Begin typing your search above and press return to search.

బాబుతో తెగ తెంపుల‌కు కార‌ణం చెప్పిన ప‌వ‌న్

By:  Tupaki Desk   |   21 May 2018 5:14 AM GMT
బాబుతో తెగ తెంపుల‌కు కార‌ణం చెప్పిన ప‌వ‌న్
X
అప్ప‌టివ‌ర‌కూ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు అంటూ అదే ప‌నిగా కీర్తించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఉన్న‌ట్లుండి ఆయ‌న‌తో సంబంధాలు చెడిపోవ‌టం.. తూచ్.. మీతో క‌లిసి న‌డ‌వ‌లేను..నా దారిన నేను పోతానంటూ ఎందుకు క‌టీఫ్ చేసుకున్నారు? అంటే ఎవ‌రూ సూటిగా స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. నాలుగేళ్లు బాబు పాల‌న‌పై ప‌లు విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఆరోప‌ణ‌లు వెల్లువెత్తినా కిమ్మ‌న‌కుండా ఉన్న ప‌వ‌న్‌.. ఉన్న‌ట్లుండి టీడీపీ స‌ర్కారుతో తాను తెగ‌తెంపులు చేసుకున్న‌ట్లు చెప్ప‌ట‌మే కాదు.. తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించ‌టం షురూ చేశారు.

మ‌రి.. అదే ప‌ని మొద‌ట్నించి కాకున్నా మూడో ఏడాది అయినా ఎందుకు చేయ‌లేద‌న్న ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ స‌మాధానం చెప్ప‌ని ప‌రిస్థితి. ఎన్నిక‌లు ఏడాది కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలోకి వ‌చ్చేసిన వేళ‌.. తాను విడిగా పోటీ చేస్తాన‌ని.. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీలోని అన్నిస్థానాల్లో పోటీ చేయ‌నున్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేస్తున్న ప‌వ‌న్‌.. తాజాగా ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో పోరాట యాత్ర‌ను ఆదివారం స్టార్ట్ చేశారు.

త‌న యాత్రను షురూ చేసిన సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అన్నింటికి మించి బాబుతో రిలేష‌న్ తెగ‌తెంపులు చేసుకోవ‌టానికి కార‌ణం ఏమిటో చెప్పారు. అయితే.. ప‌వ‌న్ చెప్పిన కార‌ణం వివ‌రంగా లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కీ బాబుతో తెగ‌తెంపుల‌కు కార‌ణాన్ని ప‌వ‌న్ మాట‌ల్లోనే చూస్తే.. "నేను ప‌ద‌వులు ఆశించే వాడినే అయితే.. ఆ ప‌ద‌వులు టీడీపీనో.. మ‌రో పార్టీనో ఇవ్వాలా? ప‌్ర‌జారాజ్యంలో 294 స్థానాల‌కు 285 స్థానాల్లో పోటీ చేసిన రాజ‌కీయ అనుభ‌వం ఉంది. కావాల‌నుకుంటే ఆ రోజునే ఎమ్మెల్యేనో.. ఎంపీగానో పోటీ చేసి గెలిచేవాడిని. కానీ.. నేను ఎప్పుడూ ప‌ద‌వులు ఆశించ‌లేదు.

రాజ‌కీయ అనుభ‌వం ఉన్న వారికి గౌర‌వం ఇస్తా. 2014లో బాబుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌టానికి కార‌ణం ఇదే. అలా అని జీవితాంతం బానిస‌లా ప‌డి ఉండాలా? టీడీపీ నుంచి ప‌ద‌వులు కోరుకోలేదు. కాంట్రాక్టులు కోరుకోలేదు. కానీ.. జ‌న‌సేనికుల‌పై దాడులు ఆపాల‌న్నాను. దానికీ స్పందించ‌క‌పోవ‌ట‌మే ఎక్కువ‌గా బాధించింది. అందుకే తెగ‌తెంపులు చేసుకొని బ‌య‌ట‌కు వ‌చ్చేశా" అని వెల్ల‌డించారు ప‌వ‌న్‌.

ఎన్నిక‌ల వేళ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు 600 హామీలు ఇచ్చార‌ని.. అవ‌న్నీ పూర్తి చేశారా? అని తాను ప్ర‌శ్నిస్తున్నాన‌ని చెప్పారు. ప్ర‌త్యేక హోదా సాధిస్తార‌న్న న‌మ్మ‌కంతో బాబుతో తాను న‌డిచాన‌ని.. 2014లో ప్ర‌భుత్వం వ‌చ్చిన ఆర్నెల్ల త‌ర్వాత కొంద‌రు టీడీపీ నేత‌ల‌కు ప్ర‌త్యేక హోదా అంశాన్ని గుర్తు చేసిన‌ట్లు చెప్పారు. బ‌డ్జెట్‌లో విభ‌జ‌న హామీలు పెడ‌తార‌ని తాను న‌మ్మాన‌ని.. కానీ.. ఆ న‌మ్మ‌కం పోయింద‌న్నారు. తిరుప‌తి స‌భ‌లో తాను పాచిపోయిన ల‌డ్డూలు ఇచ్చార‌ని చెప్పాన‌ని గుర్తు చేశారు.

అధికారం.. ప‌లుకుబ‌డి కొన్ని కుటుంబాలు.. పార్టీలు.. వ‌ర్గాల‌కేనా? ఇప్పుడు ఆ రోజులు పోయాయ‌ని.. క‌డుపుమండి ఉన్నామంటూ ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం సంజాయిషీ చెప్పేవ‌ర‌కూ.. రాష్ట్రానికి నిధులు ఇచ్చి అభివృద్ది చేసే వ‌ర‌కూ 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర‌స‌న క‌వాతు చేస్తామ‌న్నారు. కుప్పంలో కూడా క‌వాతు చే్స‌తామ‌న్న ప‌వ‌న్‌.. టీడీపీ రాష్ట్రంలో కులాల్ని చీలుస్తుంద‌ని ఎద్దేవా చేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు 15 సీట్లు ఇస్తే స‌రిపోతుంద‌ని కొంద‌రు టీడీపీ నేత‌లు ఎద్దేవా చేస్తున్నార‌ని.. టీడీపీ ఇవ్వ‌టానికైనా.. తాను తీసుకోవ‌టానికైనా అదేమైనా భిక్ష‌మా? అంటూ నిల‌దీశారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌ల పేరుతో సీఎం చంద్ర‌బాబు చేసే కోట్లాది రూపాయిల ఖ‌ర్చును ఉద్దానం స‌మ‌స్య మీద పెడితే.. ఆ స‌మ‌స్య ప‌రిష్కారం కాదా? అంటూ ప్ర‌శ్నించారు. రాజ‌కీయాల్లో గెలుపు త‌న‌కు ముఖ్యం కాద‌ని.. మిగిలిన పార్టీల మాదిరి తాను ప్ర‌జ‌ల్ని మోసం చేయ‌న‌ని చెప్పారు.