Begin typing your search above and press return to search.

నా ఒక్క‌మాట‌తో టీడీపీకి 15 సీట్లు ద‌క్కాయి

By:  Tupaki Desk   |   26 July 2018 2:12 PM GMT
నా ఒక్క‌మాట‌తో టీడీపీకి 15 సీట్లు ద‌క్కాయి
X
ఏపీ రాజ‌కీయాల్లో జ‌న‌సేన పార్టీ అధినేత‌ - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వేడి పుట్టిస్తున్నారు. త‌న‌దైన శైలిలో ఆయ‌న కామెంట్లు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఓ వైపు తన కాలి నొప్పి బాధిస్తున్నా..మ‌రోవైపు త‌న పార్టీ బ‌లోపేతం కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న కొన‌సాగిస్తున్నారు. తాజాగా భీమ‌వ‌రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చ‌దువుకు త‌గ్గ ఉద్యోగాలు ఇక్క‌డ దొర‌క్క ... యువ‌త విదేశాల‌కు వెళ్తున్నారు త‌ప్ప ఇష్టంతో కాదని ప‌వ‌న్ అన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను రాజ‌కీయ‌ నాయ‌కులే కల్పిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా టీడీపీని తాను గెలిపిస్తే ద‌క్కిన ప్ర‌యోజ‌నం ఏమిట‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.

గ‌త ఎన్నిక‌ల్లో తాను తెలుగుదేశం పార్టీకి ప్ర‌చారం చేయ‌డం వ‌ల్ల ద‌క్కిన ప్ర‌యోజ‌నం ఏమిట‌నే సందేహం త‌న ముందుకు వ‌స్తోంద‌ని ప‌వ‌న్ అన్నారు. ``నేను ఒక్క మాట చెప్ప‌డం వ‌ల్ల గ‌త ఎన్నిక‌ల్లో 15 సీట్లు ప‌శ్చిమ‌గోదావ‌రిలో టీడీపీ గెలిచింది. అయితే ఈ జిల్లాలో ఇంకా అనేక స‌మ‌స్య‌లు పెండింగ్‌ లో ఉన్నాయి. జిల్లాలో చిన్న‌పాటి వంతెన క‌ట్ట‌లేని వాళ్ల కంటే దుర్మార్గులు ఎవ‌రుంటారు?`` అని ప‌వ‌న్ ఫైర్ అయ్యారు. రాజ‌కీయాల్లో ద‌ళారీ వ్య‌వ‌స్థ రాజ్యమేలుతోందని ప‌వ‌న్ మండిప‌డ్డారు. ``ఏసీల్లో కూర్చొని శ్ర‌మ‌శ‌క్తిని దోచేస్తున్నారు. ఇలాంటి వాళ్ల‌ను కిందప‌డేసి కొట్టాలంటే కేవ‌లం యువ‌తే కావాలి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వంటి వాళ్లు రాజ్యాంగం రాయ‌లేరు. అంబేద్క‌ర్ వంటి గొప్ప మ‌హానుభావులే రాజ్యాంగం రాయ‌గ‌ల‌రు. ఒక‌వేళ చంద్రబాబు రాజ్యాంగం రాస్తే.. కృష్ణా న‌ది తీరం నుంచి శ్రీకాకుళంలోని వంశ‌ధార న‌ది వ‌ర‌కు నాదే అని రాసుకుంటారు అని జ‌గ‌న్ మండిప‌డ్డారు.

కాగా, ఎక్క‌డికి వెళ్లినా త‌మ అభిమానులు ఒక ఫిర్యాదు చేస్తున్నార‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వివ‌రించారు. ``బైక్ లు రైజ్ చేసి సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారని ఏదో పెద్ద నేరంలా మాట్లాడుతున్నారు.. ప్రత్యేక హోదా ఇస్తామ‌ని చెప్పి మాట త‌ప్పిన వాళ్ల‌కంటే దుర్మార్గులా మావాళ్లు..? 15 సీట్లు ఇచ్చిన ప‌శ్చిమ‌గోదారి జిల్లాకు చిన్న‌పాటి వంతెన క‌ట్ట‌లేని వాళ్ల కంటే దుర్మార్గులా మావాళ్లు..? మ‌నుషుల్ని తుపాకీల‌తో కాల్చేసి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కూర్చున్న‌వారి క‌న్నా దుర్మార్గులా మావాళ్లు..? ఇసుక దోపిడి చేసి కోట్లు దోచుకున్న‌వారి కంటే దుర్మార్గులా మావాళ్లు..? దోపిడీలు చేసేవాళ్ల‌కే మావాళ్ల బైక్ శ‌బ్ధం అంటే భయం?`` అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. మ‌ద్యపాన నిషేధంపైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. ``నిషేధం నాకు ఇష్ట‌మే. కానీ దానివ‌ల్ల విప‌రీతంగా బ్లాక్ మార్కెట్ - లిక్కర్ మాఫియా పెరిగిపోతుంది. అందుకే జ‌న‌సేన అధికారంలోకి వ‌స్తే రెస్పాన్సుబుల్ లిక్క‌ర్ పాల‌సీ తీసుకొస్తా. ఒక‌ప్పుడు 70 రూపాయ‌లు ఇస్తే 10 లీట‌ర్లు పెట్రోల్ వ‌చ్చేది. ఇప్పుడు 70 రూపాయ‌ల‌కు ఒక్క లీట‌ర్ కూడా రాని ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌ధాని మోడీగారు మ‌న‌ల్ని ఇబ్బంది పెట్టి ఎన్నిక‌ల ముందు పెట్రోల్ ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకొస్తార‌నే అనుమానం ఉంది. పెట్రోల్ - డీజీల్ ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకురావాల‌ని కోరుకునేవాళ్ల‌లో నేనూ ఒకడిని” అని అన్నారు.