Begin typing your search above and press return to search.

వైసీపీకి వారం గడువు.. విశాఖ ఉక్కుపై తేల్చండి.. ప‌వ‌న్ సంచ‌ల‌న కామెంట్లు!

By:  Tupaki Desk   |   31 Oct 2021 6:00 PM GMT
వైసీపీకి వారం గడువు.. విశాఖ ఉక్కుపై తేల్చండి.. ప‌వ‌న్ సంచ‌ల‌న కామెంట్లు!
X
రాష్ట్రంలో అత్యంత ముఖ్య‌మైన విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తున్న కార్మికులు, ఉద్యోగులకు అండ‌గా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స‌భ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీ ఎంపీల‌పైనా..ప్ర‌భుత్వ విధానాల‌పైనా .. నిప్పులు చెరిగారు. అంతేకాదు.. వైసీపీ... ఈ స‌మ‌స్య‌ను తేల్చేందుకు వారం గ‌డువు ఇస్తున్నాన‌ని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై వైసీపీ సర్కార్ వారంలోగా స్పందించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నా రు. ‘‘చట్టసభల్లో మాట్లాడాల్సిన నేతలు మౌనంగా ఉంటే ఏం లాభం. వైసీపీ మాటలకు అర్థాలు వేరులే. చెప్పినమాటకు తూట్లు పొడవటమే వైసీపీ అధినేత సంకల్పం. వైసీపీ మాటలన్నీ ఆచరణలోకి రాని మాటలు. జై తెలంగాణ అంటేనే తెలంగాణ వచ్చింది. ఆంధ్రా వాళ్లకి ఏదీ మనది అనిపించదా?. స్టీల్‌ ప్లాంట్‌ కోసం పోరాడుతామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించాలి.’’ అని సూచించారు.

అంద‌రి బాధ్య‌త‌..
విశాఖ ఉక్కును కాపాడుకునే బాధ్యత అందరిదీ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాను ఒక్కడినే పోరాటం చేస్తే ఏదీ సాధ్యం కాదన్నారు. ఢిల్లీలో కూర్చున్న కేంద్రం పెద్దలకు మన కష్టాలు ఏం తెలుస్తాయి అన్నారు. ఢిల్లీ పెద్దలకు మన కష్టాలు తెలియాచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. పార్లమెంట్ లో మాట్లాడుదాం అంటే తనకు ఒక్క ఎంపీ లేరన్నారు.. ఒక్క ఎమ్మెల్యే ఉంటే వైసీపీ లాక్కుందన్నారు. మన 25 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. తాను ఓడిపోయినా పారిపోలేదన్నారు. నేరుగా ఇక్కడికే వచ్చాను అన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

కులాలు.. వ‌ర్గాల‌ను ప‌క్క‌న పెట్టండి!
స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడాల్సిన బాధ్యత కులాలు, వర్గాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరిపైనా ఉంద‌ని ప‌వ‌న్ ఉద్ఘాటించారు. ముఖ్యంగా అధికార పార్టీదే ప్రధాన బాధ్యతని తేల్చి చెప్పారు. అందుకే వైసీపీ వారం రోజుల డైడ్ లైన్ విధించాను అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎలా అడ్డుకుంటున్నాము అన్నదానిపై వైసీపీ అఖిల పక్షం ఏర్పాటు చేయాలన్నారు.. అప్పటికే వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోపోతే తాను ఏం చేస్తాను అన్నది చెప్పాను అన్నారు.

హామీ ఇస్తే పోరాడ‌తా!!
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాను ఎంత వరకు అడ్డుకోగలనే తెలియదని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. తాను ఇక్కడ నిలబడి పోరాడాలి అంటే భయమేస్తోందన్నారు. ఎందుకంటే అందరూ నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోతారనే భయం ఉందన్నారు.. అందుకే మీరంతా కచ్చితంగా నిలబడతానని హామీ ఇస్తే తాను ముందు ఉండి పోరాడుతానని హామీ ఇచ్చారు. మీరంతా వైసీపీకి ఓట్లు వేశారు కదా.. మరోసారి కూడా ఓట్లు వేసి గెలిపిస్తారంటూ సెటైర్లు వేశారు. ముఖ్యంగా గాజువాక ప్రజలు తనను ఓడించడం పై మనసులో బాధను పరోక్షంగా బయట పెట్టారు. తనకు గెలుపు ఓటములతో సంబంధం లేదని.. తాను.. జనసేన, జన సైనికులు అంతా ప్రజల తరపునే పోరాటం చేస్తున్న‌ట్టు చెప్పారు.

ముంద‌డుగే..
తనకు ముందడుగు వేయడం తప్ప.. వెనకడుగు వేయడం తెలీదని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే.. విశాఖ సర్క్యూట్ హౌస్ అమ్మేసినట్టు.. స్టీల్ ప్లాంట్ ను కూడా అమ్మేస్తారని మండిపడ్డారు. అందుకే అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తనకు ప్రతి రాజకీయ పార్టీ మద్దతుగా నిలవాలని పవన్ కోరారు. స్టీల్ ప్లాంట్ సమస్య తన ఒక్కడిదే కాదన్నారు.

షా అందుకే స‌మ‌యం ఇస్తున్నాడు...
రాష్ట్ర విభజన సమయంలోనూ ఏమాత్రం స్పందించలేదని ప‌వ‌న్ వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓట్ల సమయంలో మాత్రమే వైసీపీ నేత‌లు కనిపిస్తారని విమర్శించారు. స్టీల్‌ ప్లాంట్‌కి భూములు ఇచ్చిన వారికి ఇంతవరకు నష్టపరిహారం అందించలేదన్నారు. కరోనా సమయంలో దేశాన్ని ఆదుకున్న విశాఖ ఉక్కు. కేంద్ర ప్రభుత్వానికి చెప్పేముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలన్నారు. నా వెంట ప్రజలున్నారనే.. కేంద్ర మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నారు. నష్టాలు లేని వ్యాపారం అంటూ ఏదీలేదు. 18 వేల మంది రైతులు భూములు వదులకుంటే వచ్చింది విశాఖ ఉక్కుని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కోసం 32 మంది యువకులు బలిదానం. కులాలు, వర్గాలకి అతీతమైన నినాదం విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు. అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే..
విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు క‌ర్మాగారం కోసం పోరాడుతున్న వారికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. తాను అండ‌గా ఉంటాన‌ని.. ఎవ‌రూ ధైర్యం వీడ‌రాద‌ని ప్ర‌క‌టించారు. అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ఉంటేనే ఏదైనా సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు. అంతేకాదు.. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం కూడా ఎవ‌రూ క‌లిసి రాక‌పోవ‌డం వ‌ల్లే.. వ‌దిలేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. క‌నీసం విశాఖ ఉక్కునైనా కాపాడుకుందామ‌ని అన్నారు. ప‌వ‌న్ ప్ర‌సంగాన్ని నిశితంగా గ‌మ‌నించిన నెటిజ‌న్లు.. ఆయ‌న వైఖ‌రిపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తం 50 నిముషాల ప్ర‌సంగంలో వైసీపీని విమ‌ర్శించేందుకు ఆయ‌న బాగానే ప్రాధాన్యం ఇచ్చార‌ని.. కానీ, అస‌లు విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు ప‌ట్టుబ‌డుతున్న కేంద్రం పైనా.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీపైనా.. బీజేపీ నాయ‌కుల‌పైనా.. ఒక్క మాట కూడా ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని? అంటున్నారు.