Begin typing your search above and press return to search.

ద్రోహి ఎవ‌రో ప‌వ‌న్ చెప్పేశాడు!

By:  Tupaki Desk   |   10 Aug 2018 6:12 PM GMT
ద్రోహి ఎవ‌రో ప‌వ‌న్ చెప్పేశాడు!
X
2019 ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న కొద్దీ... రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. జాతీయ రాజ‌కీయాలు నానాటికీ హాట్ హాట్‌ గా మారుతున్నా... జాతీయ రాజ‌కీయాల కంటే కూడా న‌వ్యాంధ్ర రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. 2014 ఎన్నిక‌ల్లో అటు బీజేపీ, ఇటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ లతో జ‌త‌క‌ట్టి చ‌చ్చీ చెడీ - అమ‌లు సాధ్యం కాని హామీలు గుప్పించి అధికారం చేజిక్కించుకుంద‌న్న వాద‌న లేక‌పోలేదు. అయితే నాలుగేళ్లు కూడా గ‌డ‌వ‌క‌ముందే... బీజేపీకి టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు జెల్ల కొడితే... దానికి మూడు రెట్లు రెట్లు ఎక్కువ అన్న‌ట్టుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ టీడీపీకి భారీ ఝ‌ల‌క్కిచ్చారు. మొత్తంగా ఈ మూడు పార్టీలు క‌లిసి బ‌రిలోకి దిగి నాలుగేళ్లు కూడా అయ్యిందో - లేదో... ఇప్పుడు ఆ మూడు పార్టీలు విరోధులుగా మారిపోయాయి. మూడు పార్టీలు ఇప్పుడు మూడు వ్యూహాల్లో న‌డుస్తున్నాయి. అదంతా బాగానే ఉన్నా... ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకించి జ‌నాభా ప‌రంగా అత్య‌ధిక శాతం ఉన్న బీసీలు - కాపుల‌కు మోసం చేసిన ద్రోహులెవ‌ర‌న్న విష‌యంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన బాబుకు కాపులంతా ఓటేశారు. అయితే ఎన్నిక‌లు ముగియ‌గానే... ఆ హామీని మ‌రిచిన బాబుపై కాపు ఉద్య‌మ నేత - మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం దండెత్తారు. ముద్ర‌గ‌డ పోరులో దాదాపుగా కాపులంతా క‌లిసి సాగారు. దీంతో బెంబేలెత్తిపోయిన చంద్ర‌బాబు... కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌ని, అందుకు అధ్య‌య‌నం జ‌ర‌గాల్సి ఉంద‌ని, ఓ క‌మిష‌న్‌ ను వేసేసి - కాపుల‌ను శాంతింప‌జేసేందుకు కాపు కార్పొరేష‌న్‌ ను ఏర్పాటు చేశారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తే... త‌మ‌కు అన్యాయం జ‌రుగుతుందంటూ బీసీలు గొంతెత్తారు. అయితే కాపుల‌కిచ్చే రిజ‌ర్వేష‌న్లు ఎలాగూ కేంద్రం వ‌ద్ద ఫ్రీజింగ్ లో ఉండిపోతాయ‌న్న ఫీల‌ర్‌ను వ‌దిలేసిన టీడీపీ... బీసీల‌ను బుజ్జ‌గించేసింది. ఈ క్ర‌మంలో కాపుల రిజ‌ర్వేష‌న్ల‌పై మొన్నామ‌ధ్య వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అస‌లు అటు కాపుల‌తో పాటు ఇటు బీసీల‌ను నిండా ముంచేసిన పార్టీ ఏది? అస‌లు ద్రోహి ఎవ‌రు? అన్న ప్ర‌శ్న ఇప్పుడు అంద‌రి మ‌దిలోనూ మెదులుతోంది. ఈ ప్ర‌శ్న‌కు ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆన్స‌ర్ చెప్పేశారు.

ప్ర‌స్తుతం పశ్చిమ గోదావ‌రి జిల్లాలో ప్ర‌జా పోరాట యాత్ర చేస్తున్న ప‌వ‌న్‌... జిల్లాలోని న‌ర్సాపురంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. కాపులు - బీసీల‌తో పాటు దాదాపుగా అన్ని వ‌ర్గాల‌కు ద్రోహం చేసిన అస‌లు సిస‌లు ద్రోహి చంద్ర‌బాబేన‌ని ఆయ‌న తేల్చేశారు. తాను ఓ కులాన్ని న‌మ్ముకుని రాజ‌కీయం చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌కు గ‌ట్టిగానే రిటార్ట్ ఇచ్చేసిన సంద‌ర్భంగా ప‌వ‌న్ నోట నుంచి చంద్ర‌బాబుకు దిమ్మ‌తిరిగే వ్యాఖ్య‌లు తూటాల్లా దూసుకువ‌చ్చాయి. తాను కులాల మధ్య చిచ్చు పెట్టే వాడిని కాదని పేర్కొన్న ప‌వ‌న్‌...తాను కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీసీలకు - కాపులకు అన్యాయం చేసింది టీడీపీనే అని చెప్పిన ఆయ‌న కాపులు - బీసీల ద్రోహి చంద్ర‌బాబేన‌ని చెప్పేశారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీకి కంచుకోట‌గా నిలిచిన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు టీడీపీ ప్ర‌భుత్వం ఏం చేసింద‌ని ప్ర‌శ్నించిన ప‌వ‌న్‌... త‌మ‌కు అధికారం క‌ట్టబెట్టిన ప‌శ్చిమ గోదావ‌రికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో టీడీపీ ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు.

13 జిల్లాల్లో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లానే టీడీపీకి 15 ఎమ్మెల్యే సీట్లను కట్టబెట్టిందని, అంత‌టి ప్రాధాన్యం ఉన్న ఈ జిల్లాకు టీడీపీ చేసిందేమీ లేదని కూడా తేల్చి పారేశారు. అరవై ఏళ్ళ క్రితం పూర్తి కావాల్సిన వశిష్ట వారధికి ఈ రోజుకీ దిక్కులేదని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. టీడీపీ పాలనలో కాపు కార్పొరేషన్ - ఎస్సీ కార్పొరేషన్ - బీసీ కార్పొరేషన్ అన్నీ అవినీతిమయంగా తయారయ్యాయని ఆయ‌న‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు అనుభవం పశ్చిమ గోదావరికి ఏమాత్రం పనికి రాలేదని ఎద్దేవా చేశారు. పశ్చిమలో 15 సీట్లు గెలవకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారా?.. లోకేష్ మంత్రై మన నెత్తిన ఎక్కేవాడా? ప‌వ‌న్ త‌న‌దైన శైలి తార్కికాన్ని బ‌య‌ట‌కు తీశారు. ఈ జిల్లాలోనే మ‌హిళా అధికారుల‌పై అధికార పార్టీ నేత‌ల దాడులు జ‌రిగాయ‌ని, ఈ దాడి చేసిన ఎమ్మెల్యేలపై టీడీపి ప్ర‌భుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మొత్తంగా కాపులు - బీసీల‌కు మోసం చేసి వారి సంక్షేమం విష‌యంలో ద్రోహిగా ఎవ‌రున్నారు అన్న జ‌నం మ‌దిలోని ప్ర‌శ్న‌కు సూటి స‌మాధాన‌మిచ్చిన ప‌వ‌న్‌... చంద్ర‌బాబును ద్రోహిగా ప్ర‌జ‌ల ముందు నిల‌బెట్టేశారు.