Begin typing your search above and press return to search.

రాపాక కు పవన్​కల్యాణ్​ గట్టిషాక్​.. అటునుంచి నరుక్కొస్తున్నాడు..!

By:  Tupaki Desk   |   22 Nov 2020 9:30 AM GMT
రాపాక కు పవన్​కల్యాణ్​ గట్టిషాక్​.. అటునుంచి నరుక్కొస్తున్నాడు..!
X
2019 ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన పార్టీ జనసేన ఘోరపరాజయాన్ని చవిచూసింది. పవన్​కళ్యాణ్ 2014 ఎన్నికలకంటే ముందే జనసేనను స్థాపించినప్పటికి అప్పటి ఎన్నికల్లో పోటీచేయలేదు. అప్పట్లో ఆయన బీజేపీ, టీడీపీకి మద్దతు ప్రకటించారు. 2014 ఎన్నికల సభల్లో పవన్​కల్యాణ్​.. ప్రధాని నరేంద్రమోదీతో కూడా వేదికలు పంచుకున్నారు. పవన్​కు ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఎంతో క్రేజ్​ ఉంది. అయితే ఆ తర్వాత జనసేన , కమ్యూనిస్టులు, బీఎస్పీ వంటి ప్రోగ్రెసివ్​ పార్టీలతో జనసేన పొత్తుపెట్టుకున్నది. తనకు చెగువేరా ఆదర్శమని.. కమ్యూనిజం ఇష్టమని కూడా పవన్​కల్యాణ్​ కొన్నిసందర్భాల్లో వ్యాఖ్యానించారు.

దీంతో యువత పవన్​కల్యాణ్​కు మరింత ఆకర్షితులయ్యారు. అయితే 2019లో ఆ పార్టీ ఏపీ వ్యాప్తంగా పోటీచేసింది. అయినప్పటికీ కేవలం ఒక్కస్థానంలో మాత్రమే గెలుపొందింది. అదే తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గం.. అక్కడ రాపాక వరప్రసాద్​ జనసేన తరఫున పోటీచేసి గెలుపొందారు. మొదట ప్రజాసమస్యలపై పోరాడతానని.. ఒక్కడినే అయినా పార్టీని బలోపేతం చేస్తానని ప్రకటించిన రాపాక ఆ తర్వాత మాట మార్చారు. వైసీపీకి, ప్రభుత్వ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు. ఓ దశలో జనసేనకు వ్యతిరేకంగా వాయిస్​ వినిపించారు.

జనసేన అమరావతి రాజధానికి మద్దతు ప్రకటిస్తే.. రాపాక మూడు రాజధానులకు మద్దతు ఇచ్చారు. అనేక సందర్భాల్లో జనసేన పార్టీకి, పవన్​కల్యాణ్​కు వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ పవన్​కల్యాణ్​ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నందుకు అనర్హత వేటువేయిద్దామటంటే స్పీకర్​ వైసీపీ వ్యక్తి కాబట్టి కుదరదు. దీంతో పవన్​కల్యాణ్​ ఆలోచనలో పడ్డారు. అయితే రాపాకకు చెక్​ పెట్టేందుకు పవన్​కల్యాణ్​ మరో మార్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. నేరుగా అతడిమీద చర్యలు తీసుకోలేడు కాబట్టి రాజోలు నియోజకవర్గంలో జనసైనికులను రాపాకకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల ఆయన నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశమయ్యారు. జనసైనికులు ఎవ్వరూ రాపాక వద్దకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాపాకకు టికెట్​ ఇవ్వబోమని.. కొత్త అభ్యర్థికి కార్యకర్తలంతా సపోర్ట్​ చేయాలని సూచించారట. స్థానికసంస్థల ఎన్నికల్లో కూడా రాపాక అనుచరులకు టికెట్​ ఇవ్వొద్దని జనసేనాని నిర్ణయించుకున్నారట. ఈ సారి నిజమైన జనసేన కార్యకర్తలకు మాత్రమే ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు ఇవ్వాలని పవన్​కల్యాణ్​ నిర్ణయించుకున్నారట.

పార్టీకి హ్యాండ్​ ఇచ్చిన రాపాకకు.. పవన్​కల్యాణ్​ కీలెరిగి వాతపెడుతున్నారని జనసేన శ్రేణులు అంటున్నాయి.