Begin typing your search above and press return to search.

బాబు ప్రతిపక్ష హోదాకు పవన్ అడ్డు!

By:  Tupaki Desk   |   10 Dec 2019 2:21 PM GMT
బాబు ప్రతిపక్ష హోదాకు పవన్ అడ్డు!
X
2014లో గెలిచిన చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు లోనై వైసీపీని వీడి టీడీపీలో చేరి మంత్రి పదవులు పొందిన అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి సహా చాలా మంది నేతల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడిపోయింది. 2019లో వైసీపీ గాలిలో వీరంతా కొట్టుకుపోయారు. వైసీపీని మోసం చేసిన టీడీపీలోకి ఫిరాయించినందున ఇప్పుడు అధికార వైసీపీకి టార్గెట్ మారి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు.

ఇప్పుడు వారి గుణపాఠం కల్లముందు మెదులుతున్న వేళ మరో పరిణామం టీడీపీ జంపింగ్ లను వైసీపీలోకి దూకకుండా చేసిందనే వాదన పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది.

ఇప్పటికే వైసీపీ అధిష్టానం, జగన్, విజయసాయిరెడ్డిలు... టీడీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీకి రాజీనామా చేయించి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామని సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బాబుకు షాకివ్వాలని ప్లాన్ చేశారట.. కానీ పవన్ కళ్యాణ్ చేసిన ఒక్క ప్రకటనతో ఇప్పుడు వారంతా వెనక్కితగ్గినట్టు ప్రచారం జరుగుతోంది.

వైసీపీలోకి చేరడానికి దాదాపు ఖాయం చేసుకున్న కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వెనక్కి తగ్గడం వెనుక పవన్ చేసిన ప్రకటనే కారణమని తెలుస్తోంది. పవన్ తాజాగా తిరుమలలో మాట్లాడుతూ ‘తనకు బీజేపీతో శతృత్వం లేదని.. అమిత్ షా అంటే ఎంతో గౌరవమని.. జగన్ కు అమిత్ షా అంటే భయమని’ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు అభివృద్ధి చేసినా ఓడిపోయాడని.. తాను, తెలుగుదేశం, బీజేపీలతో కలిసి పోటీచేస్తే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదని స్పష్టం చేశారు.

దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ మళ్లీ బీజేపీ, టీడీపీతో కలవడానికి రెడీ అయ్యారని అర్థమవుతోంది. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీలో ఉంటే గెలవడం కష్టమేనన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.. అందుకే ఈ విషయం తెలుసుకున్న టీడీపీ జంపింగ్ జంపాంగ్ లు అనవసరంగా రిస్క్ తీసుకోవద్దనే వైసీపీలో చేరికను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. నాడు వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేతలకు పట్టిన గతే తమకూ పడుతుందని వారంతా జంపింగ్ లకు దూరంగా ఉన్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.