Begin typing your search above and press return to search.

రాజోలులో రాపాక దూకాణం బంద్ అయినట్టేనా..?

By:  Tupaki Desk   |   24 Feb 2021 4:04 AM GMT
రాజోలులో రాపాక దూకాణం బంద్ అయినట్టేనా..?
X
‘ఎవరితో పెట్టుకున్న సరే.. కానీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో పెట్టుకోవద్దు’అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. అయితే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నిజంగానే అది నిరూపించారు. తమతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలియజెప్పారు. ఒక్క సిరా చుక్కతో ఓ రాజకీయ నాయకుడి జీవితాన్నే మార్చేశారు. తమ అభిమాన హీరో పార్టీ నుంచి.. తమ సహాయంతో గెలుపొంది.. ఆ తరువాత అధికార పార్టీ తాయాలాలకు ఆశపడి.. తమనే పట్టించుకోరా..? అని ఆక్రోశం వ్యక్తం చేశారు. మొత్తానికి ఆయనకు చుక్కలు చూపించారు పవన్ ఫ్యాన్స్. ఇంతకీ పవన్ ఫ్యాన్స్ ఏం చేశారు..? వారికి ఇంతలా ఆగ్రహం తెప్పించిన ఆ నేతకు ఎలా షాకిచ్చారన్నది చర్చనీయాంశమైంది...?

ఆంధ్రప్రదేశ్ లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ జనసేన పార్టీ సైతం పలు స్థానాల్లో పోటీ చేసింది. రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ జనసేన నుంచి పోటీ చేశారు. రాష్ట్రంలోని జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక నిలిచారు. అయితే ఆయన గెలుపు కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తీవ్రంగా కృషి చేశారు. ఏదీ ఏమైనా తమ పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యే గెలుపొందడం సంతోషంగా ఉందని అప్పట్లో పవన్ ఫ్యాన్స్ ఆయనపై రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

మొదట్లో ఈ ఒక్క ఎమ్మెల్యే అధికార పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే మొదట్లో రాపాక వరప్రసాద్ కొట్టిపారేశారు. తనకు ఎంత కష్టమైనా జనసేన పార్టీలోనే ఉంటానని రాపాక తెలపడంతో PSPK ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే గత సంవత్సరం నుంచి రాపాకలో మార్పు వచ్చింది. ఆయన గ్లాసు పార్టీని వీడకపోయినా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా జగన్ ప్రభుత్వాన్ని పొగుడతూ పవన్ ఫ్యాన్స్ ను తిడుతూ వస్తున్నారు. అధికారికంగా వైసీపీలో చేరకపోయినా పరోక్షంగా ఆ పార్టీకి మద్దతు తెలపడంతో ఇక ఆయన 152వ ఎమ్మెల్యేనే అని భావించారు.

అప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ రాపాకకు వ్యతిరేక పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఈ పోస్టులపై రాపాక మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఫ్యాన్స్ అవకాశం కోసం ఎదురుచూశారు. ఇదే తరుణంలో పంచాయతీ ఎన్నికలు సమీపించాయి. ఇక్కడ రాపాకపై ప్రతీకారం తీర్చుకోవాలని పవన్ ఫ్యాన్స్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాజోలు నియోజకవర్గంలో 60 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఇందులో 16 చోట్ల జనసేన మద్దతుదారులు గెలిచారు. పడమటి పాలెం, టెక్కిశెట్టి పాలెం, కేశవాసు పాలెమా, కాట్రేని పాడు, ఈటుకూరు, మేడిచర్ల పాలెమా, బట్టెలంక, రామరాజు లంక, కత్తిమండ, పూనవరమా, గోంగురమటం, తూర్పు పాలెమా, సక్కినేటి పల్లి లంక,అమలాపురం, అంతర్వేది మరో రెండు చోట్ల పవన్ పార్టీ తరుపున మద్దతు దారులు గెలిచారు. వైసీపీ 37 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈ 37 చోట్ల కూడా జనసేన రెండోస్థానంలో నిలిచింది. మిగతా చోట్ల టీడీపీ గెలుపొందింది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రాపాక వరప్రసాద్ పై కసి తీర్చుకున్నారనే అర్థమవుతోంది. వైసీపీ ఓటమే లక్ష్యంగా పనిచేసిన జనసైనికులు.. కొన్ని చోట్ల టీడీపీతో జతకట్ట మరీ తమ మద్దతుదారులను గెలిపించారు. మరి కొన్ని చోట్ల టీడీపీకి మద్దతు ఇచ్చారు. మొత్తానికి రాపాక వరప్రసాద్ ను దెబ్బకొట్టారని తెలుస్తోంది.

ఇక ఇప్పటి వరకు జనసేన పార్టీకి సైనికుడు లేడని వ్యాఖ్యలు చేసిన వరప్రసాద్ వైసీపీకి సపోర్టు చేస్తూ వస్తున్నారు. అటు ఆ పార్టీ నుంచి ఆయనకు సహకరించడం లేదని తెలుస్తోంది. కొన్ని చోట్ల రాపాక సూచించిన నాయకులకు వైసీపీ మద్దతు ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో రాపాకకు రెండికి చెడ్డ రేవడిలా మారింది. ఏదీ ఏమైనా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఇదే జరుగుతుందని నిరూపించారు. వచ్చే ఎన్నికల్లో సైతం ఇలాగే కలిసికట్టుగా పనిచేసి రాపాకను ఓడిస్తామని శపథం చేస్తున్నారు. దీంతో రాపాక దుకాణం ఇక మూసినట్లేనా అని చర్చించుకుంటున్నారు.