Begin typing your search above and press return to search.

ఇనుప గుగ్గిళ్లు ఉడకబెడుతున్న పవన్

By:  Tupaki Desk   |   6 Feb 2018 4:47 AM GMT
ఇనుప గుగ్గిళ్లు ఉడకబెడుతున్న పవన్
X
‘‘ఆకలేస్తోందా... ఆగండాగండి.. పవన్ కల్యాణ్ ఇనుప గుగ్గిళ్లు ఉడకబెడుతున్నారు.. అల్రెడీ పొయ్యి మీద నీళ్ల మరుగుతూనే ఉన్నాయి. అందులో ఈ గుగ్గిళ్లను వేయడం కూడా ఎప్పుడో అయిపోయింది.. అవి కాస్తా ఉడికిన వెంటనే... వాటితో చక్కటి రుచికరమైన వంటకం తయారుచేసి ఆయన మీకు వడ్డించేస్తారు..’’

అని చెబుతున్నట్లుగా ఉంది జనసేన వారి వైఖరి. ఇనుప గుగ్గిళ్లు ఉడికేదెప్పుడు? వాటితో వంటకం తయారయ్యేదెప్పుడు? అనేది ఆ మాటలు వింటున్నవారి సందేహం.

మత్స్యకారులువచ్చి హైదరారబాదులోని పార్టీ కార్యాలయంలో తనతో భేటీ అయినప్పుడు పవన్ కల్యాణ్ స్పందన ఇంచుమించు ఇలాగే ఉంది. మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్ తో వచ్చి పవన్ ను కలిసిన వారికి ఆయన చాలా ఆచితూచి సమాధానం చెప్పారు. యథోరీతిగా వారి సమస్యలు తీరే వరకు వారి వెంటే ఉంటానని మాట ఇచ్చిన పవన్.. వారి ఎస్టీ రిజర్వేషన్ డిమాండ్ ను తాను ప్రధాని మోడీని కలిసినప్పుడు.. ఆయన దృష్టికి తీసుకువెళ్తానని కూడా హామీ ఇచ్చారు. ఇదే మరి ఇనుపగుగ్గిళ్లు అంటే..! ప్రధానిని ఆయన కలిసేదెప్పుడు.. వీరి సమస్యను ఆయనకు నివేదించేదెప్పుడు? ఆయన దానిపై నిర్ణయం తీసుకునేదెప్పుడు? అనేది ఎవ్వరికైనా కలిగేసందేహం.

కాకపోతే.. పవన్ కల్యాణ్ మత్స్యకారులకు అపాయింట్ మెంట్ ఇవ్వడం, అనంతరం ఈనెల 21న తానే శ్రీకాకుళం జిల్లాకు వస్తానని హామీ ఇవ్వడం.. అంతా ఒక స్కెచ్ మరియు రూట్ మ్యాప్ ప్రకారం జరుగుతున్నట్లుగా ఉన్నదని.. విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ తొలినుంచి కూడా.. తాను ఎక్కడెక్కడ సభలు పెట్టదలచుకుంటున్నారో.. ఆయా ప్రాంతాల్లో సమస్యలను ఐడెంటిఫై చేసి.. ఆ సమస్యల్లో ఉన్నవారు తనను ఆశ్రయించే వాతావరణాన్ని సృష్టించి.. ఆ తరువాత ఆ ప్రాంతంలో తాను పర్యటించి.. మెసయ్య లాగా హామీలు గుప్పించే టెక్నిక్ ను ఫాలో అవుతూనే ఉన్నారు.

ఆ లెక్కన శ్రీకాకుళంతోనే ఈ రూట్ మ్యాప్ సమస్యల ప్రస్తావన మొదలైంది కూడా! గతంలో ఉద్ధానం సమస్య తన దృష్టికి వచ్చిన తరవాత అక్కడకు వెళ్లి ఓ సభ పెట్టారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా పార్క్ బాధితులకు తన వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకునే అవకాశం ఇచ్చి.. ఆ పిమ్మట తను వెళ్లి వారి తరఫున పోరాడుతానన్నారు. మధ్యలో కాస్త తెలంగాణ కలర్ కూడా ఇచ్చారు. అనంతపురం కరవు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తా అని అక్కడ సభలు పెట్టి చెప్పారు. దానికి కాస్త ముందుగా ధర్మవరం చేనేత కార్మికుల్ని తన వద్దకు రప్పించుకుని.. ఆ తర్వాత తాను అనంతపురంలో పర్యటించినప్పుడు.. వారి దగ్గరకెళ్లి మీకు అండగా నేనుంటా అని హామీలు గుప్పించారు. ఏపీలోని మూడు ప్రాంతాలు ఉత్తరాంద్ర - కోస్తాంధ్ర - రాయలసీమ ఒక విడత కవర్ అయ్యాయి గనుక.. మళ్లీ ఉత్తరాంధ్రతో మత్స్యకారుల సమస్యలతో ప్రారంభిస్తున్నారు.

జరిగిన వాటిని సమీక్షిస్తే.. పవన్ వెళ్లి వచ్చారు... సీఎంతో కూడా కలిశారు.. ప్రకటనలు చేశారు.. అంతా బాగానే ఉంది. ఉద్ధానం బాధితులకు ఏం ఒరిగింది. ఆక్వా పార్కు విషయంలో చివరివరకు వారికి అండగా ఉంటానని చెప్పిన పవన్ కల్యాణ్ ఎందుకు కాడి పక్కన పారేశారు.. ఇవన్నీ సందేహాలే. ఇలాంటి నేపథ్యంలో ఈనెల 21న మత్స్యకారులతో సభలు నిర్వహించినా.. వీటి మాదిరిగా కాకుండా.. మరింత నిర్దిష్టంగా ఆయన వారికి భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నారు.