Begin typing your search above and press return to search.

అన్న ఎన్టీఆర్‌ నినాదాన్ని అందుకున్న పవన్‌!

By:  Tupaki Desk   |   28 Aug 2016 4:42 AM GMT
అన్న ఎన్టీఆర్‌ నినాదాన్ని అందుకున్న పవన్‌!
X
తెలుగు జాతి ఎన్నటికీ మరచిపోలేని వ్యక్తిగా నందనమూరి తారక రామారావు పేరును మొట్టమొదట చెప్పుకుంటారు ఎవరైనా సరే. అటు నటుడిగాను, ఇటు ముఖ్యమంత్రిగాను నందమూరి తారక రామారావు ఈ జాతి మీద ఎప్పటికీ చెరగిపోని తనదైన ముద్రను విడిచి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ మూసపాలన - రిమోట్‌ కంట్రోల్‌ పరిపాలన నడుస్తున్న రోజుల్లో ''తెలుగుజాతి ఆత్మగౌరవ'' నినాదంతో జనంలోకి వచ్చిన నందమూరి తారక రామారావు... ఎన్ని సంచలనాలను సృష్టించారో అందరికీ తెలుసు.

ఇన్ని దశాబ్దాల తర్వాత.. ఇంచుమించు అదే తరహా ఆత్మగౌరవమూ.. దానిని మించి ''చీమూ నెత్తురూ'' నినాదంతో మరో వెండితెర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ తెలుగుజాతిలో ఓ కదలిక తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పైగా ఇద్దరూ పరిణతి ఉన్న నటులే కావడంతో.. తమ తమ బహిరంగ సభల్లో.. తాము చెప్పదలచుకున్న విషయాన్ని.. అభినయపూర్వకమైన ఆవేశంతో.. నాటకీయంగా రక్తికట్టించారు.

పవన్‌ కల్యాణ్‌ ను ఇప్పటికీ వెనుకనుంచి ఎవరో నడిపిస్తుంటే.. ఈ సభ పెట్టాడు.. ఇలా.. చవకబారు విమర్శలు చేస్తున్న వారు అనేకమంది ఉన్నారు. అలాంటి వ్యాఖ్యల్లో నిజానిజాల సంగతి తరువాత. మొత్తానికి తెలుగు జాతికి లోలోపల రగులుతున్న ఆవేశానికి - కేంద్రం మీద ఉన్న ఉక్రోషానికి పవన్‌ కల్యాణ్‌ ఇవాళ ఒక అవుట్‌ లెట్‌ లాగా మారి మాట్లాడారు. మొత్తానికి నాటకీయత కాస్త సందేహాస్పదమయ్యేంత ఎక్కువైనప్పటికీ.. తాను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా మాత్రం పవన్‌ కల్యాణ్‌ తన అభిమానుల ముందు పెట్టగలిగారు.

సమైక్యాంధ్ర ఉద్యమం సాగుతున్న సమయంలో సీమాంధ్ర ఎంపీలు తమ వాదనను గట్టిగా వినిపించలేక సోనియాగాంధీ వద్ద బతిమిలాడారని ఆగ్రహంగా అన్నారు. ''అప్పుడు కాంగ్రెస్‌ ఎంపీలుగా ఉన్నారే.. మీరు ఇందుకు సిగ్గుపడాలి.. మీకు సిగ్గులేదా - మీకు లజ్జలేదా - మీకు రోషం లేదా'' అంటూ పవన్‌ కల్యాణ్‌ చాలా తీవ్రంగా మాట్లాడారు.

అలాగే భాజపా ప్రభుత్వం.. తెలుగుజాతికి - సీమాంధ్రులకు చీమూ నెత్తురూ లేదనుకుంటే కుదరదని - తాము ఏం చేయగలమో పోరాటం ద్వారా కేంద్రానికి చూపిస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. మొత్తానికి ఎన్టీఆర్‌ అప్పటి కేంద్రంలోని అహంకారపూరిత కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా ఆత్మగౌరవ నినాదంతో ప్రజల్లోకి వెళితే.. ఇప్పుడు కేంద్రంలోని మదమెక్కి ప్రవర్తిస్తున్న భాజపా వైఖరిని ఈసడిస్తూ తెలుగువాడి చీమూనెత్తురూ నినాదంతో పవన్‌ కల్యాణ్‌ ఉద్యమానికి సిద్ధమవుతున్నాడు.