Begin typing your search above and press return to search.

పవన్ చెబితే.. బాబు ఓకే అంటున్నారే

By:  Tupaki Desk   |   17 Nov 2015 12:25 PM IST
పవన్ చెబితే.. బాబు ఓకే అంటున్నారే
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావితం చేస్తున్నారా? పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను బాబు గౌరవిస్తున్నారా? పవన్ చేస్తున్న డిమాండ్ల మీద సానుకూలంగా స్పందిస్తున్నారా? పవన్ తనకిస్తున్న ఫీడ్ బ్యాక్ ను చంద్రబాబు విశ్వాసంలోకి తీసుకుంటున్నారా? ప్రభుత్వాధినేతగా బాబుకొచ్చే సమాచారానికి మించిన సమాచారం పవన్ ఇస్తున్నారా? పవన్ ఇచ్చే సలహాల్లో వాస్తవ కోణం ఉందని బాబు భావిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలెన్నో ఏపీ ముఖ్యమంత్రి తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే అర్థమవుతుంది. పవన్ కల్యాణ్ మాటకు బాబు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారన్న విషయం తాజాగా బాక్సైట్ తవ్వకాలపై ఏపీ మంత్రివర్గ సమావేశంలో బాబు తీసుకున్న నిర్ణయం చూస్తే ఇట్టే తెలుస్తుంది.

విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల విషయంలో ఏపీ సర్కారు తీరుపై గిరిజనలు తీవ్ర అసంతృప్తితో ఉండటం తెలిసిందే. చంద్రబాబు సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు.. భారీగా ఆందోళనలు చేపట్టే దిశగా అడుగులు వేసే సమయంలో పవన్ ఎంట్రీ ఇవ్వటం.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కావటం తెలిసిందే. నిజానికి బాబుతో భేటీ అయిన సందర్భంగా అందరూ అనుకన్నది ఏపీ రాజధాని విషయంలో రైతుల భూసేకరణకు సంబంధించి తన వాదనను మాత్రమే వినిపిస్తారని భావించారు. దీనికి తగ్గట్లే పవన్ భూసేకరణ విషయంపై తన వాదనను వినిపించటంతో పాటు.. ఎవరూ పెద్దగా దృష్టి పెట్టని బాక్సైట్ తవ్వకాల విషయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేయటంతో పాటు.. ప్రభుత్వ నిర్ణయం సరికాదన్న వాదనను సమర్థంగా వినిపించినట్లు ఏపీ మంత్రివర్గంలో సాగిన చర్చను చూస్తే తెలుస్తుంది.

ప్రజా సమస్యలకు సంబంధించి పవన్ స్పందించటం.. తన వాదనను బలంగా వినిపించటం.. దానికి చంద్రబాబు ఓకే చెప్పటం ఇది రెండోసారి. రాజధాని భూసేకరణ విషయంలో ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కల్యాణ్ గళం విప్పటం తెలిసిందే. తాను భూసేకరణకు వ్యతిరేకినని.. రైతుల వద్ద నుంచి భూముల్ని సేకరించొద్దని బాహాటంగానే చెప్పిన విషయాన్ని మర్చిపోకూడదు. తాను చెబుతున్నానని.. భూసేకరణను వెనువెంటనే ఆపేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసి మరీ.. తాను అనుకున్నది సాధించిన పవన్ కల్యాణ్.. మళ్లీ బాక్సైట్ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారు.

బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వటం ద్వారా గిరిజనంలో అలజడి రేపటంతో పాటు.. ఆ నిర్ణయం వివాదంగా మారి ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుందన్న విషయాన్ని చంద్రబాబుకు పవన్ చెప్పటం.. జరగబోయే పరిణామాల్ని అర్థం చేసుకున్న చంద్రబాబు.. ఆ అంశం మీద దృష్టి సారించటమే కాదు.. తన దృష్టికి.. మంత్రుల దృష్టికి తీసుకురాకుండా ఉన్నతాధికారులు చేసిన నిర్ణయం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నది తాజా క్యాబినెట్ సమావేశంలో జరిగిన చర్చ స్పష్టం చేసింది. మొత్తంగా.. పవన్ ప్రస్తావించే అంశాల విషయంలో చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం.. ఆయా విషయాలపై పవన్ చెప్పినట్లుగా నిర్ణయాలు తీసుకోవటం గమనార్హం.