Begin typing your search above and press return to search.

ముఖ్యమంత్రి కుర్చీలో పవన్....?

By:  Tupaki Desk   |   10 Jan 2022 12:30 AM GMT
ముఖ్యమంత్రి కుర్చీలో పవన్....?
X
అన్న చిరంజీవికి అపారమైన ప్రజాదరణ ఉంది. కానీ ఆయన ప్రజారాజ్యం పెడితే కేవలం 18 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక లాభం లేదనుకుని ఆయన కాంగ్రెస్ లో పార్టీని కలిపేశారు. కేంద్ర మంత్రిగా కొన్నాళ్ళు పాలించి రాజకీయాలకు గుడ్ బై కొట్టేశారు. తమ్ముడు పవన్ మాత్రం తన రూట్ అది కానే కాదంటున్నారు. ఎలాగైనా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాల్సిందే అన్నది ఆయనకే కాదు, జనసైనికుల పంతం పట్టుదలగా ఉంది.

ఒక వైపు టీడీపీ వైపు నుంచి జనసేనకు ఓపెన్ ఆఫర్ ఉంది. తాము రెడీ అని జనసేన ఓకే అంటే పొత్తు కధ సుఖాంతమని చంద్రబాబు కుప్పం టూర్లో దాదాపుగా చెప్పేశారు. ఒక విధంగా బంతిని పవన్ కోర్టులో వేశారు. మరి పవన్ కళ్యాణ్ అంత ఈజీగా ఒప్పుకుంటారా అన్నదే ఇక్కడ చర్చ. ఆయన 2014 నాటి జనసేన నాయకుడు కాదు, 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి ఆరేడు శాతం ఓట్లు సాలిడ్ గా జనసేనకు ఉన్నాయని నిరూపించుకున్నారు.

ఇక వచ్చే ఎన్నికల నాటికి జనసేనకు ఓట్ల శాతం మరింతగా పెరగవచ్చు. దాంతో పాటు బలమైన సామాజిక వర్గానికి నేత కూడా. ఇక ఈసారి కాకపోతే మరెప్పుడు అన్న హార్డ్ కోర్ జనసైనికుల కోరిక ఒక్కటే ఉంది. అదే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడమే. పవన్ కళ్యాణ్ కి ఎంతసేపూ చంద్రబాబును సీఎం ని చేయడమే పని కాదు కదా. గతంలో ఆయన పోటీ చేయలేదు, సీట్లు కోరలేదు. అలా ఒక విశాలమైన ప్రయోజనాన్ని కోరి మరీ బాబుకు ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చేశారు. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా అలా కాదు అనే చెబుతున్నారు. టోటల్ సీట్లలో సగానికి సగం సీట్లు పొత్తులో భాగంగా కోరుతారు అంటున్నారు.

అంతే కాదు, ముఖ్యమంత్రి పదవి కూడా చెరిసగం అన్న లెక్కను కూడా ముందుకు తెస్తున్నారు. జగన్ని గద్దె దించడం చంద్రబాబుకు చాలా అవసరం. పైగా ఒంటరిగా టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఎలాగూ పోటీ చేయలేదు. మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ కి కూడా ఈ ఎన్నికలు కీలకమే. ఈసారి ఓడితే మళ్లీ పార్టీని నడపడం కష్టం. ఇలా ఇద్దరికీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.

అదే టైమ్ లో చంద్రబాబుకే ఎక్కువ పొత్తుల అవసరం ఉంది అని జనసైనికుల భావనగా ఉంది. పవన్ కి ఎటూ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బీజేపీ ఆఫర్ చేసేసింది. మరి ఆ పార్టీని వదులుకుని టీడీపీ వైపు రావడం అంటే కనుక భారీ రాజకీయ లాభం ఉండాలి కదా. ప్రస్తుతం ఇదే విషయాన్ని జనసైనికులు మెల్లగా బయటపెడుతున్నారు. విశాఖకు చెందిన జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయ‌ణ అయితే కుండబద్ధలు కొట్టేశారు.

టీడీపీతో తమ పార్టీ పొత్తు అంటూ ఉండాలీ అంటే పవన్ని సీఎం అభ్యర్ధిగా టీడీపీ ఒప్పుకోవాల్సిందే అంటున్నారు. తమ దృష్టిలో వైసీపీ టీడీపీ రెండూ రాష్ట్ర ద్రోహుల పార్టీలే అని కూడా చెబుతున్నారు. చంద్రబాబుని సీఎం చేయడం జనసేన అజెండా కానే కాదని తోసిపుచ్చుతున్నారు. అయితే ఈసారి పవన్ని సీఎం చేయడానికి టీడీపీ సిద్ధమేనా అని కూడా ఆయన నిలదీస్తున్నారు.

ఇలా బయటకు జనసేన మాట్లాడడం వెనక టీడీపీని లొంగదీసే వ్యూహం ఉందని అంటున్నారు. అదేంటి అంటే ఏకంగా అయిదేళ్ల పాటు చంద్రబాబు సీఎం గా కాకుండా చెరి రెండున్నరేళ్ళు సీఎం పదవిని బాబు పవన్ పంచుకునేలా అన్న మాట. అంటే 2024 ఎన్నికల తరువాత ఈ కూటమి గెలిస్తే తొలి అర్ధభాగం చంద్రబాబు సీఎం అయినా రెండవ అర్ధభాగం పవన్ అవడానికి అన్న మాట. మరి ఈ ప్రతిపాదనకు కనుక టీడీపీ ఓకే చెబితే ఏపీలో ఈ రెండు పార్టీలు చేతులు కలిపేసినట్లే అనుకోవాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో.