Begin typing your search above and press return to search.

చిరంజీవి బాటలో పవన్ కళ్యాణ్.. ఫలిస్తుందా?

By:  Tupaki Desk   |   11 Feb 2020 8:30 PM GMT
చిరంజీవి బాటలో పవన్ కళ్యాణ్.. ఫలిస్తుందా?
X
పవన్ కల్యాణ్ అంటే ఎక్కువ మందికి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగానే తెలుసు. అన్నయ్య బలవంతం మీదనే సినిమా రంగంలోకి వచ్చానని పవన్ కల్యాణ్ ఎన్నో వేదికల్లో తెలిపాడు. సినిమాల్లోకి వచ్చాక తనకంటూ ఓ మ్యానరిజం ఏర్పచుకొని కొద్ది కాలంలో పవర్ స్టార్ గా ఎదిగాడు. అలాగే రాజకీయాల్లోనూ అన్నయ్య వెంటే నడిచాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు పవన్ కల్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అయితే కొన్ని కారణాలతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ విలీనం చేయడం.. పవన్ కల్యాణ్ అప్పుడు రాజకీయాలకు దూరమై ఆ తర్వాత సొంతంగా జనసేన పార్టీ పెట్టడం అందరికీ తెల్సిందే. అయితే వచ్చే ఎన్నికల్లో చిరంజీవి పోటీచేసి గెలిచిన తిరుపతి స్థానం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

* అటూ సినిమాలు.. ఇటు రాజకీయాలు..
ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయాలతోపాటు సినిమాల్లో బీజీగా ఉంటున్నాడు. ఇటీవలే సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. జనసేన నుంచి పలువురు బయటికి వెళ్లిపోతున్నా అవేమీ పట్టించుకోకుండా పవన్ కల్యాణ్ సినిమాలపై దృష్టి సారించాడు. కిందటి ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఘోరంగా ఓటమిపాలయ్యాడు. స్వయంగా పవన్ కల్యాణ్ రెండుచోట్ల ఓటమి పాలవడం పార్టీని దెబ్బతీసింది. అయినా పవన్ కల్యాణ్ ఇవేమీ పట్టించుకోకుండా ముందుకెళుతున్నాడు. ప్రస్తుతం రాజకీయ పరంగా ఆయన పవన్ కల్యాణ్ కి ఎక్కువ స్కోప్ లేనందున వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నాడు. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతుంది.

*అన్నయ్యకు కలిసొచ్చింది.. మరీ తమ్ముడికి..
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని తిరుపతి లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రకటించాడు. అంతేకాకుండా అక్కడి నుంచి పోటీచేసి గెలుపొందాడు. తిరుపతిలో బలిజ సామాజిక వర్గం ఎక్కువ మంది ఉన్నారు. ఇది ఆయనకు కలిసొచ్చింది. దీంతో అన్నయ్య గెలిచిన తిరుపతి స్థానం నుంచి తమ్ముడు పవన్ కల్యాణ్ పోటీ చేయాలని ఇప్పటి నుంచి జనసేన నేతలు ఒత్తిడి తెస్తున్నారు. కిందటి ఎన్నికల్లోనే జనసేన నుంచి పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేస్తే గెలిచేవారని జనసేన నేతలు చెబుతున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి బలమైన నేత కాకపోవడం, అభ్యర్థిపై వ్యతిరేకత వల్లే ఓటమి పాలైనట్లు కార్యకర్తలు పవన్ కల్యాణ్ కు వివరిస్తున్నారట..

* తిరుపతి జనసేనానిదేనా?
ఈసారి ఎలాగైనా తిరుపతి నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు పవన్ ను డిమాండ్ చేస్తున్నారు. వీలైనంత ఎక్కువ సార్లు పవన్ తిరుపతికి వచ్చేలా కార్యకర్తలు ఇప్పటి నుంచి సిద్ధం చేసుకుంటున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉండటంతో అప్పటికీ చూసుకుందాం అంటూ పవన్ కార్యకర్తలు నచ్చజెపుతున్నారట. దీనిపై జనసేన కార్యకర్తలు తిరుపతి నుంచి పోటీ చేయాల్సిందేనంటూ భీష్మిస్తున్నారని తెల్సింది. పవన్ కెరీర్ ఒకసారి చూస్తే అన్నయ్య బాటలో నడిచిన ప్రతీసారి పవన్ సక్సస్ అయ్యినట్లే కన్పిస్తుంది. అయితే పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేస్తారా? లేక మరేదైనా స్థానం నుంచి పోటీ చేస్తారా? ఆయన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే జనసేన కార్యకర్తలు మాత్రం తిరుపతి సీటు ఈసారి జనసేనానిదేనంటూ ప్రకటిస్తుండటం గమనార్హం.