Begin typing your search above and press return to search.

జనసేన మొదటి జాబితా లీక్?

By:  Tupaki Desk   |   14 Oct 2018 12:38 PM IST
జనసేన మొదటి జాబితా లీక్?
X
జనసేన మొదటి జాబితా లీకయినట్టు ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయినా, ఆయన పార్టీలో చేరికలకు కొంతమంది సీనియర్, మాజీ నేతలు ఉత్సాహం చూపుతున్నారట. దీంతో ఎవరెవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలో కూడా డిసైడ్ అయిపోతున్నట్లు తెలుస్తుంది.

ఏపీలో ఎన్నికలకు 6 నెలల ముందుగానే బరిలోకి దిగారు పవన్ కల్యాణ్. ప్రజా పోరాట యాత్ర పేరిట జిల్లాలో తిరుగుతున్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు లక్ష్యంగా తీవ్రంగా మండిపడుతున్నారు. ఆగ్రహంతో ఊగిపోతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. నాయకులకు భరోసా ఇస్తున్నారు.

ఇటీవల మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరారు. మరికొంత మంది చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో బీజేపీ నేతలు కూడా ఉన్నారని చెబుతున్నారు ఆ పార్టీలోని కొందరు. త్వరలో వీరికి టిక్కెట్లు కూడా ఖరారయ్యాయట. ఇక తీర్థం పుచ్చుకోవడమే ఆలస్యం.

ప్రత్యేక హోదా విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ ఏపీలో గెలవడం కష్టమనే భావన ఆ పార్టీ నాయకుల్లో నెలకొంది. అందుకే ఇప్పుడు బీజేపీ నేతల చూపు జనసేన వైపు మళ్లిందని సమాచారం. జనసేన తరుపున బరిలో దిగేందుకు బీజేపీ అగ్ర నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా ఆకుల సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తోంది. విజయవాడ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, గుంటూరు నుంచి లింగమనేని రమేష్, మచిలీ పట్నం నుంచి సినీ నటుడు నాగేంద్రబాబు, ఏలూరు నుంచి తోట చంద్రశేఖర్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ అభ్యర్థులుగా, గుంటూరు 2 నుంచి లేళ్ల అప్పిరెడ్డి, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ,కొత్తపేట నుంచి నల్లా పవన్ కుమార్, విజయవాడ నుంచి వంగవీటి రాధా పోటీ చేస్తారని జనసేన నేతల నుంచి సమాచారం లీకైంది. వీరంతా త్వరలో పార్టీలో చేరబోతున్నారట. టీడీపీ నేతల్లో కూడా అంతర్మధనం మొదలై, ఎన్నికల నాటికి చీలిపోతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.