Begin typing your search above and press return to search.

జీవీ నోటి వెంట‌...చెప్పుతో కొట్టాల‌న్న మాట‌

By:  Tupaki Desk   |   5 Dec 2017 12:12 PM GMT
జీవీ నోటి వెంట‌...చెప్పుతో కొట్టాల‌న్న మాట‌
X
జీవీ నాయుడు..సినీ న‌టుడిగానే కాకుండా కాపుల కోసం స్పందించే వ్య‌క్తిగా పేరున్న ప్ర‌ముఖుడు. ఇటీవ‌లి కాలంలో కాపుల త‌ర‌ఫున గ‌ళం విప్పుతున్న జీవీ తాజాగా ధ‌ర్మ‌వ‌రంలో ఉద్వేగ భ‌రితంగా ప్ర‌సంగించారు. జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన జీవీ ప్రస్తుత కలుషిత రాజకీయాలను కడిగిపారేసేందుకు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించాడని వెల్ల‌డించారు. రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించడానికి జనసేన సైనికులు గ్రామ గ్రామానికి వెళ్తున్నారని తెలిపారు. ధర్మవరంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీచోట అంకిత భావం ఉన్న కార్యకర్తలు జనసేనకు ఉన్నారు. నోట్లు తీసుకొని ఓట్లు వేసే రాజకీయాలను రూపుమాపేందుకు వారంతా సిద్ధంగా ఉండాలి. ఎవడైనా ఓటుకు డబ్బు ఇస్తామంటే చెప్పుతో కొట్టాలని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన నాయ‌కులు ప్రజల్లో చైతన్యం కలిగిస్తారని...ప్రతీ ఓటరకు ఓటు విలువను వివరిస్తారని వెల్ల‌డించారు.

జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌ - బాట గాంధీ కలలుకన్న సురాజ్యం అని జీవీ స్ప‌ష్టం చేశారు. పవన్ కల్యాణ్ విషయంలో ఎవరికీ భయపడేది లేదని...ఎవరినీ లెక్క చేసేది లేదని ఆయ‌న తేల్చిచెప్పారు. జనసేన కోసం ఎంతకైనా తెగిస్తానని చెప్పిన జీవీ మనం ఏదనుకుంటే అదే చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌ర్ స్టార్ త‌న సోదరుడైన మెగాస్టార్ చిరంజీవి చేసిన ప‌నిని చేయ‌లేడ‌ని జీవీ వివ‌రించారు.

ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంద‌ర్భాన్ని ఉటంకిస్తూ రాజకీయాల్లో చిరంజీవికి జరిగిన అన్యాయానికి మనకే కడుపు మండిపోతుంటే.. పవన్ కల్యాణ్‌ కు ఎంత మండుతుందో చెప్పండి అని జీవీ వ్యాఖ్యానించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని అధికార పార్టీ మోసం చేస్తున్నదని జీవీ మండిప‌డ్డారు. అందుకే కాపులు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు గన్‌ మెన్లను పెట్టుకొని తిరుగుతున్నార‌ని వ్యాఖ్యానించారు. కాపులు ఎలాంటి వారో రాజకీయ నాయకులు పక్కాగా తెలుసున‌ని అందుకే భయపడుతూ గ‌న్‌ మెన్ల‌ను వెంట‌బెట్టుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. తాను తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన స్వచ్ఛమైన కాపున‌ని పేర్కొంటూ కాపుల ప్రయోజనాల కోసం చచ్చేదాక పోరాడుతానని జీవి అన్నారు.

ఈ సంద‌ర్భంగా అధికార పార్టీపై సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. అధికార పార్టీ అన్ని రకాలుగా విఫలమైందని మండిప‌డ్డారు. రుణమాఫీ - డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడం లేదని ఈ విష‌యంలో ప్ర‌జ‌ల్లో స్ప‌ష్ట‌మైన అసంతృప్తి ఉంద‌న్నారు. సాధారణ రాజ‌కీయాల‌కు జ‌న‌సేన భిన్న‌మైన‌ద‌ని తెలిపారు.