Begin typing your search above and press return to search.

బీజేపీతో పొత్తులో ప‌వ‌న్ లెక్క త‌ప్పిందా?

By:  Tupaki Desk   |   15 Feb 2020 1:30 AM GMT
బీజేపీతో పొత్తులో ప‌వ‌న్ లెక్క త‌ప్పిందా?
X
నాక్కొంచెం తిక్కుంది....కానీ దానికో లెక్కుంది....గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపుల‌ర్ అయింది. అయితే, సినిమాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ లెక్క ప‌క్కాగా ఉన్నా.....రాజ‌కీయాల్లో మాత్రం ఆ లెక్క త‌ప్పింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌ని 2014లో చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్....అధికారంలో ఉన్న టీడీపీతో పొత్తుపెట్టుకొని ప్ర‌శ్నించ‌డం మానేయ‌డంతో మొద‌టి సారి లెక్క త‌ప్పారు. 2019లో ఒంట‌రి పోరాటం చేసి కుమార‌స్వామి త‌ర‌హాలో సీఎం అయిపోదామ‌నుకొని రెండో సారి లెక్క‌ల్లో ఫెయిల్ అయ్యారు. ఇక తాజాగా 2020లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏపీ రాజ‌కీయాల్లో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడ‌దామ‌నుకొని ముచ్చ‌ట‌గా మూడోసారి లెక్క త‌ప్పారు. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పూర్తిగా పొడ‌వ‌క ముందే....ఎన్డీఏలో వైసీపీ చేరడం దాదాపుగా ఖాయ‌మ‌వ‌డంతో ప‌వ‌న్ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది.

ఏపీలో జ‌న‌సేన మూడో ప్ర‌త్యామ్నాయం అని - జ‌న‌సేన లేని రాజ‌కీయాలు ఉండ‌వ‌ని 2019 ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌వ‌న్ బాకా ఊదారు. అయితే, పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓట‌మి పాలైన ప‌వన్...త‌న పార్టీ ఒకే ఒక్క సీటు గెల‌వ‌డంతో ప‌రువు ద‌క్కించుకున్నారు. ఎలాగోలా సింహం సింగిల్ గా పోరాడుతుంద‌నే డైలాగ్‌ తో మొన్న‌టివ‌ర‌కు జ‌న‌సేన అంటే ప‌వ‌న్ మాత్ర‌మే అని నెట్టుకొచ్చారు. అయితే, బీజేపీతో జ‌న‌సేన పొత్తు నేప‌థ్యంలో కేంద్రంలో బీజేపీ నిర్ణ‌యాల‌పై జ‌న‌సేన స్టాండ్ ఏంటి అన్న‌ది వెల్ల‌డించక త‌ప్ప‌ని ప‌రిస్థితి. కానీ, ఏపీలో బీజేపీ నిర్ణ‌యాలు వేరు....కేంద్రంలో బీజేపీ నిర్ణ‌యాలు వేరు....కేంద్రంలో బీజేపీని ఎన్డీఏలో భాగంగా చూడాల‌ని ఏపీ బీజేపీ నేత‌లంటున్నారు. ఈ లాజిక్ ...ప‌వ‌న్ మిస్స‌య్యారు. ప‌వ‌న్ మూడోసారి త‌ప్పిన లెక్క ఇదే.

వైసీపీకి ప‌రోక్షంగా అనుకూలంగా బీజేపీ ఉంద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లు లేదు. ఆ ప‌రోక్ష మ‌ద్ద‌తు కాస్తా ...ప్ర‌త్య‌క్ష మ‌ద్ద‌తుగా మార‌బోతుండ‌డం ప‌వ‌న్ కు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లకు మింగుడుప‌డ‌డం లేదు. బీజేపీ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్ కు ప‌వ‌న్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. వైసీపీ కేంద్ర కేబినెట్ లో చేరితే.... బీజేపీతో జ‌న‌సేన పొత్తు చిత్త‌వ్వాల్సిందే. ఆ త‌ర్వాత ప‌వ‌న్ ...త‌న రాజ‌కీయ గురు చంద్ర‌బాబుతో మ‌రోసారి జ‌త‌క‌డ‌తారా...లేక సింహం...సింగిల్ ఫార్ములాకు ప‌రిమిత‌మ‌వుతారా అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది. బీజేపీ ద్వంద్వ ప్ర‌మాణాలు తెలుసుకోకుండా...తొంద‌ర‌ప‌డి బీజేపీతో పొత్తు పెట్టుకున్నామా అని ప‌వ‌న్ మ‌థ‌న‌ప‌డుతున్నార‌ట‌.

ఇప్ప‌టికే ప‌వ‌న్ నిర్ణ‌యాల‌తో అయోమ‌యంలో ఉన్న కేడ‌ర్...తాజా పొత్తు మూణ్ణాళ్ల ముచ్చ‌ట‌..అని విమ‌ర్శ‌లు గుప్పించే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఇప్ప‌టికే...జ‌న‌సేన కేడ‌ర్ అయోమ‌యంలో ఉండ‌గా...త‌న తాజా నిర్ణ‌యం కేడ‌ర్‌ ను మ‌రింత అయోమ‌యంలోకి నెడుతుందేమోన‌ని ప‌వ‌న్ బెంగ‌ప‌డుతున్నార‌ట‌. వైసీపీకి బీజేపీ మ‌ద్దతుంది గ‌న‌కే 3 రాజ‌ధానుల విష‌యంలో వేలు పెట్ట‌మ‌ని చెప్పేసింది. అయితే, పొత్తు ధ‌ర్మం ప్ర‌కారం ఆ నిర్ణ‌యాన్ని ప‌వ‌న్ విమ‌ర్శించ‌లేరు...అదే స‌మ‌యంలో వైసీపీని విమ‌ర్శించిన నోటితోనే వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌లేరు. ఇలా ప‌వ‌న్ ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా త‌యారైంద‌ట‌. పాసింగ్ క్లౌడ్ లా నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని పేరున్న పార్ట్ టైం పొలిటిషియ‌న్ ప‌వ‌న్....`పొత్తువారింటికి దారేది` అని వెతుకుతున్నార‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.