Begin typing your search above and press return to search.

పీకే మార్కు ర్యాలీ..ఇసుక కొరతపై విశాఖలో కదం తొక్కుతారట!

By:  Tupaki Desk   |   20 Oct 2019 1:29 PM GMT
పీకే మార్కు ర్యాలీ..ఇసుక కొరతపై విశాఖలో కదం తొక్కుతారట!
X
జనసేనాని పవన్ కల్యాణ్ ఏది చేసినా... నిజంగా ప్రత్యేకమేనని చెప్పక తప్పదు. బయటకు వచ్చారంటే... ఇంటికెళ్లేందుకు చాలా సమయమే తీసుకునే పవన్... ఇంటికెళితే కూడా బయటకు వచ్చేందుకు చాలా సమయమే తీసుకుంటారు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించిన పవన్ కల్యాణ్... జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై పోరాటాలు చేయాలని తీర్మానించారు. ఈ మేరకు ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన పవన్... పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో సుధీర్ఘంగా మంతనాలు సాగించారు. పొద్దున మొదలైన ఈ భేటీ సాయంత్రం దాకా గంటల తరబడి సాగింది. ఈ సుధీర్ఘ భేటీలో పవన్ తీసుకున్న నిర్ణయమేమిటన్న విషయానికి వస్తే... ఏపీలో ఇసుక కొరత కారణంగా పని లేకుండా పోయిన భవన నిర్మాణ కార్మికుల కష్టాలకు మద్దతుగా వచ్చే నెల 3న విశాఖలో భారీ ర్యాలీ చేపట్టాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు.

మొన్నటికి మొన్న ఉత్తర భారతం వెళ్లి పుణ్యక్షేత్రాలను సందర్శించుకుని వచ్చిన పవన్... గడచిన రెండు, మూడు రోజులుగా పార్టీకి సంబంధించిన ఏపీ వ్యవహారాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై తనదైన శైలి సమీక్షలు చేస్తున్న పవన్... జగన్ సర్కారు తీసుకున్న ఇసుక పాలసీ, మద్యం పాలసీ, ఉద్యోగ నియామకాలపై ఓ కన్నేసీ ఉంచాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూగా మారిన ఇసుక కొరతపై ధర్నాలు చేయాలని పవన్ నిర్ణయించినట్లుగా సమాచారం. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక... ఇష్టారాజ్యంగా ఇసుక తరలింపుపై కొరడా ఝుళిపించారు. కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఈ పాలసీ ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాని నేపథ్యంలో ఇసుక కొరత ఏర్పడింది. ఫలితంగా భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో భవన నిర్మాణ కార్మికులకు అసలు పనే దొరకడం లేదన్నది విపక్షాల వాదన.

ఇదే వాదనను భుజానికెత్తుకున్న పవన్... భవన నిర్మాణ కార్మికుల కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా ఓ భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీని భవన నిర్మాణాలు భారీ ఎత్తున కొనసాగుతున్న విశాఖలో చేపడితే బాగుంటుందని ఆదివారం నాటి పీఏసీ తీర్మానించిందట. ఈ భేటీలోనే సుదీర్ఘంగా చర్చలు జరిపిన పవన్.. వచ్చే నెల 3న మధ్యాహ్నం 3 గంటలకు విశాఖలో భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ర్యాలీకి తేదీలు, టైమింగ్ లు ఖరారైనా... ర్యాలీని ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడ ముగించాలి? ఏ రూట్లో వెళ్లాలి? అనే విషయాలపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదట. ర్యాలీకి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో త్వరలోనే మిగిలిన విషయాలను ఖరారు చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది. మరి ఈ ర్యాలీతో జగన్ సర్కారుపై పవన్ ఏ మేరకు ఒత్తిడి తీసుకురాగలుగుతారో చూడాలి.