Begin typing your search above and press return to search.

విలేక‌రి క్లారిటీగానే ఉన్నారు..లేనిది ప‌వ‌న్‌కేనా?

By:  Tupaki Desk   |   21 March 2018 5:26 AM GMT
విలేక‌రి క్లారిటీగానే ఉన్నారు..లేనిది ప‌వ‌న్‌కేనా?
X
స‌గ‌టు రాజ‌కీయ నేత మాదిరే ప‌వ‌న్ తీరు ఉంటుందా? మిగిలిన వారిలా కాకుండా భిన్న‌మైన తీరు ఆయ‌న‌లో ఏమీ లేదా? గ‌డిచిన మూడు.. నాలుగు రోజులుగా ప‌వ‌న్ తీరు చూస్తే ఈ డౌట్ రాక మాన‌దు. పెదాల నుంచి వ‌చ్చే ప్ర‌తి మాటకు ముందు గుండెల్లో ఎంతో అంత‌ర్మ‌ధం జ‌రిగిన త‌ర్వాతే త‌న మాట బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని.. బాధ్య‌త‌తో మాట్లాడ‌తాన‌ని చెప్పే ప‌వ‌న్ మాట‌ల్లో నిజం పాళ్లు త‌క్కువ‌న్న వైనం తాజా ఎపిసోడ్ చెప్పేసింది.

నోరు జారితే.. ఆ విష‌యాన్ని హుందాగా ఒప్పుకొని.. తాను అనుకున్న‌ది ఏమిటి? తానేం చెప్పాల‌నుకున్న విష‌యాన్ని చెప్పేస్తే బాగుండేది. కానీ.. ప‌వ‌న్ ఆ ప‌ని చేయ‌లేదు. తాను త‌ప్పుగా చెప్పిన మాట‌ను క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. నాలుక మ‌డ‌తేసిన‌ట్లు మాట్లాడిన ప‌వ‌న్ మాట‌లు ఇప్పుడు ఆయ‌న ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మారాయి.

సీఎన్ ఎన్ న్యూస్18 ఛాన‌ల్ విలేక‌రికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాష్ట్రానికి హోదా త‌ప్ప‌నిస‌రిగా కావాల‌న్న మాట స్థానే.. ప‌వ‌న్ మాట మారిపోయింది. గ‌తంలో అరుణ్ జైట్లీ నోటి నుంచి వ‌చ్చిన మాట‌ను య‌థాత‌ధంగా చెప్ప‌టం చాలామందిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. హోదా ఇవ్వ‌లేమ‌ని.. దానికి స‌మాన‌మైన ప్ర‌యోజ‌నాల్ని ప్ర‌త్యేక ప్యాకేజీ ద్వారా అందిస్తామ‌న్న మాట త‌ర‌హాలోనే ప‌వ‌న్ తాజా మాట‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

తాము హోదాకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని.. తాను ఇంట‌ర్వ్యూ ఇచ్చిన విలేక‌రి త‌ప్పుగా అర్థం చేసుకోవ‌టంతో ఇబ్బంది ఏర్ప‌డిన‌ట్లుగా జ‌న‌సేన వెల్ల‌డించింది. నిజంగానే విలేక‌రి త‌ప్పుగా అర్థం చేసుకున్నారా?.. కీల‌క‌మైన అంశంలో ప‌వ‌న్ లాంటి నేత చేసిన వ్యాఖ్య‌ను త‌ప్పుగా కోట్ చేసే ఛాన్స్ ఉందా? అన్న డౌట్ ప‌లువురిలో వ్య‌క్త‌మైంది.

తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం.. విలేక‌రి త‌ప్పు చేయ‌లేద‌ని.. ప‌వ‌న్ నాలుకే మ‌డ‌త‌బ‌డింద‌న్న విష‌యం రుజువైన‌ట్లుగా తెలుస్తోంది. తానిచ్చిన ఇంట‌ర్వ్యూలో హోదా ప్ర‌స్తావ‌న తీసుకురాని ప‌వ‌న్‌.. పేరు ఏదైనా నిధులు ఇవ్వ‌ట‌మే ముఖ్య‌మ‌న్న మాట‌ను ఒక‌టికి రెండుసార్లు నొక్కి మ‌రీ చెప్ప‌టం క‌నిపించింది.

ప్ర‌త్యేక హోదా ఉండ‌బోద‌ని.. ప్యాకేజీయే ఇస్తామ‌ని మోడీ స‌ర్కారు చెబుతోంది.. బీజేపీ వైఖ‌రి ఇదే అయితే.. అంటూ విలేక‌రి మాట‌కు అడ్డుప‌డి మ‌రీ ప‌వ‌న్ జ‌వాబిస్తూ.. మీరు ఏ పేరైనా పెట్టండి.. నిధుల అవ‌స‌రం ఉంది.. పారిశ్రామిక రాయితీల అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌త్యేక హోదా లేద‌ని కేంద్రం అంటోంది క‌దా అని విలేక‌రి ప్ర‌శ్నిస్తున్న వేళ‌.. స‌ద‌రు విలేక‌రి ప్ర‌శ్న పూర్తి కాక ముందే మ‌ధ్య‌లో క‌ల్పించుకొని.. పేరు ఏదైనా.. ఏమైనా.. పేరు అస‌లు విష‌యం కాదు.. ఇటీవ‌ల జేఎఫ్‌ సీలో ఏం కావాలో తేల్చాం.. అవ‌స‌రాలు ఏమిటి? ఏమిస్తారో చెప్పాల‌న్నాం.. పేరు ఏదైనా పెట్టుకోండంటూ ప‌వ‌న్ చెప్పిన మాట‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ఇంత క్లారిటీగా మాట్లాడిన ప‌వ‌న్‌.. త‌ర్వాత మాత్రం విలేక‌రి త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌న్న ఖండ‌న ప్ర‌క‌ట‌న చూస్తే.. తాను చేసిన త‌ప్పును స‌ద‌రు విలేక‌రి మీద తోసిన వైనం స్ప‌ష్ట‌మ‌వుతుంది. త‌న మాట‌లతో పార్టీకి జ‌రిగే డ్యామేజ్ ను దృష్టిలో ఉంచుకొనే ప‌వ‌న్ నాలుక మ‌డ‌త ప‌డింద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.