అధికారం మీద ఆశలేదన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉత్తరాంధ్ర పర్యటనలో సీఎం అవుతానని.. తనను గెలిపించండని ప్రజలను కోరుతున్నారు. గడిచిన ఎన్నికల్లో తనకు అనుభవం లేదని పవన్ కళ్యాన్ పోటీ చేయలేదు. అనుభవశాలి నాయకులున్న బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతిస్తున్నట్టు ప్రజలకు వివరించారు. నాడు పరిపాలనలో జగన్ కు అనుభవం లేదన్న పవన్ నాలుగేళ్లు గడిచాక ఇప్పుడు ఏం అనుభవం వచ్చిందని.. తనను సీఎంను చేయాలని కోరడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
దేశంలో ట్రెండ్ మారింది. నవ యువకులకు - కొత్త వారికి జనం పట్టం కడుతున్నారు. అలానే దూసుకొచ్చాడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. కొత్త ఆలోచనలతో కొత్త పరిపాలనతో తనదైన ముద్ర వేస్తున్నాడు. అనుభవం ప్రాతిపదికన పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం అయితే కేజ్రీవాల్ సీఎం కాకూడదు. కానీ ఆయన అయ్యాడు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా పరిపాలిస్తూ సత్తా చాటుతున్నాడు.
చంద్రబాబుకు అపార అనుభవం ఉందని మద్దతిచ్చానన్న పవన్.. ఇప్పుడు చంద్రబాబే టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నాడు. అనుభవం లేని తనకు ఓటేయాలని ప్రజలను కోరుతున్నాడు. టీడీపీది దుష్టపాలన అంటూ దుర్భాషలాడుతున్నాడు. నాలుగేళ్ల కింద చెప్పిన మాటలకు ఇప్పుడు చెబుతున్న మాటలను బట్టి కంప్లీట్ గా రూటు మార్చిన పవన్ వైఖరి ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
పవన్ పెట్టిన జనసేనకు అస్సలు కార్యకర్తల బలం లేదు. పవన్ తప్పితే తెలిసిన ముఖమే ఆ పార్టీలో లేదు. అలాంటి పవన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తీరుతానంటూ శపథాలు చేస్తున్నాడు. అధికారం సాధించి సమస్యలను పరిష్కరిస్తానని భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నాడు. అధికారం మీద ఆశ ఉందని జగన్ ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న పవన్ తననే సీఎం చేయాలని ఎలా కోరుతున్నాడో అర్థం కాని పరిస్థితి. అధికారం మీద ఆశ జగన్ కు ఉండొద్దు.. కానీ తనకు ఉండొచ్చని పవన్ కలలు కనడం ఏం నీతియో అర్థం కాని పరిస్థితి. పక్కవారు అలా అంటే ఆశ అంటున్న పవన్ తన కోరికను మాత్రం సమర్ధించుకోవడం అందరినీ విస్మయపరుస్తోంది.. ప్రస్తుతం పవన్ మాట్లాడుతున్న మాటలు ఆయనలోని అపరిపక్వతకు - అజ్ఞానానికి కారణమని రాజకీయ పండితులు సెటైర్ వేస్తున్నారు.