Begin typing your search above and press return to search.

పవన్ విచిత్ర డిమాండ్..ఏపీకి ముగ్గురు ముఖ్యమంత్రులు

By:  Tupaki Desk   |   1 Jan 2020 6:24 AM GMT
పవన్ విచిత్ర డిమాండ్..ఏపీకి ముగ్గురు ముఖ్యమంత్రులు
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్యన ఇసుక కొరత అంటూ నానా హడావుడి చేసిన ఆయన.. వరద పోటు తగ్గినంతనే ఇసుక కొరత తగ్గుతుందన్న జగన్ ప్రభుత్వం మాటను వినలేదు. నిరసనలు.. ఆందోళనలతో హడావుడి చేశారు. జగన్ సర్కారు చెప్పినట్లే.. వరద పోటు తగ్గినంతనే ఇసుక కొరతను తీర్చటంతో పాటు.. సమగ్ర ఇసుక పాలసీని తీసుకొచ్చి ఇష్యూను ఒక కొలిక్కి తీసుకొచ్చారు.

మూడు ప్రాంతాల్ని సమానంగా డెవలప్ చేసేందుకు వీలుగా మూడు రాజధానుల కాన్సెప్టును ఏపీ సీఎం జగన్ ప్రస్తావించటం తెలిసిందే. దీనిపై ఆందోళనల్ని నిర్వహిస్తున్నారు. ప్రజల్లో ఉద్వేగాల్ని రెచ్చగొడుతున్న వైనం కనిపిస్తోంది. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు సమానంగా డెవలప్ అవుతాయని.. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చూస్తామని ఏపీ మంత్రులు ఇప్పటికే చెప్పినా.. ఆ మాటల్ని పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్న వైనం ఒక ఎత్తు అయితే.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న నిరసనలు విచిత్రంగా మారాయి.

తాజాగా అమరావతి ప్రాంతంలోని గ్రామాల్ని సందర్శించిన పవన్.. పోలీసులపై ప్రదర్శించిన ఆగ్రహాన్ని చాలామంది టీవీల్లో చూశారు. అవసరానికి మించిన ఆవేశంతో ఊగిపోతున్న ఆయన తీరుకు తగ్గట్లే.. తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ఏపీకి మూడు రాజధానుల మాదిరి ఏపీకి ముగ్గురు సీఎంలను చేస్తారా? అని వ్యాఖ్యానిస్తున్నారు పవన్. రాజకీయ ప్రయోజనాల కోసమే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు.

తుళ్లూరు గ్రామంలోని ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన పవన్.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ మాటల్లోనే చూస్తే..

% అమరావతి విషయంలో టీడీపీ బలమైన బాధ్యత తీసుకోవాలి. మళ్లీ ఒంటి కన్ను.. రెండు కళ్ల సిద్దాంతాలు అంటే కుదరదు.

% రాజధాని నగర నిర్మాణం అనేది రెండు.. మూడు దశాబ్దాల నిరంతర ప్రక్రియ. ప్రభుత్వం మారితే రాజధానిని మార్చకూడదు. త్రికరణశుద్ధిగా అమరావతి ప్రజల కష్టాలు.. నష్టాలకు అండగా ఉంటా.

% రాష్ట్రం విడిపోయాక కూడా ఇంకా ప్రాంతీయ వైషమ్యాలు సృష్టించే ధోరణులు, పద్ధతులు చూడాల్సి రావడం బాధాకరం. అభివృద్ధి అనేది ఎప్పుడూ కూడా విధ్వంసంతోనే కూడుకుని ఉంటుంది. అందుకే భూమాతను క్షమించమని చెప్పి భూమి పూజలు చేసి ఆ తల్లి పొరలు చీల్చి నిర్మాణాలు చేపడతాం. ఒక మహానగర నిర్మాణం కష్టాలతో కూడుకున్నది. ఇప్పుడు అమరావతిలో తలెత్తిన ఈ సమస్యను జనసేన అలానే చూస్తోంది.

% అమరావతిలో రాజధాని నిర్మాణం అన్నప్పుడు జగన్‌ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ఇష్టం లేదని సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

% జగన్‌ ఆరోజున అమరావతి ఒక కులానికి అయిపోతుందని ఎక్కడా చెప్పలేదు. అలా చెప్పి ఉంటే ఈ రోజున ఆయన వైఖరిని తప్పుపట్టే వాళ్లం కాదు. ఆ రోజున 33 వేల ఎకరాల విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం అన్నప్పుడు నేను వెనకడుగు వేశాను. జగన్‌ మాత్రం సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఆ రోజే ఇక్కడ ఇష్టం లేదని ఆయన చెప్పి ఉంటే ఇంతమంది రైతులు భూములు ఇచ్చేవారు కాదేమో! రాజధాని ఇక్కడ వచ్చేది కాదేమో!

% రాష్ట్రం విడిపోయిన రోజు నుంచి ఈ క్షణం వరకు కూడా బాధలు, ఇబ్బందుల్లోనే ఉన్నాం. ప్రాంతీయ విద్వేషాలను కొంతమంది పనిగట్టుకుని సృష్టిస్తున్నారు.

% జై అమరావతి అంటే అదేదో మీ ప్రాంత సమస్యలా అందరూ అనుకుంటారు. మీరు జై ఆంధ్ర నినాదంతో ముందుకెళ్లండి. జగన్‌ రెడ్డికి ఉత్తరాంధ్ర మీద ప్రేమ పుట్టుకొస్తోంది. ఆయనకు అక్కడి మాండలీకం మీద కాదు.. భూములు మీద ప్రేమ. ఇక్కడైనా భూములు మీ చేతుల్లో ఉన్నాయి. అక్కడి భూములు ఇప్పటికే వైసీపీ వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి.