Begin typing your search above and press return to search.

ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే అవ‌స‌రం లేదు

By:  Tupaki Desk   |   27 Jun 2018 11:52 AM GMT
ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే అవ‌స‌రం లేదు
X
త‌న రాజ‌కీయ ప‌ర్య‌ట‌న‌ను జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉత్త‌రాంధ్ర నుంచి ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఏపీలోని వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో ఒక‌టైన ఉత్త‌రాంధ్ర‌లో ప‌వ‌న్....ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్....ఆ ప్రాంతంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ ప్రాంతంలోని స‌మ‌స్య‌లు త‌న‌ను క‌దిల్చి వేశాయ‌ని, వాటిని స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించ‌కుంటే ఉత్త‌రాంధ్ర‌లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున్న లెగిసే అవ‌కాశ‌ముంద‌ని ప‌వ‌న్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌త్యేక రాష్ట్ర‌ ఆకాంక్ష బ‌ల‌మ‌ప‌డ‌కముందే ఉద్త‌రాంధ్ర అభివృద్ధికి తాను శాయ‌శ‌క్తులా కృషి చేస్తానని అన్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధికారంలోకి వ‌చ్చాక .....ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లిన వారంద‌రికి ఎకరా భూమి కొనిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ఉద్దేశ్యం త‌న‌కు లేద‌ని సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించిన ప‌వ‌న్ అన్నారు. క్షేత్రస్థాయిలో వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకే ఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్నాన‌ని చెప్పారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ప్రొఫెసర్ కేఎస్ చలం - ప్రొఫెసర్ కేవీ రమణ - ప్రజా గాయకుడు వంగపండు - వామపక్ష ప్రతినిధులతో నిర్వ‌హించిన‌ సమావేశంలో ప‌వ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ స‌మావేశంలో చంద్ర‌బాబుపై ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తన ఉత్తరాంధ్ర పర్యటన చూసి చంద్ర‌బాబు ఉద్రేకంగా ఉన్నారని పవన్ చ‌మ‌త్క‌రించారు. తాను ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నాన‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారని, ఇక్క‌డి ప్ర‌జ‌ల్లో ఉద్య‌మ స్ఫూర్తి ఉందని - వారిని రెచ్చగొట్టాల్సిన అవసరం తనకు లేదన్నారు. కానీ, ఇక్క‌డి నాయకుల్లో ఆ స్ఫూర్తి కొర‌వ‌డింద‌న్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీలోని 175 స్థానాల్లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని - స్థానికంగా న్యాయం చేసే అభ్య‌ర్థుల‌కే టిక్కెట్లు ఇస్తానని ప‌వ‌న్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే భూకబ్జాలు పెరుగుతాయ‌ని టీడీపీ ప్రచారం చేసిందని, కానీ నేడు ఆ పార్టీ నేత‌లు లక్షల ఎకరాలు కబ్జా చేయ‌డం దారుణ‌మ‌ని ప‌వ‌న్ అన్నారు. ఉత్త‌రాంధ్ర నుంచి తెలంగాణకు వలసవెళ్లిన 26 కులాలను స్థానికంగా గుర్తించాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞ‌ప్తి చేస్తానని పవన్ చెప్పారు. ఉత్త‌రాంధ్ర‌లోని ఏజెన్సీ ప్రాంతంలో ఆరోగ్య సమస్యలు భ‌యాందోళ‌న‌లు క‌లిగించేలా ఉన్నాయ‌ని - స‌రైన వైద్య స‌దుపాయాలు - వైద్యులు - అంబులెన్సులు లేర‌ని అన్నారు. తాను అరకులోని మారుమూల ప్రాంతాల్లో రక్తహీనత - రేచీకటి - చర్మ సంబంధ వ్యాధులతో బాధ‌ప‌డుతున్నవారిని చూశాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న కుమారుడి వయసు చిన్నారులు కూడా చర్మ సంబంధ వ్యాధులతో బాధ‌ప‌డ‌డం త‌న‌ను క‌లచివేసింద‌న్నారు.