Begin typing your search above and press return to search.

లెఫ్ట్ పార్టీలకు పవన్ దెబ్బ.. !

By:  Tupaki Desk   |   7 July 2018 5:51 AM GMT
లెఫ్ట్ పార్టీలకు పవన్ దెబ్బ.. !
X
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయన వెంట నడిచి రాజకీయ భవిష్యత్తు మొత్తం పాడుచేసుకున్న నేతలు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కనిపిస్తారు. ఇప్పుడు చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ఉరకలేస్తోంది. అయితే... ఇంకా ఎన్నికలకు వెళ్లకముందే పవన్‌ దెబ్బకు రాజకీయాలు తారుమారైపోతున్నాయి. చిరంజీవి పార్టీతో నేతలు దెబ్బతింటే పవన్ పార్టీతో ఏకంగా పార్టీలే దెబ్బయిపోతున్నాయి. ఏపీలో పవన్ కల్యాణ్‌ తో అంటకాగుతున్న లెఫ్ట్ పార్టీల తీరు ఆ పార్టీలకు జాతీయ స్థాయిలో నష్టం కలిగించింది. లెప్ట్ పార్టీలను వదిలేయాలని ఇప్పుడు కాంగ్రెస్ భావిస్తోందట. అందుకు వివిధ కారణాలు ఉండగా అందులో జనసేనతో లెఫ్ట్ దోస్తానా కూడా ప్రధాన కారణంగా నిలిచింది.

ఇన్నాళ్లూ తమతో నడిచిన లెఫ్ట్ పార్టీలతో ఇకపై కలిసి నడిచేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ‘మహాకూటమి’ ఏర్పాటులో బిజీగా ఉన్న కాంగ్రెస్ మిత్రపక్షాలైన సీపీఎం - సీపీఐతో పొత్తు విషయంలో దాదాపుగా స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వారిని కలుపుకొని వెళ్లరాదని నిర్ణయించినట్లు సమాచారం. శుక్రవారం పశ్చిమబెంగాల్ నేతలతో సమావేశమైన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పొత్తు విషయంలో నిర్ణయాన్ని 21కి వాయిదా వేశారు. కాంగ్రెస్‌ కు చెందిన సగం మంది ఎంపీలు - ఎమ్మెల్యేలు పశ్చిమ బెంగాల్‌ లో ఇప్పటికే తృణమూల్ వైపు చూస్తున్న నేపథ్యంలో రాహుల్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ‌కాంగ్రెస్ నుంచి గెలిచిన 44 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది ఇప్పటికే తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ - వామపక్షాలు కలిసి పోటీ చేసినప్పటికీ తృణమూల్‌ ను ఓడించలేకపోయాయి. దీంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో వామపక్షాలకు రాంరాం చెప్పాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

మరోవైపు ఏపీలో పవన్ కల్యాణ్ జనసేతో వామపక్షాలు కలిసి వెళ్లడాన్ని కూడా కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. ఆ పార్టీలవి ద్వంద్ర ప్రమాణాలని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఏపీలో పవన్‌ తో కలిసి వెళ్తున్న పార్టీలు తెలంగాణలో మాత్రం వేర్వేరుగా వెళ్తుండడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దీంతో ఏ రోటికాడ ఆ పాట పాడుతున్న వామపక్షాలతో కలిసి వెళ్లకపోవడమే మంచిదని మెజారిటీ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా లెఫ్టుతో కటీఫ్ చెప్పాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.