Begin typing your search above and press return to search.

పవన్ ను సజ్జల కలిశారా? ఎప్పుడు.. ఎక్కడ?

By:  Tupaki Desk   |   3 Oct 2021 7:31 AM GMT
పవన్ ను సజ్జల కలిశారా? ఎప్పుడు.. ఎక్కడ?
X
అధికారపక్షం వర్సెస్ ప్రధాన ప్రతిపక్షం అన్నట్లు ఉంటుంది ఎక్కడైనా. అందుకు భిన్నంగా ఏపీలో మాత్రం అధికారపక్షం వర్సస్ ఒక్క ఎమ్మెల్యే (ఆయన కూడా ప్రస్తుతం జనసేనలో లేరనుకోండి) మాత్రమే ఉన్న జనసేన మధ్య నడుస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో పవన్ ఘాటు వ్యాఖ్యలతో మొదలైన రచ్చ గడిచిన వారం రోజులుగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న (శనివారం) రాజమండ్రి.. అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు పవన్ కల్యాణ్.

అయితే.. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి విషయంలో పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తిని.. ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వైసీపీ నేతలు ఎవరైనా సరే.. తిట్ట వర్షం కురిపించే పవన్.. తన తీరుకు భిన్నంగా ఆచితూచి అన్నట్లు మాట్లాడటమే కాదు.. గౌరవ మర్యాదల్ని ప్రదర్శించిన వైనం ఆశ్చర్యకరంగా మారింది. గతంలో తామిద్దరం ఒకసారి కలిశామని.. చాలా విషయాలు మాట్లాడుకున్నామని.. వైసీపీలో తన గురించి బాగా తెలిసిన వ్యక్తుల్లో సజ్జల ఒక్కరేనంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ ఈ ఇద్దరు ఎప్పుడు కలిశారు? వీరి భేటీ ఎందుకు జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ.. జనసేన మధ్య పొత్తు ఉంటుందన్న పెద్ద చర్చ జరిగింది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ సులువుగా అధికారం దక్కుతుందన్న అంచనాలు ఉండటంతో.. ఆ దిశగా ప్రయత్నాలు భారీగా సాగినా.. పవన్ అందుకు నో చెప్పేశారు. ఈ సందర్భంలోనే సజ్జల పవన్ తో భేటీ అయి ఉంటారన్న మాట వినిపిస్తోంది. అయితే.. సజ్జల పవన్ ను కలిశారన్న విషయం ఇప్పటివరకు బయటకు రాకపోవటం ఒక ఎత్తు అయితే.. తాజాగా పవన్ నోటి నుంచే ఆ విషయం రివీల్ కావటం గమనార్హం.

జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మొదటి వ్యక్తి సజ్జలే. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆయన.. ఏ విషయం మీదనైనా మాట్లాడటం చూస్తే.. జగన్ ఆయనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారన్నది అర్థమవుతుంది. సజ్జల మీద పూర్తిస్థాయి నమ్మకం.. భరోసా ఉండటమే దీనికి కారణంగా చెబుతారు. కడప జిల్లాకు చెందిన సజ్జల వారి కుటుంబం వామపక్ష రాజకీయ సిద్ధాంతాలకు అమిత ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు. ఆయన సోదరుడు దివాకర్ రెడ్డి.. మామ నర్రెడ్డి శివరామిరెడ్డి ఏపీలో ప్రముఖ కమ్యునిస్టు నేతలుగా సుపరిచితులు. జగన్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియా సంస్థలోనూ ఆయన కీలకభూమిక పోషించిన విషయాన్ని మర్చిపోకూడదు.

ఇదిలా ఉంటే.. ఈ మధ్యన పవన్ వర్సెస్ వైసీపీ మధ్య నడుస్తున్న మాటల యుద్ధంలో సజ్జల కూడా ఎంట్రీ ఇచ్చి.. యాక్షన్.. కెమెరా.. కట్ అని చెప్పి పవన్ వెళ్లిపోతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించిన పీకే.. 'ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి విజ్ఞత కలిగిన వ్యక్తి. ఒకసారి ఆయన్ను కలిసినట్లు గుర్తు. ఆయన అన్నారంట యాక్షన్.. కెమెరా.. కట్ అని చెప్పి పవన్ వెళ్లిపోతాడని. అలా యాక్షన్.. కెమెరా.. కట్ అని చెప్పి వెళ్లిపోయే వ్యక్తిని కాదు గురువు గారూ. మీరు పెద్దలు. మీ పార్టీలో అందరి కంటే మీకు నా గురించి బాగా తెలుసు. మీ నాయకుడికి తెలియదు కాని మీకు బాగా తెలుసు. మన ఇద్దరి సంభాషణల్లో మనమేం మాట్లాడుకున్నామో మీకు తెలుసు. మీలాంటి విజ్ఞులు ఉండి కూడా 1.26లక్షల కి.మీ. రోడ్లలో కనీసం 26 కి.మీ. రోడ్డు కూడా ఒక గుంత లేకుండా క్లీన్ గా వేయలేని పరిస్థితి'' అని వ్యాఖ్యానించారు.

వైసీపీ నేతలన్నంతనే.. వారి మాటకు మాట అనేయటమే కాదు.. వారికి పవన్ ఎలాంటి ట్యాగులు తగిలిస్తారో అందరికి తెలిసిందే. అందుకు భిన్నంగా సజ్జలను మాత్రం పెద్దవారు.. విజ్ఞులు లాంటి వ్యాఖ్యలు చేయటం చూస్తే.. పవన్ ఆయనకు.. ఆయన మాటకు ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్నది అర్థమవుతుంది. ఇదంతా బాగానే ఉన్నా.. పవన్ ను సజ్జల ఏ సందర్భంలో.. ఎప్పుడు.. ఎందుకు కలిశారు? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లభించాల్సి ఉంది. దీనికి సజ్జల మాష్టారు ఏమంటారో?