Begin typing your search above and press return to search.

పవన్ మాల : పీక్స్ కి చేరుకున్న అభిమానం అనబడే భక్తి...?

By:  Tupaki Desk   |   19 Aug 2022 9:30 AM GMT
పవన్ మాల : పీక్స్ కి చేరుకున్న అభిమానం అనబడే భక్తి...?
X
అందరూ మనుషులే. అందరూ సాధారణమైన వారే. అయితే కొందరు పది మందికీ మేలు చేస్తే మహానుభావులు అవుతారు. అంతమాత్రం చేత ఇక్కడ ఎవరూ దేవుళ్ళు లేరు. ఉండరు కూడా. నిజానికి మన పురాణాలలో కూడా రాముడు క్రిష్ణుడు మానవులుగానే ఈ గడ్డ మీద జీవించారు. తాము దేవుళ్ళు గా వారు చెప్పుకోలేదు. కానీ వారిని దేవుళ్ళను చేసింది జనాలే. సరే అనుకున్నా కూడా ఇపుడు అభిమానం హద్దులు దాటి సినిమా హీరోలను దేవుళ్లను చేయడమే వింతా విడ్డూరం.

ఇక పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు. జనసేన అనే రాజకీయ పార్టీని ఆయన స్థాపించారు. అయితే ఆ పార్టీ తరఫున ఇప్పటిదాకా అద్భుతాలు ఏవీ చేయలేదు. రేపటి రోజున ఏమైనా చేస్తారేమో చూడాలి. ఇక పవన్ పాతిక మించి సినిమాలు చేయలేదు. ఆయన చేసిన పాత్రలు కూడా గొప్పవి అని సినీ విమర్శకులు చెప్పలేరు. అయినా సరే ఎందుకో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది అది ఆయన అదృష్టం అనుకోవాలి.

ఇక రాజకీయాల్లో చాలా మంది నేతలు వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారు. వారంతా మంచి నాయకులుగా ఉంటారు తప్ప దేవుళ్ళు అయిపోరు. పేద ప్రజలకు పట్టెడన్నం, గూడు, గుడ్డ అందించిన ఎన్టీయార్ కూడా ఉత్తమ పాలకుడిగానే ఉంటారు తప్ప దేవుడు అయితే కారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమానాన్ని హద్దులు దాటించేస్తున్నారు. అది భక్తిగా మార్చేసుకుంటున్నారు.

దానికి ఉదాహరణ ఏంటి అంటే పవన్ మాల ధరించడం. ఇప్పటిదాకా అయ్యప్పమాల, శ్రీ హనుమాన్ మాల, సింహాద్రి అప్పన్నమాల, విజయవాడ కనకదుర్గ అమ్మవారి కోసం దుర్గామాత మాల, శ్రీశైలంలోని శివుడి కోసం శివమాల ధరిస్తూ వచ్చారు. కానీ ఫస్ట్ టైమ్ ఒక సినిమా నటుడు కమ్ రాజకీయ నాయకుడి కోసం పవన్ మాలను ధరిస్తున్నట్లుగా అభిమానులు చెబుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా  పాలకొల్లుకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమానులు తన హీరో జనసేనాని అయిన పవన్ కళ్యాణ్ 49వ జన్మదినోత్సవం సందర్భంగా పవన్ మాల పేరుతో ఎర్రచందనం మెడలో వేసుకుని 49 రోజుల పాటు దీక్ష చేపడతామని  పెద్ద ఎత్తున ప్రకటించారు. అలా సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పవన్ మాల ధరించే సరికొత్త ట్రెండ్‌ను ప్రారంభించారు.

ఇది నిజంగా విశేషమే అనుకోవాలి. ఇలా  49 రోజుల పాటు పవన్ కళ్యాణ్ కార్యక్రమాలను ఆయన  ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన రాజకీయాల్లో విజయం సాధించేలా ప్రచారం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అంతే కాదు తాము పూర్తి చిత్తశుద్ధితో కఠినమైన దీక్షను అనుసరిస్తామని, పవర్ స్టార్ నుండి స్పూర్తిగా ప్రజా సేవను తీసుకుని తాము కూడా చేస్తామని వారు ప్రకటించడం గమనార్హం.

తామే నిజమైన జనసైనికులుగా ప్రజల్లోకి వెళ్లి పార్టీ కోసం ప్రచారం చేసి పవర్ స్టార్‌కు మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తామని కూడా చెబుతున్నారు. నిజంగా ఇలాంటి పనులు చేయడానికి వారు కేవలం 49 రోజులేంటి ఎన్నికల దాకా కూడా గట్టిగా పనిచేయవచ్చు. దానికి పవన్ మాల అని చెప్పి ఒక పరిమితి కాలాన్ని ఎంచుకోవడమే చర్చగా ఉంది.

పైగా దేవుళ్ళ కోసం భక్తితో వేసుకునే మాలను ఇలా ఒక నటుడి కోసం వేసుకోవడం అంటే దాన్ని అభిమానాన్ని మించిన భక్తి అనాలా లేక పవన్ అంటే పూనకాలు అనాలా అర్ధం కావడంలేదు అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కోసం ప్రజా సేవా కార్యక్రమాలు చేపడతామని ఫ్యాన్స్ చెప్పడం మంచి పరిణామమే కాబట్టి దీన్ని వింతగా ఉన్నా ఎవరూ విమర్శలు చేసే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు అంటున్నారు.