Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్... వైసీపీ బలంగా ఉంది అని ఒప్పుకున్నాడా...?

By:  Tupaki Desk   |   9 May 2022 4:46 AM GMT
పవన్ కళ్యాణ్... వైసీపీ బలంగా ఉంది అని ఒప్పుకున్నాడా...?
X
పవన్ కళ్యాణ్ మాటలు ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తూంటే ఏపీలో సొంతంగా ఏ ఒక్క పార్టీ అధికారంలోకి రాలేదు అని అర్ధం చేసుకున్నాడా. ఆ మాటకు వస్తే ఏపీలో వైసీపీ బలంగా ఉంది అని ఒప్పుకుంటున్నాడా ఈ రకమైన సందేహాలు ఎవరికైనా కలిగితే తప్పు వారిది కాదుగా. ఇక పవన్ తీరు చూస్తే బీజేపీతో ఉన్నాను అంటాడు, మళ్ళీ అందరూ కలవాలీ అంటాడు, మరి పవన్ చెప్పిందే నిజం అనుకుంటే ఏపీలో బీజేపీ పొత్తు ఉన్న చోట కమ్యూనిస్టులు ఎలా కలుస్తారు, అంతే కాదు బీజేపీతో కాంగ్రెస్ ఎలా కలుస్తుంది అన్నది కూడా కీలకమైన రాజకీయ‌ పాయింట్.

మరో వైపు చూస్తే బీజేపీకి కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు ఏపీలో ఉన్నాయా అంటే అదీ కూడా కాదే. కేవలం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అన్నది తప్పితే ఏపీలో బీజేపీ ఏముంది అన్నది కూడా చూడాలి కదా. బీజేపీకి ఏపీలో నెట్ వర్క్ కూడా లేదు, గట్టిగా చెప్పాలీ అంటే బూత్ స్థాయి కార్యకర్తలు కూడా లేరు, నాయకులు అసలు లేరు. బీజేపీకి టీవీ చర్చల్లో ఉండే నలుగురు అయిదుగురు నేతలు తప్ప ఎక్కడా బలం ఏదీ లేదు అన్నది వాస్తవం.

అటువంటి పార్టీ బీజేపీతో ఇంకా మేము అంటే ఎలా పవన్ అనే మేధావులు అంతా అంటున్నారు. ఒక వేళ టీడీపీతో కలుద్దాం అంటే ముందు చంద్రబాబే రావాలి అని జనసేన నాయకులు అంటున్నారు. ఇక ఇంకో వైపు చూస్తే జనసేన సమావేశాలకు బీజేపీ వారు ఎవరూ ఎపుడూ హాజరైన దాఖలాలు లేవు. ఇదీ జనసేన దాని మిత్ర బంధాల పరిస్థితి.

ఈ నేపధ్యంలో జనసేన క్షేత్ర స్థాయిలో బలోపేతం కావాలీ అంటే పవన్ కళ్యాణ్ ఇలా అపుడపుడు మీటింగులు పెట్టి పోవడం కాకుండా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలి. తన పూర్తి సమయం కేటాయించాలి అని అంటున్నారు. అయితే పవన్ అలా పూర్తి స్థాయిలో రాజకీయాలు చేసే పరిస్థితి ఉందా అన్నది కూడా చూడాలి. ఆయన ఆర్ధికంగా బాగా ఉండాలి అంటే తప్పకుండా సినిమాలు చేసుకుని తీరాలి. అది వాస్తవం కూడా.

ఇక అధికారంలో ఉన్న వైసీపీలో అపుడే ఎన్నికల వేడి మొదలైపోయింది. వారు దానికి సిద్ధపడిపోతున్నారు కూడా. మరి ప్రతిపక్షంలో ఉన్న జనసేన సంగతేంటి అన్న ప్రశ్న ఎటూ వస్తుంది. పవన్ అయితే ఇంకా పొత్తులకు టైమ్ ఉంది కదా అంటున్నారు. అయితే అన్నీ బయటకు చెప్తారా అన్న చర్చ ఎలాగూ ఉంది. మరి తెర వెనక చంద్రబాబుతో పవన్ చర్చలు జరుపుతున్నారా అన్న మాట కూడా బయటకు వినిపిస్తోంది.

అవన్నీ పక్కన పెడితే ఏపీలో వైసీపీ బలంగా ఉంది అని జనసేనాని భావిస్తున్నాడా అనే పవన్ పొత్తులకు ఒప్పుకుంటున్నారా అన్న చర్చ కూడా ఉందిపుడు. ఎందుకంటే కర్నూల్ జిల్లా పర్యటనలో పవన్ ప్రతిపక్షాలు అన్నీ కలవకపోతే వైసీపీ మరోమారు ఏపీలో గెలుస్తుంది అని డైరెక్ట్ గానే చెప్పేశాడు అని వైసీపీ వాళ్లీ ఇపుడు దాని మీద తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక జనసేనకు ఈసారి అరవై నుంచి డెబ్బై సీట్లకు పోటీ చేయాలని ఉంది అంటున్నారు. ఇక పొత్తులో భాగంగా అన్నేసి సీట్లు చంద్రబాబు ఇచ్చే సీన్ అయితే ఉండదు, కాబట్టి ఎన్నికలు దగ్గరపడేంతవరకూ ఈ పొత్తులు అనేవి ఒక కొలిక్కి రావు అనే అంటున్నారు. ఇప్పటికిపుడు ఈ పొత్తులు కుదరడం అంత ఈజీ కాదు అనే అంటున్నారు.

మరో వైపు చూస్తే జగన్ వేవ్ లోనే జనసేన అభ్యర్ధులు టీడీపీ అభ్యర్ధులను దాదాపుగా 42 సీట్లలో భారీగా ఓట్లు చీల్చి మరీ ఓడించారు. ఇదంతా గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా ఉన్న చాలా నియోజకవర్గాల్లో జరిగిన వ్యవహారం. మరో వైపు రాయలసీమలో జనసేన ప్రభావం లేదు కానీ గుంటూరు గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా ఉన్న జిల్లాలలో జనసేనకు అయిదు నుంచి ఆరు శాతం ఓట్లు గడచిన ఎన్నికల్లో వచ్చాయి. దాని వల్లనే ఒంటరిగా పోటీ చేస్తే జనసేన గెలవడం కష్టం అన్నది వైసీపీ వారికి బాగా తెలుసు అంటున్నారు.

ఎందుకంటే వైసీపీ ఓటు అనేది జనసేన వల్ల ఎక్కువగా చీలడం లేదు. అదే టైమ్ లో జనసేన టీడీపీ ఓటునే దారుణంగా చీలుస్తోంది. అందుకే పవన్ కి రాజకీయం చేయడం చేతకాదు అనే భావనతోనే వైసీపీలోని కాపు సామాజికవర్గం నేతలు పవన్ని బాగా రెచ్చగొడుతున్నారు. ఒంటరిగా పోటీ చేయమని కూడా వారు సవాల్ చేస్తున్నారు.

ఇలా ఏపీలో రాజకీయ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పవన్ జాగ్రత్తగా ఆలోచించుకుని ఆలోచనాపూరితమైన రాజకీయాలు చేస్తేనే రాజకీయంగా నిలదొక్కుకుంటాడు అని మేధావులు అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ కార్నర్ చేస్తూ ఆయన్ని ఎంత వీలు అయితే అంతలా రెచ్చగొడుతోంది. మరి పవన్ వైసీపీ ట్రాప్ లో చిక్కుకుంటారా. టీడీపీతో పొత్తు కోసం సీట్లను భారీ ఎత్తున బెట్టు చేస్తారా. ఏపీలో రెండు పార్టీల పొత్తునకు సీట్ల బేరం తో గండి కొడతారా. లేక పొత్తులకు ఓకే చెబుతారా. ఏమో చూడాలి మరి.