Begin typing your search above and press return to search.

బాబు పాపాలు చాటేందుకు పవన్ రెడీయేనా?

By:  Tupaki Desk   |   8 Feb 2018 4:17 AM GMT
బాబు పాపాలు చాటేందుకు పవన్ రెడీయేనా?
X
పవన్ కల్యాణ్ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని మేధావులు - రాష్ట్ర సంక్షేమాన్ని ఆశించే పెద్దలతో కలిసి జేఏసీని ఏర్పాటుచేయాలని అనుకుంటున్నారు.. అంతవరకు బాగానే ఉంది...! మరి ఆ మేధావులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ లోపాలను - ఆ పార్టీ లోలోపల రాష్ట్రానికి చేస్తున్న చేటును విపులంగా ఎత్తి చెబితే, చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు ఛీత్కరించుకునే రేంజిలో వాస్తవాల్ని విశ్లేషిస్తే.. ఆ వాదనలకు కట్టుబడి ఉండడానికి, వాటి ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి పవన్ కల్యాణ్ సిద్ధంగానే ఉన్నారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

ఎందుకంటే.. పవన్ కల్యాణ్ నిన్న బుధవారం నాడు... రాష్ట్ర హక్కులు సాధించడం కోసం మేధావులతో జేఏసీ ఏర్పాటుచేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారే తప్ప.. అందులో కొన్ని మడత పేచీలు పెట్టారు. ప్రస్తుతం మీరు చంద్రబాబుకు మద్దతు ఉపసంహరించుకున్నట్టేనా అంటే ఆయన స్పష్టత ఇవ్వలేదు. బాబు చాలా కష్టపడుతున్నారని - అయినా మద్దతు ఉపసంహరించుకోవడానికి తామేమీ ప్రభుత్వంలో లేం కదా అని రకరకాలుగా ఆయన సమాధానం చెప్పారు. అంటే పవన్ కల్యాణ్ వైఖరిలో ఓ మూల చంద్రబాబు మీద సానుభూతి ఇంకా చాలానే ఉందని తెలుస్తోంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. ఏ మేధావులతో అయితే పవన్ జేఏసీ ఏర్పాటు చేయదలచుకుంటున్నారో.. వారిలో చంద్రబాబు మీద సానుభూతితో ఉన్నవారి సంఖ్య తక్కువ. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన పాలన అందిస్తున్నదో.. లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్.. అంశాల వారీగా ఎంతో విపులంగా తన జనచైతన్య సభల్లో చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ‘పరిపాలన’ అనే దానిని చంద్రబాబు ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో ఆయన అనేక మార్లు వెల్లడించారు. ఇక ఉండవిల్లి అరుణ్ కుమార్ విషయానికి వస్తే.. చంద్రబాబునాయుడు ఏయే నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఎవరెవరికి ప్రయోజనం కలిగించే దురుద్దేశాలు ఉన్నాయో.. అవినీతి ఏ రకంగా జడలు విప్పి తాండవమాడుతున్నదో, బాబు సర్కారు ఎక్కడెక్కడ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నదో ఆయన తర్కబద్ధంగా వివరించగలరు. అలాగే చలసాని శ్రీనివాస్ అయినా - రామకృష్ణ అయినా.. చట్టబద్ధంగా కేంద్రంపై పోరాడాల్సిన బాధ్యతను ఏ రకంగా విస్మరించి ప్రత్యేకహోదా అనే హక్కును - డిమాండ్ ను చంద్రబాబు ప్రభుత్వం దశలవారీగా - వ్యూహాత్మకంగా ఎలా నీరుగార్చిందో వివరించగలరు..! మరి వీరందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే జేఏసీ చంద్రబాబును ఉతికి ఆరేసే ప్రతిపాదనలు - కార్యాచరణ సిద్ధం చేస్తే ఆచరించడానికి పవన్ సిద్ధమేనా అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.