Begin typing your search above and press return to search.

పవన్ ఆప్షన్ ఇదే...బీజేపీ ఆప్షన్ ఏది....?

By:  Tupaki Desk   |   18 Oct 2022 5:30 PM GMT
పవన్ ఆప్షన్ ఇదే...బీజేపీ ఆప్షన్ ఏది....?
X
కొద్ది నెలల క్రితం మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ పార్టీ ముందు మూడు ఆప్షన్లు ఉన్నయని చెప్పారు. అందులో మొదటిది జనసేన టీడీపీ బీజేపీ కలసి ముందుకు సాగడం, రెండవది జనసేన బీజేపీ ఎన్నికలను ఎదుర్కోవడం, మూడవది ఒంటరిగా పోటీ చేయడం అని చెప్పారు. కానీ నాడు చాలా మందికి ఒక డౌట్ వచ్చింది. పవన్ నాలుగవ ఆప్షన్ ఎందుకు చెప్పలేదని. ఆ ఆప్షన్ ఏంటి అంటే టీడీపీ జనసేన కలసి పొత్తులతో ముందుకు సాగడం.

ఈ విధంగా చూస్తే పవన్ చెప్పని నాలుగవ ఆప్షన్ నే ఇపుడు ముందుకు తెచ్చారు. ఒక విధంగా కమలానికి జనసేనాని ఆలోచనలు ఆయన వ్యూహాలు అన్నీ తెలిసినా తమను తాము మభ్యపెట్టుకుంటూ మాతోనే పవన్ అంటూ ఇన్నాళ్ళు చెప్పుకొచ్చింది. క్లారిటీ అయితే పవన్ కి ఉంది బీజేపీకి ఉంది. కానీ పవన్ నోరు విప్పి తన ఆప్షన్ ఏంటో చెప్పేంతవరకూ తామెందుకు తొందరపడాలని బీజేపీ భావించే ఇన్నాళ్ళూ అలా చేసింది అనుకోవాలి.

ఇదిలా ఉంటే ఇపుడు పవన్ వైసీపీని ఎదిరించడానికి టీడీపీతో కలసి పోరాడుతామని చెప్పారు అంతే కాదు బీజేపీకి కలలో కూడా గిట్టని వామపక్షాలను కూడా కలుపుకుని పోతామని అంటున్నారు. దీంతో బీజేపీకి గట్టి షాకే అని అంటున్నారు. ముందు రోజే సోము వీర్రాజు వెళ్ళి పవన్ని కలిసి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడిగా పోరు చేస్తామని అన్నారు. కానీ టీడీపీ ప్రస్థావన ఎక్కడా తీసుకురాలేదు. కానీ ఈ రోజు పవన్ మాత్రం టీడీపీ వామపక్షాలతో అయినా నడుస్తామని తమ కూటమిలో ఏఏ పార్టీలు ఉంటాయో చెప్పేశారు అంటున్నారు.

ఇపుడు ఆలోచించుకోవాల్సింది బీజేపీ మాత్రమే అని అంటున్నారు. బీజేపీ కనుక టీడీపీతో కూడా పొత్తులకు ఇష్టపడితేనే ఈ కూటమికి జై కొట్టాలి. కానీ చంద్రబాబు విషయంలో కేంద్ర నాయకత్వం ఆలోచనలు ఏమైనా మారాయా లేదా అన్నది తెలిస్తే తప్ప ఈ విషయం స్పష్టం కాదు, అది తేలాలీ అంటే తెలంగాణాలో బీజేపీది బలమా వాపా అన్నది చూడాలి. మునుగోడులో టీయారెస్ గెలిచి బీజేపీ ఓడితే దానికి అనుగుణంగా ఏపీలోనూ రాజకీయ పరిణామాలు మారుతాయని అంటున్నారు.

మొత్తానికి చూస్తే తెలంగాణాలోనూ తాము పోటీ చేస్తామని పవన్ ప్రకటించారు. చంద్రబాబు కూడా అక్కడ టీడీపీని బలోపేతం చేస్తున్నారు కాబట్టి అక్కడ రాజ్యాధికారం కోసం అయినా బీజేపీ ఏపీలో ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే అక్కడ పవన్, బాబుల సహాయం లభిస్తుంది అంటున్నారు.

ఏది ఏమైనా ఒక్క మాట పవన్ అయితే తేల్చేశారు. పక్కా క్లారిటీగా తన ఆప్షన్ ఏంటో చెప్పేశారు. ఆలోచించుకోవాల్సింది ఇక బీజేపీ మాత్రమే. బీజేపీ స్టాండ్ బట్టే ఏపీలో 2014 కాంబో రిపీట్ అవుతుందా లేదా అన్నది స్పష్టం అవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.