Begin typing your search above and press return to search.

లాంగ్ మార్చ్ పరువు తీస్తున్నావుగా పవన్!

By:  Tupaki Desk   |   3 Nov 2019 6:17 AM GMT
లాంగ్ మార్చ్ పరువు తీస్తున్నావుగా పవన్!
X
అదిరిపోయే టైటిల్ పెడితే సరిపోదు. అందుకు తగ్గ కంటెంట్ తప్పనిసరి. అందుకు భిన్నంగా ఉంటుంది జనసేన అధినేత పవన్ తీరు. ఆయన నిర్వహించే కార్యక్రమాలకు పేర్లు పెట్టే విషయంలో ఆయన ప్రదర్శించే క్రియేటివిటీ.. తీరా ప్రోగ్రాంను నిర్వహించే విషయంలోనూ.. అందులో తన పాత్ర విషయంలో ఆయన తీరు తీసికట్టుగా ఉండటమే కాదు.. పెట్టే పేరుకు.. చేసే పనికి ఏ మాత్రం పొంతన లేనట్లుగా ఉంటుందన్న భావన వ్యక్తమవుతూ ఉంటుంది.

ఎక్కడిదాకానో ఎందుకు గడిచిన కొద్ది రోజులుగా లాంగ్ మార్చ్ పేరుతో పవన్ కల్యాణ్ చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్నే తీసుకుంటే ఈ విషయం ఇట్టే అర్థం కాక మానదు. ఇసుక కొరత కారణంగా ఏపీ భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంఘీభావంగా విశాఖ కేంద్రంగా లాంగ్ మార్చ్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఇసుక కొరత కారణంగా స్తంభించిపోయిన నిర్మాణ రంగంతో కార్మికులు పస్తులు ఉండలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లుగా పవన్ వాదిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద లాంగ్ మార్చ్ ప్రారంభం కానుంది. విచిత్రమైన విషయం ఏమంటే చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన వేలాదిమంది రెడ్ ఆర్మీ సభ్యులు ఏడాది పాటు దశల వారీగా నిర్వహించిన ఈ లాంగ్ మార్చ్ ను కేవలం 2.5కిలోమీటర్ల దూరానికి పవన్ పెట్టుకోవటం విశేషం.

లాంగ్ మార్చ్ పేరుకు తగ్గట్లే సుదీర్ఘంగా సాగిన ఈ యాత్రను 1934 నుంచి 1935 వరకూ నిర్వహించారు. 24 పర్వతశ్రేణులు.. 18నదులు దాటుకొని గమ్యానికి చేరుకునేందుకు పది వేల కిలోమీటర్ల పాటు సాగిన ఆ యాత్రకు.. విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్ నుంచి అశీల్ మెట్ట మీదుగా సాగే తాజా లాంగ్ మార్చ్ కు పోలికేముంది?అని ప్రశ్నిస్తున్నారు.

చైనా పితామహుడిగా పేర్కొనే మావో జెడాంగ్ ఆధ్వర్యంలో సాగిన ఈ మార్చ్ తర్వాతే సర్వశక్తివంతమైన అధినేతగా ఆయన ఆవిర్భవించారు. ఏంతో చరిత్ర ఉన్న లాంగ్ మార్చ్ పేరును.. ఒక బుల్లి నిరసన యాత్రకు పెట్టటంపై పలువురు తప్పు పడుతున్నారు. అత్యంత కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ సాగిన చైనా లాంగ్ మార్చ్ తర్వాతే ఆ దేశ రాజకీయ ముఖచిత్రం మొత్తం మారింది. ఘన చరిత్ర ఉన్న పేరును మసకబారేలా పవన్ తాజా లాంగ్ మార్చ్ ఉందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.