Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్ మళ్లీ కనిపించేది అక్కడేనా!

By:  Tupaki Desk   |   9 May 2019 11:43 AM GMT
పవన్ కల్యాణ్ మళ్లీ కనిపించేది అక్కడేనా!
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పునఃదర్శనం ఇవ్వబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. పోలింగ్ ముగిసిన రోజు ఏదో ముక్తసరిగా మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత మాత్రం అలాంటి ముచ్చట్లు ఏవీ చెప్పలేదు. ఆఖరికి తన పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి చనిపోతే కూడా పవన్ కల్యాణ్ స్పందించలేదు!

దీంతో మళ్లీ పవన్ కల్యాణ్ మీద విమర్శలు చెలరేగాయి. పవన్ కల్యాణ్ కేవలం పార్ట్ టైమ్ పొలిటీషియన్ మాత్రమే అనే అభిప్రాయాలకు ప్రస్తుత పరిణామాలు మరింత ఊపును ఇస్తున్నాయి. ఒకవైపు పోలింగ్ అనంతరం రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక మంది అనేక రకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు.

జనసేన కూడా ఒక పార్టీనే అయితే పవన్ కల్యాణ్ కూడా స్పందించాల్సిందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. తన పార్టీ శ్రేణులను, క్యాడర్ ను ఉత్సాహభరితం చేయడానికి.. వారికి తను ఉన్నట్టుగా భరోసాను ఇవ్వడానికి పవన్ కల్యాణ్ స్పందించాల్సిందని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం తనకేదీ పట్టదన్నట్టుగా తను అసలు ఎన్నికల్లో పోటీ చేయనట్టుగా, తన పార్టీ ఎన్నికల్లో పోటీలోనే లేనట్టుగా చాలా కామ్ గా ఉండిపోయాడు.

మరి ఇంతకీ పవన్ కల్యాణ్ మళ్లీ ఎప్పుడు కనిపించనున్నారు? అంటే ఇప్పుడు వినిపిస్తున్న మాట తన తదుపరి సినిమా సెట్స్ మీదే అనేది! త్వరలోనే పవన్ కల్యాణ్ హీరోగా సినిమా ప్రారంభం కానున్నదని అప్పుడు ఆయన అందరికీ కనిపిస్తారని, ఎన్నికల ఫలితాలతో పెద్దగా సంబంధం లేకుండానే పవన్ కల్యాణ్ సినీ ప్రయాణం చేయబోతూ ఉన్నారని.. సినిమాలతో బిజీ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయిప్పుడు!