Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ కనబడడంలేదా...?

By:  Tupaki Desk   |   24 April 2023 2:33 PM GMT
పవన్ కళ్యాణ్ కనబడడంలేదా...?
X
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కరెక్ట్ గా ఏడాది మాత్రమే సమయం ఉంది. మరి కొద్ది రోజులలో మే నెలలోకి వెళ్ళబోతున్న సందర్భం. మూడు నాలుగు నెలలు దాటితే పూర్తిగా ఎన్నికల వేడి కమ్ముకుంటుంది. అన్ని పార్టీలు కూడా జనంలోకి వస్తాయి. ఇప్పటికే తెలుగుదేశం ఈ విషయంలో అలెర్ట్ అయింది. లోకేష్ పాదయాత్ర గత మూడు నెలలుగా నిరాటంకంగా సాగుతోంది. ఇప్పటికే వేయి కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశాడు. చంద్రబాబు జిల్లాల టూర్లు పెట్టుకుంటూ అలా ముందుకు సాగుతున్నారు.

జగన్ అయితే పధకాల కోసం బటన్ నొక్కుతూ జిల్లాలలో అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి రెండు ప్రధాన పార్టీలు ఏపీలో ఎవరి పనిలో వారు బిజీగా ఉంటే జనసేన మాత్రం పెద్దగా పొలిటికల్ యాక్టివిటీ లేకుండా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఇపుడు చూస్తే రాజకీయాల్లో అనే మాట ఒక్కటే ఉంది. అదే మనిషి కనబడడంలేదు అని. పవన్ కనబడడం లేదు అనే అంటున్నారు.

పవన్ తనకంటూ సొంత పార్టీ పెట్టుకుని అధినేతగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. కానీ అదే ప్రజలు గెలిపించిన ఒక ఎమ్మెల్యే అయితే మాత్రం ఇంతలా కనబడకపోతే కనుక కచ్చితంగా ఈ పాటికి ఏ పోలీస్ స్టేషన్ లోనో ప్రజలే ఫిర్యాదు ఇస్తారు. మా ఎమ్మెల్యే అసలు కనిపించడంలేదు అని. అలా ఆ నియోజకవర్గం ప్రజలు కేసు కూడా పెట్టేవారు.

పవన్ కళ్యాణ్ విషయం చూస్తే ఆయన రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు ఈ రూల్స్ ఈ కేసులు ఏ మాత్రం అప్లికబుల్ అయితే కావు అనే చెప్పాల్సి ఉంటుంది. మరి పవన్ రాజకీయం ఏంటో, జనసేన రూటు ఏంటో తెలియడం లేదు కానీ ఏపీలో ఎన్నికలకు ఏడాది సమయం కూడా అట్టే లేదు అని అంటున్నారు.

పవన్ విషయం తీసుకుంటే ఇటు టీడీపీ అటు బీజేపీ రెండ్ పార్టీల మధ్య వాటి పొత్తుల ఎత్తుగడల మధ్య వారి వ్యూహాల మధ్యన పడి పూర్తిగా నలిగిపోయారా అన్న చర్చ కూడా వస్తోందిట. దీని కంటే ఎక్కువగా వినిపిస్తున్న మరో ప్రచారం కూడా ఉంది. అదేంటి అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ పార్టీ టార్గెట్లు కూడా చాలా గట్టిగానే ఉంటాయి. తమకు అనుకూలంగా ఉన్నంతసేపూ ఏమీ అనని బీజేపీ పెద్దలు ఎవరైనా రివర్స్ అయినా దూరం అయినా వారి మీద గట్టిగానే పగ పట్టేస్తారు అనడానికి ఇటీవల కాలం బోలెడు ఉదాహరణలు ఉన్నాయని అంటున్నారు.

పవన్ని బీజేపీ 2019 ఎన్నికల ముందు నుంచే రెండే కోరుతూ వచ్చింది. ఒకటి పొత్తు పెట్టుకోమని, రెండు తమ పార్టీలో జనసేన విలీనం చేయమని. విలీనం మాట పవన్ చాలా సార్లు చెప్పి తాను ఆ పని చేయలేనని చెప్పేశారు. ఇక 2019 ఎన్నికల తరువాత పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకుని వారి ఒక కోరికను తీర్చారు. బీజేపీ అయితే పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్ ని వదిలే సీన్ లేదనే అంటున్నారు.

ఆయన ఏమనుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో కానీ ఇపుడు విడిపించుకోలేకపోతున్నారు అని అంటున్నారు. కేంద్ర పెద్దల వద్ద జనసేనాని మాట చెల్లకపోయినా ఆయన వెనక్కి వెళ్లలేని పరిస్థితి ఉందా అంటే అవును అనే ప్రచారం సాగుతోందని అంటున్నారు. పవన్ కి బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తులు పెట్టుకుని పోటీ చేయాలని ఉంది. ఆ విషయమే ఆయన పదే పదే చెబుతున్నారు. కానీ బీజేపీ వారికి మాత్రం టీడీపీతో వెళ్లడం ఇష్టంలేదు.

పోనీ తన మానాన ఆయన బీజేపీని వదిలి టీడీపీతో వెళ్లాలనుకున్నా బీజేపీ వెనక నుంచి కళ్ళెం వేసి ఆపేస్తోంది అని అంటున్నారు. దానికి వివిధ రకాలైన అంశాలు ప్రచారంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న బీజేపీ వద్ద సీబీఐ, ఈడీ, ఐటీ వంటివి ఉన్నాయి. ఒక వేళ బీజేపీతో బంధాన్ని తెంచుకోవాలని చూసినా వాటిని పవన్ మీద కానీ ఆయన కుటుంబం మీద కానీ ప్రయోగిస్తారా అన్న సందేహాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట.

మొత్తానికి దేన్ని అయినా చేయగలిగిన సత్తా గల బీజేపీ పవన్ని ఏదో విధంగా బెదిరించి సైలెంట్ చేసి ఉంటుందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇటీవల గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఒక మాట అన్నారు. పవన్ని టీడీపీతో కలవనీయకుండా బీజేపీ ఆయన్ని బెదిరిస్తోందని. అదే కనుక నిజమా అన్న చర్చ వస్తోంది. ఏది ఏమైనా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పవన్ కనబడకపోవడం మాత్రం చిత్రంగా ఆసక్తిగానే ఉంది మరి.