Begin typing your search above and press return to search.

సీఎం ఇంటి వద్దే ఇలాంటి దారుణాలా .. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఫైర్

By:  Tupaki Desk   |   7 July 2021 10:42 AM GMT
సీఎం ఇంటి వద్దే ఇలాంటి దారుణాలా .. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఫైర్
X
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ నేడు మంగళగిరిలో ప‌ర్య‌టనలో బిజీగా ఉన్నారు. అక్క‌డి పార్టీ ప్రధాన కార్యాలయంలో జ‌న‌సేన‌ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనాతో మృతి చెందిన వారికి‌ నివాళులు అర్పించారు. ఆ తర్వాత నంద్యాలలో మృతి చెందిన జనసేన కార్యకర్త ఆకుల సోమేశ్ కుటుంబ సభ్యులకు ఐదు లక్షల చెక్‌ను అందచేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోయారన్నారు. కరోనా కారణంగా జనసైనికులను కోల్పోవడం తనను వ్యక్తిగతంగా ఎంతో బాధించిందన్నారు. ఈ కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారన్నారు. లక్ష మంది కార్యకర్తలకు జనసేన తరపున బీమా సౌకర్యం కల్పించామని తెలిపారు. ఈ బీమా పథకానికి తన వంతుగా కోటి రూపాయలు ఇచ్చానని తెలిపారు. తర్వాత, ఆయ‌న ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి మాట్లాడారు. ఈ తరుణంలో ప‌లువురు ప్రజలు జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు త‌మ క‌ష్టాలని వివరించారు.

పవన్‌ ను నిరుద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. జాబ్ క్యాలెండర్‌ పేరుతో సీఎం జగన్ లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారని, ఎన్నికల ముందు అన్న వస్తున్నాడు అంటూ ఊదరగొట్టారని, ఏటా జాబ్ క్యాలెండర్‌ ప్రకటిస్తాం‌ అన్నారని, ఇప్పుడు ఆ ఊసే లేకుండా చేస్తూ జాబులు అడిగితే జైలుకు పంపిస్తున్నారని పవన్ కి తెలిపారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాల ఖాళీ ఉంటే.. పది‌వేలతో జాబ్ క్యాలెండర్‌ ప్రకటించి అందరనీ మోసం చేశారన్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అన్నది ఇందుకేనా అని ప్రశ్నించారు. సమస్యలపై జనసేనాని పోరాడాలని కోరుతున్నామని, ఉద్యోగాల కోసం డిగ్రీలు చేత పట్టుకుని లక్షల మంది యువత ఎదురు‌ చూస్తున్నారన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. దీనిపై పీఏసీలో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు పవన్ కళ్యాణ్.

అలాగే, అభివృద్ధి ప‌నుల పేరిట‌, సీఎం భ‌ద్ర‌త దృష్ట్యా తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యం స‌మీపంలోని త‌మ‌ ఇళ్లు ఖాళీ చేయాల‌ని ప్ర‌భుత్వం, వైసీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నార‌ని బాధితులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు తెలిపారు. ఆ భూముల‌ను త‌మ‌కు అప్ప‌జెప్పాల‌ని త‌మ‌పై దారుణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని తెలిపారు. ఖాళీ చేయ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని బెదిరిస్తున్నారని అన్నారు. పున‌రావాసం కూడా ఏర్పాటు చేయ‌కుండా ఇళ్ల‌ను లాక్కుంటున్నార‌ని ఆరోపణలు చేశారు. దీనిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందిస్తూ సీఎం గారి నివాసం ద‌గ్గ‌ర ఉన్న దాదాపు 320 ఇళ్ల‌ను ఖాళీ చేయాల‌ని అంటున్నారు. ఆయ‌న నివాసం ఉన్న చోటే ఇలాంటి దారుణాలు జ‌ర‌గ‌డం ఏంటీ, రాష్ట్ర ముఖ్య‌మంత్రి భ‌ద్ర‌త దృష్ట్యా ఖాళీ చేయిస్తున్నామ‌ని అంటున్నారు. మహిళలని కూడా చూడ‌కుండా ప‌చ్చి బూతులు తిడుతుంటే బ‌య‌ట మాన‌భంగాలు జ‌ర‌గ‌కుండా ఇంకేమి జ‌రుగుతుంటాయి అని ప‌వ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ గారికి నేను చెబుతున్నాను. మీ చుట్టుప‌క్క‌ల ఉన్న ఇళ్ల‌నే ఇలా కూల్చితే ఎలా? అంత‌గా అవ‌స‌రం ఉంటే ముందుగా పున‌రావాసం ఏర్పాటు చేసి, ప‌క్కా ఇళ్లు క‌ట్టించాలి. అంతేగానీ, అవేమీ చేయ‌కుండా భ‌య‌పెట్టి వారిని ఖాళీ చేయాల‌ని చెప్ప‌డం స‌రికాదు. వృద్ధుల‌ని కూడా చూడ‌కుండా ఊరి బ‌య‌టకు తీసుకెళ్లి పాడేస్తామ‌ని చెబుతున్నారు' అని ప‌వ‌న్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 320 కుటుంబాల‌కు ముందు పున‌రావాసం క‌ల్పించాలి. అలా చేయ‌కుండా మీరు వారిపై దారుణాల‌కు పాల్ప‌డితే జ‌నసేన ఊరుకోదు. వారికి అండ‌గా ఉంటాం జనసేన తరపున సీఎం నివాసం వద్దే ఉద్యమిస్తామని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు