర్శ‌లు గుప్పించింది. సీఎం కేసీఆర్ కూతురు - నిజామాబాద్ ఎంపీ క‌విత మేక‌ప్‌ తో ప్ర‌చారానికి వ‌చ్చి ఆ త‌ర్వాత ప్యాక‌ప్ చేసుకుపోతార‌ని విమ‌ర్శించారు. అయితే ప‌వ‌న్ శిబిరం నుంచి స్పంద‌న‌రాలేదు.

కానీ తాజాగా బీజేపీ నుంచి ప‌వ‌న్ ప్ర‌చారం విష‌యంలో స్ప‌ష్ట‌త ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు జి.కిష‌న్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి రావాల్సిందిగా తాము ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను కోర‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు తమ పార్టీ త‌ర‌ఫున కేంద్ర మంత్రుల ప్ర‌చార షెడ్యూల్‌ నే సిద్ధం చేసిన‌ట్లు తెలిపారు. కిష‌న్‌ రెడ్డి కామెంట్లు ఎలా ఉన్నా...బీజేపీ పిల‌వ‌గానే ప‌వ‌న్ వ‌చ్చేవారా? ఒక‌వేళ ప‌వ‌న్ రాక‌పోయిన‌ప్ప‌టికీ ఆయన్ను పిల‌వ‌లేద‌ని కిష‌న్‌ రెడ్డి చెప్ప‌డం ద్వారా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను పులుసులో ముక్క‌లాగా వాడుకొని వ‌దిలిసిన‌ట్లేనా అనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇపుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సాగుతోంది.