Begin typing your search above and press return to search.

బోటు ప్ర‌మాద బాధితుల‌కు ప‌వ‌న్ భ‌రోసా..

By:  Tupaki Desk   |   9 Dec 2017 8:54 AM GMT
బోటు ప్ర‌మాద బాధితుల‌కు ప‌వ‌న్ భ‌రోసా..
X
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒంగోలులో పర్యటిస్తున్న సంద‌ర్భంగా ఒంగోలు ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో పవన్‌ కల్యాణ్‌ కృష్ణా జిల్లా పడవ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు. విజయవాడ సమీపంలో కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద గత నెలలో జరిగిన పడవ బోల్తా ప్రమాదంలో ఒంగోలు - నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద మృతుల్లో అత్యధికులు ప్రకాశం జిల్లాకు చెందిన వారే. కాగా, పడవ ప్రమాదం గురించి బాధిత కుటుంబాలు పవన్‌ కు వివరించారు. ప్రమాద సంఘటనపై పవన్‌ బాధిత కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పడవ ప్రమాద ఘటన జరిగిందని బాధితులు పవన్‌ కు వివరించారు. అధికారులు హెచ్చరించినా బోటు లోపలికి తీసుకెళ్లారని బంధువులు ఆరోపించారు. ప్రమాదంపై వెంటనే సహాయం అంది ఉంటే తమవారు బతికేవారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులు పవన్‌ కు మృతుల ఫొటోలు చూపించి కన్నీళ్లు పెట్టుకున్నారు.

అనంత‌రం జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ సరదాగా విహార యాత్రకు వెళ్లి మృత్యువాత పడడం దురదృష్టకరమని అన్నారు. ఇంట్లో ఓ మనిషి చనిపోతే ఆ బాధ వర్ణనాతీతమన్నారు. ఒక్కో కుటుంబాన్ని కదిలిస్తే కన్నీళ్లే వస్తున్నాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు జవాబు దారిత‌నం ఉండాలని అన్నారు. అధికారులను, ప్రజాప్రతినిధులను విమర్శించేందుకు ఇక్కడికి రాలేదని, మంత్రుల బాధ్యతల్ని గుర్తు చేసేందుకు వచ్చానన్నారు. మృతుల కుటుంబాల బాధను ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. `కన్నీళ్లు కోపంగా మారుతాయి...కోపం ఉద్యమాలకు దారితీస్తుందని, ఉద్యమాలతోనే ప్రభుత్వాలు పడిపోతాయన్నారు. ఇప్పటికైనా మంత్రి అఖిలప్రియ స్వయంగా వచ్చి బాధితులను పరామర్శించాలి` అని అన్నారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదంటే ఏం చేయాలో బాధితుల్ని అడిగి తెలుసుకోవాలన్నారు.

పడవ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాలు చెల్లించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. రాజకీయ నాయకులకు సున్నితమైన మనస్తత్వం లేకుండా పోయిందన్నారు. నిందితులు తప్పించుకుని తిరగడం అసలుసిసలైన విషాదం అన్నారు. ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.ఎక్స్‌గ్రేషియాలతో పోయిన ప్రాణాలు తిరిగి తేలేమని, ప్రమాద కారకులకు శిక్ష పడడం ముఖ్యమన్నారు. ఈ ఘటనపై ఎవరినీ విమర్శించదలుచుకోలేదని, అయితే ప్రమాద బాధితుల ఆవేదనను అర్థం చేసుకోవాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియకు సూచించారు. `మీకు ఈ బాధ బాగా అర్థమవుతుందనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా ఎన్నో బాధలను అనుభవించి వచ్చారు కాబట్టి. సాటి వాళ్ల బాధను మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఒక ప్రజాప్రతినిధిగా వారిని పరామర్శించడం, ఓదార్చడం మీ బాధ్యత` అంటూ జనసేనాని వ్యాఖ్యానించారు.

`ప్రమాదం జరిగినప్పుడు బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తుంటారు. కానీ అఖిల ప్రియను రాజీనామా చేయమనట్లేదు. మంత్రిగా బాధ్యత వహించి బాధితులతో మాట్లాడాలి. ప్రజా సమస్యలపై స్పందించకపోతే బాధ్యతా రాహిత్యం అవుతుంది..ఇలాంటి చర్యలు ముందు ముందు జరగకుండా మార్గదర్శకాలు రూపొందించాలి` అంటూ పవన్ వ్యాఖ్యానించారు.