Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ళ్యాణ్.. 2024కు క్లూ ఇచ్చాడుగా!

By:  Tupaki Desk   |   14 Dec 2021 2:30 AM GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్.. 2024కు క్లూ ఇచ్చాడుగా!
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం మాట్లాడినా.. దానిలో ఆయ‌న ఫ్యూచ‌ర్‌నో.. పాస్ట్‌నో.. చెప్ప‌క‌నే చెప్పేస్తాడు. త‌న‌కు తెలియ‌కుం డానే క్లూ ఇచ్చేస్తాడు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డ ఎప్పుడు ప్ర‌సంగించినా.. దానిపై అనేక విశ్లేష‌ణ‌లు, వివ‌ర‌ణ‌లు వ‌స్తుంటాయి. రాజ‌కీయంగా ఆయ‌న వేసే అడుగులు.. దాని వెనుక ఉన్న మ‌ర్మాలు కూడా ప‌వ‌న్ నోటి నుంచి ఒక్కొక్క‌సారి దొర్లుకుంటూ వ‌స్తాయి. రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి ఎవ‌రికైనా అధికార‌మే ప‌ర‌మావ‌ధి. ఈ విష‌యంలో ఎవ‌రూ తీసిపోరు. అయితే.. ప‌వ‌న్ ఒక్కొక్క‌సారి త‌న‌కు అధికారం అవ‌స‌రం లేదు.. అంటాడు. ఇంకొక్క‌సారి.. కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడదా? అని ప్ర‌శ్నిస్తాడు. సో... ప‌వ‌న్ మాట్లాడితే అదో గ‌మ్మ‌త్తుగా ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా చెబుతుంటారు.

తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని.. ప్రైవేటీక‌రించ‌డాన్ని వ్యతిరేకిస్తూ.. మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యంలో ఒక రోజు దీక్ష‌(కొన్ని గంట‌లు) చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్ర‌5గంట‌ల వ‌ర‌కు చేసిన దీక్ష అనంత‌రం ఆయ‌న ప్రసంగించారు. స‌హ‌జ ధోర‌ణిలోనే ప‌వ‌న్ ప్ర‌సంగం సాగింది. అయితే.. ఈ సారి తాట తీస్తా, తోలు తీస్తా, మోకాళ్ల‌పై నిల‌బెడ‌తా.. అనే డైలాగులు లేక‌పోయినా.. వైసీపీ నేత‌ల‌పై రౌడీలు, గూండాలు.. అంటూ ఒకింత హీటెక్కించారు. అయితే.. యావ‌త్ ప్ర‌సంగంలో ఎక్క‌డా ఆయ‌న బీజేపీని కానీ, టీడీపీని కానీ.. ఒక్క‌మాట కూడా అన‌లేక‌పోయారు. ఇక్క‌డ ఎందుకుఅనాలి? అనేప్ర‌శ్న వ‌స్తే.. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రిస్తామ‌ని ప‌దే ప‌దే చెబుతున్న‌ది బీజేపీ కాబ‌ట్టి.

ఇక‌, ఈ ప్రైవేటు ప్ర‌తిపాద‌న వ‌చ్చింది గ‌త టీడీపీ హ‌యాంలోనే క‌నుక‌! ఈ రెండు పార్టీల‌ను ప‌క్క‌న పెట్టి.. కేవ‌లం వైసీపీపై విమ‌ర్శ‌లు చేయ‌డానికే ప‌వ‌న్ త‌న సుదీర్ఘ స‌మ‌యాన్ని వినియోగించుకున్న‌ట్టు అర్ధ‌మైంది మొత్తం గంటా 48 న‌నిమిషాల ప్ర‌సంగంలో.. గ‌తం నుంచి ప్ర‌స్తుతం వర‌కు.. అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావించాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఒక చిత్ర‌మైన ప్ర‌తిపాద‌న‌లు చేశాడు. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల వ‌ర‌కు వైసీపీ దాష్టీకాల‌ను భ‌రించాల్సిందే..(అంటే.. తానేమీ అడ్డుకోలేన‌ని.. పోరాడ‌లేనని చెప్పిన‌ట్టు పార్టీ శ్రేణులే భావిస్తున్నాయి) అని తేల్చేశారు. అదేస‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. విజ్ఞ‌త‌తో ఓటేయాల‌ని ప్ర‌జ‌ల‌కు చెప్పారు. డ‌బ్బుకు ఓట్లు అమ్ముకోవద్ద‌ని.. చెప్పారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఈ క్ర‌మంలోనే మ‌రో కీల‌క విష‌యాన్ని కూడా ప‌వ‌న్ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. 2014 ఎన్నిక‌ల్లో ఓట్లు చీల‌కుండా ఉండాలి అనే తాను పోటీ చేయ‌కుండా ఉన్న‌ట్టు చెప్పాడు. అందుకే తాను పార్టీ పెట్టికూడా ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న‌ట్టు ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. అంటే దాన‌ర్ధం.. 2024 ఎన్నిక‌ల్లో ఓట్లు చీల‌కుండా ఉండాలంటే.. ఎవ‌రితో అయినా.. పొత్తు పెట్టుకోవాల‌నే అర్ధం అని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేస‌మ‌యంలో విశాఖ ఉక్కు విష‌యంలో టీడీపీని ఏమీ అన‌లేదు. ``మీరు అధికారంలో ఉన్న‌ప్పుడే.. క‌దా.. కేంద్రం ఈ ప్ర‌తిపాద‌న‌ను తీసుకువ‌చ్చింది. అప్ప‌ట్లో మీ నాయ‌కులే కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు`` అని తెలిసి కూడా ప‌వ‌న్ ఉద్దేశ పూర్వ‌కంగానే ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టాడు.

ఇక‌, కేంద్రంలోని బీజేపీ ఎన్ని పార్టీలు విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. విశాఖ‌లో ఉద్యోగులు ఉద్య‌మిస్తున్నా.. కూడా ప‌ట్టించుకోకుండా.. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించి తీరుతామ‌ని చెబుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ పార్టీని కూడా టార్గ‌టె్ చేయాలి.(వాస్త‌వాలు మాట్లాడి ఉంటే) కానీ.. ఎక్క‌డా ప‌వ‌న్ ప‌న్నెత్తు మాట అన‌లేదు. అంటే అటు మాజీ ముఖ్య‌మంత్రిని.. గ‌తంలో పాలించిన పార్టీని ఎక్క‌డా బాధ్యుల‌ను చేయ‌లేదు. ఇక‌, తాను పొత్తు పెట్టుకున్న బీజేపీ ఇంత ప‌నిచేస్తున్నా.. ఒక్క‌మాట అన‌లేదు. వైసీపీకి ఉన్న 22 మంది ఎంపీల‌ను మాత్రం మీరు మాట్లాడాలి.. అని సెల‌విచ్చారు. దీనిని బ‌ట్టి.. 2024 ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా.. టీడీపీ, బీజేపీతో పొత్తు ఖాయ‌మ‌నే సంకేతాలు ఆయ‌న ప‌రోక్షంగా ఇచ్చిన‌ట్టేన‌ని అంటున్నారు నెటిజ‌న్లు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.