Begin typing your search above and press return to search.

ఆంధ్రులహక్కుపై అమిత్ షాకు పవన్ విన్నపం.. ఏం జరగనుంది?

By:  Tupaki Desk   |   10 Feb 2021 3:09 AM GMT
ఆంధ్రులహక్కుపై అమిత్ షాకు పవన్ విన్నపం.. ఏం జరగనుంది?
X
బీజేపీ.. జనసేన జట్టు కట్టిన తర్వాత కేంద్ర హోం మంత్రి.. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షాతో మొదటిసారి జబేటీ అయ్యారు పవన్ కల్యాణ్. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి బుధవారంరాత్రి పార్లమెంటు ప్రాంగణంలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలన్న కేంద్ర నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని సూచన చేశారు.

స్టీల్ ప్లాంటులో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరించాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందని.. ఈ అంశంపై రాష్ట్ర ప్రజల భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయని పవన్ పేర్కొన్నారు. సెయిల్.. ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరి సొంత గనులు లేకపోవటంతో నష్టాలు వస్తున్నాయి పవన్ పేర్కొన్నారు. ఇతర సంస్థలకు టన్ను ఇనుప ఖనిజం రూ.1500లకు వస్తే.. విశాఖ ఉక్కు రూ7వేల చొప్పున ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. నష్టాల్ని అధిగమించేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షాను పవన్ కోరినట్లు చెబుతున్నారు.

మరి.. పవన్ విన్నపాన్ని కేంద్రం మన్నిస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత.. ఆ పార్టీ కోరుకున్నట్లుగా మిత్రపక్షం నిర్ణయాలు ఉండటం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తే బీజేపీ వద్దని కోరింది. త్వరలో జరిగే తిరుపతి ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయాలని జనసేన భావిస్తుంటే.. బీజేపీ సైతం తాను పోటీకి రెఢీ అన్న మాటను తరచూ చెబుతోంది. ఇలాంటి సమయంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మకానికి పెట్టిన కేంద్ర నిర్ణయాన్ని పవన్ తీవ్రంగా తప్పు పడుతున్నారు. మరి.. జనసేనాని కోరినట్లుగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.