Begin typing your search above and press return to search.

మీడియా చేయని పని పవన్ చేశాడు

By:  Tupaki Desk   |   13 Nov 2015 9:59 AM GMT
మీడియా చేయని పని పవన్ చేశాడు
X
సమాజం కోసం.. ప్రజల కోసం పని చేస్తున్నామని చెప్పే మీడియాకు అంతర్మధనం కలిగేలా వ్యవహరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తన తాజా వైఖరితో మీడియా షాకివ్వటమే కాదు.. మరింత బాధ్యతగా వ్యవహరించాలన్న విషయాన్ని తన చర్యతో చెప్పకనే చెప్పేశారు. చాలామంది ఒప్పుకోరు కానీ.. కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది నిజం అనిపించక మానదు.

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి వైఎస్ సర్కారు నిర్ణయం తీసుకున్న సమయంలో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. గిరిజనులకు ఇబ్బంది కలిగించే ఈ నిర్ణయం కారణంగా.. వారి ప్రయోజనాలు దెబ్బ తినటంతో పాటు.. పర్యావరణానికి భారీగా నష్టం వాటిల్లుతుందన్న వాదన వినిపించింది. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరిగాయి. వైఎస్ జమానా పోయి.. రాష్ట్ర విభజన జరిగి.. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనా పగ్గాల్ని చేతపట్టారు. అయితే.. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి చంద్రబాబు సర్కారు సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవటాన్ని ఏ మీడియా ప్రస్తావించలేదు. ప్రశ్నించలేదు. గిరిజనుల గోస గురించి మాట్లాడింది లేదు.

ఇలాంటి సమయంలో పవన్ మాత్రం తనకు తానుగా ముందుకు రావటమే కాదు.. బాక్సైట్ తవ్వకాల విషయంలో తొందరపాటు వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పటం ద్వారా.. మీడియా ధర్మాన్ని పవన్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమాజ పక్షపాతిగా ఉంటూ.. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రశ్నిస్తూ.. తొందరపాటుతో వారు చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ప్రజల పక్షాన నిలబడే మీడియా.. బాక్సైట్ విషయాన్ని పెద్దగా పట్టించుకోని సమయంలో.. ఎక్కడో ఉన్న గిరిజనుల గోసను.. ముఖ్యమంత్రి దృష్టికి నేరుగా తీసుకెళ్లారు పవన్ కల్యాణ్.

బాక్సైట్ తవ్వకాల విషయంలో తొందరపాటు వద్దని.. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి.. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా వ్యవహరించాలే తప్పించి.. తొందరపాటు వద్దని చెప్పటం చూడటం ద్వారా.. బాక్సైట్ తవ్వకాలకు పవన్ బ్రేకులు వేశారని చెప్పొచ్చు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా తాను బాక్సైట్ తవ్వకాలపై ముఖ్యమంత్రితో మాట్లాడానని.. అఖిల పక్షం అభిప్రాయాలు తీసుకోవటం.. గిరిజనుల తరలింపు లేకుండా.. వారికి ఇబ్బంది కలగకుండా ఉండేలా చూడాలని తాను ముఖ్యమంత్రికి చెప్పినట్లుగా పవన్ చెప్పటం తెలిసిందే. ఏపీ ప్రత్యేక హోదా.. రాజధాని లాంటి విషయాల్ని ప్రముఖంగా ప్రస్తావించే మీడియా.. బాక్సైట్ తవ్వకాల కారణంగా గిరిజనం పడే పాట్ల గురించి పట్టించుకోని సమయంల పవన్ ముందుకొచ్చి.. ఆ విషయాన్ని తెరపైకి తీసుకురావటం కాస్తంత ఆలోచించాల్సిన విషయమే.

ప్రభుత్వానికి నిజమైన విపక్షంగా వ్యవహరిస్తామని చెప్పుకునే మీడియా చేయని పనిని పవన్ చేయటం ఒక ఎత్తు అయితే.. తన తాజా స్పందన ద్వారా.. బాక్సైట్ తవ్వకాల విషయంలో తొందరపాటు వద్దని చెప్పటేమ కాదు.. ఏపీ సర్కారు తీసుకునే అన్ని నిర్ణయాలపై తన డేగకన్ను ఉంటుందన్న విషయాన్ని తన తాజా వైఖరితో పవన్ చెప్పకనే చెప్పేశారు. బాబు సర్కారు పని తీరు బాగున్నంత వరకూ తాను పట్టించుకోనని.. కానీ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తన ఎంట్రీ తప్పదన్న మాటను చెప్పేశారు. మొత్తానికి బాబు సర్కారు బ్రేకులు తన వద్ద ఉన్న విషయాన్ని తాజా భేటీతో పవన్ చెప్పకనే చెప్పేశారు.