Begin typing your search above and press return to search.

అందుకే ఓడిపోయాను - బీజేపీతో ఎందుకు కలిశానంటే: పవన్ కళ్యాణ్

By:  Tupaki Desk   |   17 Feb 2020 1:30 AM GMT
అందుకే ఓడిపోయాను - బీజేపీతో ఎందుకు కలిశానంటే: పవన్ కళ్యాణ్
X
గత ఎన్నికల్లో టీడీపీకి ఏ గతి పట్టిందో వైసీపీకి అదే గతి పడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసైనికులతో ఆయన సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పని చేసిందని - ఓడిన వాళ్లు బయట ఏడిస్తే - గెలిచిన వాళ్లు ఇంటికి వెళ్లి ఏడ్చారన్నారు. వైసీపీకీ ఓటేసిన వాళ్ల పనులు కూడా జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనుల గురించి నిలదీస్తే - డబ్బులు తీసుకొని ఓటేశారుగా అని ప్రశ్నిస్తున్నారని ప్రజలు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తనకు సత్యం బోధపడిందన్నారు. ఎవరు మనవాళ్లో - ఎవరు కాదో అర్థమైందన్నారు. ఈ మధ్య కర్నూలుకు వెళ్లినప్పుడు తనకు ఒకరు చెప్పారని, ప్రతి వార్డులో ఐదుగురు జనసేన కార్యకర్తలు ఉంటే - కనీసం 500 మంది అభిమానులు ఉంటారని - కానీ వాళ్లెవరూ పార్టీకి ఓటేయలేదని తెలిసిందన్నారు. తాను పర్యటనలకు వెళ్లినప్పుడు జేజేలు పలికిన అభిమానులు ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు. ఎన్నికల సమయంలో చాలామంది కులం - వర్గం - భయాలు - ప్రలోభాలకు లొంగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం నిలబడినవాళ్లు మాత్రం చాలా బలంగా పని చేస్తున్నారన్నారు.

ఒక రోగి బాగుపడాలని డాక్టర్ ఎలా కోరుకుంటాడో - అనేక రుగ్మతలు ఉన్న ఈ సమాజం మెరుగుపడాలని తాను అలాగే కోరుకుంటున్నానని జనసేనాని అన్నారు. అమరావతి విషయంలో తాను ఊహించిందే నిజమైందన్నారు. రాజధాని అంశాన్ని రెండు కులాల మధ్య గొడవలా తయారు చేశారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పింది వంద శాతం వాస్తవం అన్నారు. అయితే పరిస్థితులను మార్చి - కొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పజం జనసేనకు సాధ్యమన్నారు.

తాను రాజకీయ అధికారం కోరుకోని వ్యక్తిని కాదని - అందుకే పార్టీ పెట్టానని - ప్రజలను తనవైపు తిప్పుకునే రాజకీయాలు చేస్తానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కుళ్లు - కుతంత్రాలు ఉంటాయని, అవన్నీ తెలిసే వచ్చానని, అలాంటి రాజకీయాలను మార్చివేయాలన్నారు. ఏపీ కుల రాజకీయం వేళ్లూనుకుపోయిందని, ఇలాంటి మురికి కూపాన్ని శుద్ధి చేసేందుకే పార్టీ పెట్టానని చెప్పారు. రూ.2వేలు ఇస్తే ఓటు వేసేందుకు ఓటు వేసేందుకు బూత్‌ కు రావడం బాధాకరమన్నారు. అలాంటి పరిస్థితి మారాలన్నారు.

తన కుటుంబం, పార్టీ నడిపేందుకు డబ్బులు కావాలని, అందుకే సినిమాలు చేస్తున్నానని చెప్పారు. ఎవరికో కాంట్రాక్టులు ఇప్పించి, వారిచ్చే డబ్బును తీసుకునే వ్యక్తిని కాదన్నారు. బీజేపీతో పొత్తుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని - ప్రజల కోసం - ఏపీ భవిష్యత్తు కోసం ఆ పార్టీతో కలిసి నడుస్తున్నానని చెప్పారు. మన ఆశయాలు సాధ్యం కావాలంటే ఎవరితో కలవాలనే కోణంలోనే ఆలోచిస్తానని - కొన్ని కులాలు - మతాలు దూరమవుతాయని ఆలోచించనని చెప్పారు. సమాజం - దేశానికి ఉపయోగపడే ఆలోచనలు చేస్తానన్నారు.

జనసేన ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉంటుందన్నారు. జనసేనకు మీడియా లేకపోయినా సోషల్ మీడియా ఉందన్నారు. నేటి సమాజం దారి తప్పుతోందని - అన్నీ ఉచితం పేరుతో యువశక్తిని నిర్వీర్యం చేస్తోందని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. 2019లో జనసేన ఓడిపోలేదని, ఇష్టపడి - పార్టీపై ప్రేమతో ఒక్కరూపాయి తీసుకోకుండా ఓట్లు వేశారన్నారు.