Begin typing your search above and press return to search.

జనసేన తొలి జాబితా.. ఆ ఊపు ఏదీ?

By:  Tupaki Desk   |   14 March 2019 4:58 AM GMT
జనసేన తొలి జాబితా.. ఆ ఊపు ఏదీ?
X
మొత్తానికి జనసేన తొలి జాబితా ప్రకటించేసింది. కనీసం ఈ స్థాయిలో అయినా ఇప్పటి వరకూ ఏ పార్టీ కూడా జాబితాను విడుదల చేయకముందే జనసేన జాబితాను అనౌన్స్ చేసింది. ఇక్కడ వరకూ ఓకే కానీ.. తొలి జిబితా విడుదల తర్వాత జనసేనలో కనిపించాల్సిన ఊపు మాత్రం మిస్ అయ్యిందని చెప్పవచ్చు.

ముప్పై రెండు మంది అసెంబ్లీ నియోజకవర్గాల పోటీదారుల - నాలుగు లోక్ సభ సీట్లకు పోటీ పడుతున్న వారి జాబితాను జనసేన ప్రకటించింది. అయితే.. అభ్యర్థుల ప్రకటనతో రావాల్సిన జోష్ మాత్రం జనసేనలో కనిపించకపోవడం విశేషం.

జనసేన అభ్యర్థుల జాబితాలో తెలిసిన పేర్లు కొన్ని ఉన్నా.. తెలియని పేర్లే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవైపు ఇంకా తేలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గురించి జరుగుతున్నంత చర్చ స్థాయిలోని తక్కువ వంతు చర్చ కూడా జనసేన తేల్చిన అభ్యర్థుల గురించి జరగకపోవడం విశేషం.

తొలి జాబితాలో ప్రకటించిన చాలా నియోజకవర్గాల్లో జనసేన విజయావకాశాల గురించి అంచనాలు ఏమీ లేవు. ఆయా నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే.. జనసేన ఖాయంగా గెలుస్తుందని చెప్పేవారు కనిపించడం లేదు. పవన్ వీరాభిమానులను పక్కన పెడితే.. జనసేన ఇప్పటి వరకూ సామాన్య జనాలను అట్రాక్ట్ చేయలేకపోయిందనేది మాత్రం వాస్తవం. దానికి కారణాలు ఏమిటి? అంటే.. చాలానే ఉన్నాయి. జనసేన ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ వీరాభిమానుల పరిధిని దాటి బయటకు వెళ్లలేకపోయింది.

ఇలాంటి నేపథ్యంలో ఫస్ట్ లిస్టును విడుదల చేసినా.. జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే జనసేన తొలి జాబితాలో పవన్ కల్యాణ్ పేరును ప్రకటించాల్సిందని, పవన్ ఎక్కడ పోటీ చేస్తున్నాడనే విషయాన్ని ప్రకటించి ఉంటే.. జోష్ వచ్చేదని, అప్పుడు మిగతా అభ్యర్థుల విషయంలో కూడా జనాల్లో చర్చ జరిగేదని.. తొలి జాబితాలో పవన్ పేరే లేకపోవడం ఆ పార్టీకి మైనస్ అవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. పవన్ ఫలానా చోట నుంచి పోటీ చేస్తున్నారు.. మిగతా వాళ్ల జాబితా ఇదీ.. అని ప్రకటించి ఉంటే.. జనసేనపై చర్చ జరిగే అవకాశాలుండేవని అంటున్నారు.

ఇక్కడ జనసేన వ్యూహాత్మక తప్పిదం చేసిందని అంటున్నారు. బహుశా ఎక్కడ నుంచి పోటీ అనే విషయంలో పవన్ కల్యాణ్ తేల్చుకోలేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణం అయి ఉండవచ్చని అంటున్నారు. గాజువాక లేదా, పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయవచ్చు అనేది ఊహాగానం. మరి వీటిల్లో పవన్ దేన్ని ఫిక్స్ చేసుకుంటారో!