Begin typing your search above and press return to search.

ఎనాల్సిస్‌ లు ఎందుకు పవన్..? ఏం చేస్తావో చెప్పు?

By:  Tupaki Desk   |   12 April 2018 2:11 PM GMT
ఎనాల్సిస్‌ లు ఎందుకు పవన్..? ఏం చేస్తావో చెప్పు?
X
ప్రశ్నిస్తాను.. అండగా నిలబడతాను.. మీ కోసమే నేను అని చెప్పే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంతకాలం ఇవేమీ చేయకపోయినా కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రత్యేక హోదా పోరులోనైనా ముందు నిలబడతారని.. ప్రజల గొంతు అవుతారని అంతా ఆశపడ్డారు. ఊహూ.. పవన్ మాత్రం మిగతా పార్టీలను, నేతలను విమర్శించడం.. వారు చేసే పనులను విశ్లేషించడం తప్పిస్తే తానేం చేస్తానన్నది మాత్రం చెప్పడం లేదు. తాజాగా ప్రత్యేక హోదా సాధన సమితి ఈ నెల 16న బంద్‌ కు పిలుపునివ్వగా దానికి మద్దతు పలకడం మినహా తానంటూ ముందు నిలబడడానికి మాత్రం ముందుకు రాలేదు. ప్రధాని మోదీ - సీఎం చంద్రబాబు - విపక్ష నేత జగన్‌ లపై విమర్శలు మాత్రం చేశారు.

హైదరాబాద్‌ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు పవన్ కల్యాణ్ తో సీపీఎం - సీపీఐ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీ తరువాత పవన్ ఏదైనా భారీ ప్రకటన చేస్తారని అంతా భావించినా ఆయన మాత్రం అలాంటి సాహసాలు చేయలేదు. ప్రత్యేక హోదా సాధనకు చేపట్టే కార్యక్రమాల కార్యాచరణ - ప్రధాన మంత్రి - బీజేపీ చేపట్టిన దీక్ష తదితర అంశాలపై మాత్రమే అక్కడ చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ భేటీ తరువాత పవన్ మాట్లాడుతూ... దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనకి లెఫ్ట్ నెంట్ గవర్నర్ - కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని నిరసన చేస్తే వెటకారమాడిన బీజేపీ నేతలే ఇప్పుడు దీక్షలు చేస్తున్నారన్నారు. మోదీ ఒక బలమైన శక్తి అని నమ్మి ఆయన వెంట నడిచానని.. కానీ, ఇప్పుడు అవిశ్వాసం చర్చకు రాకుండా చేసి మోదీ ఆ విశ్వాసం కోల్పోయారని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంలోనూ, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలోనూ భారతీయ జనతా పార్టీ తప్పులు చేసిందని.. అవిశ్వాసంపై చర్చిస్తే అవన్నీ ప్రజలకు తెలిసేవని ఆయన అన్నారు. టీడీపీ, వైసీపీల తప్పులు కూడా ఉండడంతో వారు కూడా అవిశ్వాసం చర్చకు రాకూడదనే కోరుకున్నారని.. ఇప్పుడు వారంతా ఏమీ తెలియనట్లు నిరసనలు చేస్తున్నారని అన్నారు.

విపక్షాలు పార్లమెంట్ సమావేశాలను సజావుగా సాగనీయలేదంటూ ప్రధానమంత్రి చేస్తోన్న దీక్షలో చిత్తశుద్ధి లేదని పవన్ విమర్శించారు. అవిశ్వాసాన్ని చర్చకు రాకుండా రాజకీయం చేసి ఇప్పుడు అంతా కలిసి దీక్షలు చేస్తున్నారంటూ ఆయన ప్రస్తుల పరిస్థితులను విశ్లేషించారు. అన్నీ చెప్పినా ప్రత్యేక హోదా కోసం తానేం చేస్తానన్నది మాత్రం పవన్ చెప్పలేదు. ఇంతకుముందు ఆయన అవసరమైతే ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షైనా చేస్తానన్నప్పటికీ పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్న సమయంలోనూ ఉద్యమాన్ని ఉదృతం చేయడానిక తన కార్యాచరణ ఏమీ వెల్లడించలేదు. దీంతో ఈ విశ్లేషణలన్నీ మాని మీరేం చేస్తారో చెప్పండంటూ నెటిజన్లు పవన్ పై కామెంట్లు రువ్వుతున్నారు.