Begin typing your search above and press return to search.

షర్మిల పార్టీపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   8 July 2021 9:57 AM GMT
షర్మిల పార్టీపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
X
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఇన్నాళ్లు ఏకపక్షంగా ఎదురు లేకుండా ఉన్న టీఆర్ఎస్ కు పోటీగా అటు కాంగ్రెస్, ఇటు షర్మిల సైతం రెడీ అవుతున్నారు. తెలంగాణలో ఇన్నాళ్లు టీఆర్ఎస్, వర్సెస్ బీజేపీ రాజకీయాలు మాత్రమే సాగాయి. కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వడంతో ఆ పార్టీ జోరందుకుంది.

ఇప్పుడు తెలంగాణలో మరో పార్టీ ఈరోజు పురుడుపోసుకోబోతోంది. వైఎస్ షర్మిల తన కొత్త పార్టీని తెలంగాణ లో ప్రారంభించబోతున్నారు. దివంగత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నేడు వైఎస్ షర్మిల పార్టీని ప్రకటించనున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ జేఆర్సీ కన్వేన్షన్ సెంటర్ లో వైఎస్ఆర్ టీపీ ఆవిర్భావ సభ జరుగనుంది. ఇప్పటికే ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’గా పేరును ఖరారు చేశారు. సభకు సంబంధించి రోడ్డు మ్యాప్ తాజాగా ఖరారైంది. నేడు వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ఇడుపుల పాయకు చేరుకుంటారు. ఉదయం 8.30 గంటలకు షర్మిల అక్కడ వైఎస్ఆర్ ను నివాళులర్పించి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్సీ కన్వేన్షన్ చేసుకొని 5 గంటలకు పార్టీ ఆవిర్భావ ప్రకటన.. జెండాను ఆవిష్కరిస్తారు.

జేఆర్సీ కన్వేన్షన్ సెంటర్ లో జరిగే పార్టీ ఆవిర్భావానికి ఒక్కో జిల్లా నుంచి 2వేల మందికి పైగా అభిమానులు వచ్చే అవకాశం ఉంది. పార్టీ ఆవిర్భావానికి ఇన్విటేషన్ ఉన్న వారికే అనుమతిస్తున్నారు.పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున జనాలను తరలిస్తున్నారు. వారి ముందు పార్టీ ఆవిష్కరణ చేయాలని షర్మిల నిర్ణయించారు. పెద్ద ఎత్తున పార్టీ కండువాలు సిద్ధం చేశారు.ఈ కోలాహలం నడుమ ఏపీ, తెలంగాణ నేతలు షర్మిల పార్టీపై స్పందిస్తున్నారు.

వైఎస్ షర్మిల కొత్త పార్టీపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణలో షర్మిల పార్టీకి స్వాగతమని చెప్పుకొచ్చారు. ‘ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాలన్నారు. ప్రజలకు మంచి చేయడానికి ఎవరొచ్చినా స్వాగతించాలని.. 2007 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నానని పవన్ తెలిపారు.

తెలంగాణ ఉద్యమాల గడ్డ అని.. కొత్త రక్తం, చైతన్యవంతమైన యువత రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన తరుఫున వారిని గుర్తించి మద్దతిచ్చామని పవన్ తెలిపారు.

ఒక పార్టీ నిర్మాణం చాలా కష్టమని.. నేను పగటికలలు కనే వ్యక్తిని కాదని పవన్ తెలిపారు. రాజకీయ వారసత్వంతో సంబంధం లేని వారు కూడా రాజకీయాల్లోకి రావాలని పవన్ అభిప్రాయపడ్డారు. కాగా ఇవాళ సాయంత్రం వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.