Begin typing your search above and press return to search.

పవన్ పట్టించుకోలేదా ?

By:  Tupaki Desk   |   19 Nov 2021 2:30 PM GMT
పవన్ పట్టించుకోలేదా ?
X
జనసేన పవన్ కల్యాణ్ వ్యవహారం చూస్తుంటే ఎన్నికల ఫలితాలను పట్టించుకున్నట్లు లేదు. ఎందుకంటే గెలుపుపై పెద్దగా సంబరాలు లేవు. ఓటమిపై విశ్లేషణలు అవసరమూ లేదు. మొన్నటి మున్సిపల్ వార్డుల్లో జనసేన గెలిచింది మొత్తం 5 వార్డుల్లో మాత్రమే. ఆకివీడులో 3 వార్డులు, దాచేపల్లి, గురజాల మున్సిపాలిటీల్లో చెరో వార్డులో గెలిచింది. జనసేన ఎన్నివార్డుల్లో గెలిచినా లాభమే అన్నట్లుగా ఉంది. ఎందుకంటే పార్టీకంటు ఉన్న ఓటుబ్యాంకు లేదు. అలాగని కొత్తగా వచ్చిందని సంబరపడేంత ఓటుబ్యాంకు లేదు.

పార్టీ పెట్టి ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతున్నా పార్టీ నిర్మాణం మీద పవన్ కు పెద్దగా శ్రద్ధే లేదు. ఏ పార్టీకైనా ఆయువుపట్టు కమిటీలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిరమిడ్ ఆకారంలో రాష్ట్రస్ధాయి కమిటితో మొదలుపెట్టి అట్టడుగున గ్రామస్ధాయి కమిటిలు వరకు వేస్తేనే జనాల్లోకి ఏ పార్టీ అయినా వెళ్ళగలుగుతుంది. కానీ పవన్ మాత్రం అదేమీ ఆలోచించకుండా తనిష్టం వచ్చినపుడు ఏదో కమిటీలు నియమించామని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. అందుకనే పార్టీ నిర్మాణం మీద పెద్ద శ్రద్ధ ఉన్నట్లు లేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇక తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలో జనసేన నుండి ఒక్కటంటే ఒక్క మీడియా రిలీజ్ కూడా లేదు. స్ధానిక సర్దుబాట్ల పేరుతో మిత్రపక్షం బీజేపీతో కాకుండా టీడీపీతో కలిసి పోటీచేసింది. అయితే చాలా చోట్ల జనసేన అసలు ప్రభావమే చూపలేకపోయింది. రాయలసీమ, కోస్తా జిల్లాలనే తేడా లేకుండా ఎక్కడ కూడా సరైన పోటీ కూడా ఇవ్వలేకపోయింది వైసీపీకి.

నిజానికి తాజా పోటీని పవన్ అసలు సీరియస్ గా తీసుకున్నట్లే లేదు. ఎందుకంటే జనసేన అభ్యర్ధులకు ఓట్లు వేయమని కూడా ఓటర్లకు అప్పీలు కూడా చేయలేదు. పోనీ పార్టీలోని కీలక నేతలెవరైనా ప్రచారం చేశారా అంటే అదికూడా లేదు. అందుకనే చాలా పంచాయితీల్లో అసలు జనసేన అభ్యర్ధులు పోటీ చేస్తున్న విషయాన్ని కూడా జనాలు పట్టించుకున్నట్లు లేదు. ఒకవైపు టీడీపీ అన్నింటిలోను పోటీచేసి రెండింటిలో గెలిచి మిగిలిన చోట్ల ఓడిపోయింది.

నెల్లూరు కార్పొరేషన్లో క్లీన్ స్వీప్ చేయించుకుని కుప్పంలో ఘోరంగా ఓడిపోయింది. గెలుపును పక్కనపెట్టేస్తే ఓటమిని ఎలా సమర్ధించుకోవాలో తెలీక నానా అవస్తలు పడుతోంది. ఓటమిపై చంద్రబాబునాయుడు, లోకేష్, అచ్చెన్న తమ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మరిలాంటి సమస్యలేవీ పవన్ కు లేవు. అందుకనే ఫలితాలు వచ్చి 24 గంటలు గడిచినా పవన్ నుండి ఒక్క ప్రకటన కూడా కనబడలేదు. అందుకనే పవన్ సైలెన్స్ కి అర్ధం తెలియటంలేదు.