Begin typing your search above and press return to search.

కాకినాడలో పవన్ సభావేధిక ఫిక్స్..కారణం ఇదే!

By:  Tupaki Desk   |   2 Sep 2016 5:30 AM GMT
కాకినాడలో పవన్ సభావేధిక ఫిక్స్..కారణం ఇదే!
X
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు "ప్రత్యేక హోదా" అనే అంశం హాట్ టాపిక్. ఇంకా గట్టిగా చెప్పాలంటే భవిష్యత్ రాజకీయాలను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేయగలిగిన అంశం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయంపై అధికార పక్షం టీడీపీ - మిత్ర పక్షం బీజేపీలు నాంచుడు దోరణిని అవలంబిస్తున్నాయని, ప్రత్యేక హోదా స్థానే ప్రత్యేక ప్యాకేజీ అనే కొత్త మాటలు వస్తున్నాయని రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేవీపీ రూపంలో కాంగ్రెస్ ఈ విషయంలో మంచి మార్కులే కొట్టేసిందనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. దీంతో పాటు ప్రధాన ప్రతిపక్షం వైకాపా కూడా తమవంతు ప్రయత్నాలు వారు చేస్తున్న క్రమంలో సడన్ గా పవన్ ఎంట్రీ ఇచ్చారు.. తిరుపతిలో సభ ఏర్పాటుచేశారు.

తిరుపతిలో పవన్ పెట్టిన బహిరంగ సభ అనంతరం కూడా ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆ సభలోనే కాకినాడలో సెప్టెంబరు 9న ఒక బహిరంగ సభపెడుతున్నామని, భవిష్యత్ కార్యచరణ అక్కడ నుంచే మొదలవుతుందని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సభ కోసం కాకినాడ జేఎన్‌ టీయూ గ్రౌండ్ ఎంపికయ్యింది. ఈ మేరకు ఈ సభను అత్యంత ఘనంగా నిర్వహించాలని జనసేన పార్టీ జనాలు భావిస్తున్నారు.

ఈ విషయంపై ఆ పార్టీ ప్రతినిధి మారిశెట్టి రాఘవ తాజాగా స్పందించారు. కాకినాడలో నిర్వహించబోతున్న జనసేన బహిరంగ సభకు కాకినాడ జేఎన్‌ టీయూ గ్రౌండ్ ఎంపికయ్యిందని, ఈ మేరకు జే.ఎన్.టీ.యు. యాజమాన్యానికి, స్థానిక పోలీసులకు కృతజ్ఞతలు రాఘవ తెలిపారు. అయితే పదేళ్ల కిందట కాకినాడలో నిర్వహించిన సభలో "ఒక ఓటు రెండు రాష్ట్రాలు" అనే నినాదాన్ని తెరపైకి బీజేపీ తెచ్చిందని.. ఈ నినాదమే రాష్ట్ర విభజనకు ప్రధానంగా దారి తీసిందని.. రాష్ట్ర విభజనలో బీజేపీ కీలకంగా వ్యవహరించినందున, ఏపీకి ప్రత్యేక హోదా బాధ్యత కూడా పూర్తిగా ఆ పార్టీపైనే ఉందనే డిమాండుతో అదే ప్రాంతంలో "ప్రత్యేక హోదా" అనే అంశంపై పోరాటానికి నాంధి పలకాలని నిర్ణయించారు. ఏది ఏమైనా.. పవన్ కల్యాణ్ నిర్వహించబోయే ఈ సభపై అంచనాలు భారీగానే ఉన్నాయి.