Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిలో పోటాపోటీగా పుస్త‌కావిష్క‌ర‌ణ‌లు...!

By:  Tupaki Desk   |   6 April 2018 7:33 AM GMT
అమ‌రావ‌తిలో పోటాపోటీగా పుస్త‌కావిష్క‌ర‌ణ‌లు...!
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావ‌తిలో రాజ‌కీయం వేడెక్కింది. అమరావతి కేంద్రంగా గురువారం పోటాపోటీగా చేపట్టిన పుస్తకావిష్కరణలు అందరి దృష్టిని ఆక‌ర్షించాయి. రాజధాని నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ గతంలో ఏపీ సీఎస్‌ గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు ఎవరి రాజధాని అమరావతి పేరుతో రాసిన పుస్తకాన్ని విడుదలచేయగా, ఐవైఆర్‌ కు పోటీగా రాజధాని రైతులకు మద్దతుగా శ్రీధర్‌ వర్మ `ప్రజా రాజధానిపై కుట్ర-దుష్ట చతుష్టయం` పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకం ముఖచిత్రంపై ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ - జ‌న‌సేన అధినేత పవన్‌ కల్యాణ్ - వైసీపీ అధినేత వైఎస్ జగన్ - మాజీ సీఎస్‌ ఐవైఆర్ కృష్ణారావు ఫొటోలను ముద్రించారు. విజయవాడలో ఒకేప్రాంతంలో రాత్రి రెండు కార్యక్రమాలు జరుగడం చర్చనీయాంశంగా మారింది.

మ‌రోవైపు ఎవరి రాజధాని అమరావతి పుస్తకాన్నిజనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ఆవిష్క‌రించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గతంలో చేసిన తప్పునే ఏపీ సీఎం చంద్రబాబు పునరావృతం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం అయితే విప‌రిణామాలు చోటుచేస‌కుంటాయ‌ని పేర్కొన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌ ను నిర్మించారని చెప్పుకొంటున్నారని, కానీ ఆయన సైబరాబాద్‌ ను నిర్మించారని ఎద్దేవా చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ తో అభివృద్ధి ఎంత జరిగిందో - విధ్వంసం కూడా అంతే జరిగిందని విమర్శించారు. అమరావతి కోసం ఏపీ సీఎం చేసిన డిజైన్లన్నీ గ్రాఫిక్‌ లేనని, రాజధాని ముసుగులో భారీ మోసానికి తెరతీశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ ఆరోపించారు. అమ‌రావ‌తి భూముల‌నుచూస్తుంటే ఆవేద‌న క‌లుగుతోంద‌ని మాజీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు తెలిపారు.