Begin typing your search above and press return to search.

ఏపీ స్థానిక ఎన్నికలపై పవన్ కొత్త డిమాండ్..

By:  Tupaki Desk   |   15 March 2020 8:12 AM GMT
ఏపీ స్థానిక ఎన్నికలపై పవన్ కొత్త డిమాండ్..
X
కరోనా కారణంగా ఏపీలో జరగాల్సిన స్థానిక ఎన్నికలు వాయిదా పడటం తెలిసిందే. ఇప్పటివరకూ జరిగిన ప్రక్రియను మళ్లీ కొనసాగిస్తారని ఏపీ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే ఏకగ్రీవాలైన ఎన్నికల్ని.. కొనసాగిస్తామని చెప్పారు. ఏపీలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేయలేదని.. కేవలం రెండు వారాల పాటు వాయిదా వేయటం జరిగిందని చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరికొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

ఏపీలో జరిగి స్థానిక ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ స్థాయిలో హింసకు.. దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రత్యర్థుల్ని భయపెట్టి.. బెదిరించి నామినేషన్లను విత్ డ్రా చేయించారన్న ఆయన.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను మరోసారి కొత్తగా ప్రారంభించాల్సిన అవసరం ఉందంటూ కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.

నామినేషన్ల ప్రక్రియ న్యాయబద్ధంగా సాగలేదని.. ఏకపక్షంగా జరిగిందన్నారు. ఏపీ పోలీసులు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా మారారన్నారు. ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయటం కాదు.. పూర్తిగా రద్దు చేయాలన్నారు. మొత్తం ప్రక్రియను సరికొత్తగా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను రద్దు చేయని పక్షంలో తాను కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.

ఏపీ అధికారపక్షానికి వత్తాసుగా నిలిచిన అధికారుల జాబితాను తాము సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన పవన్ కల్యాణ్.. ఈ రోజు వారు తప్పించుకోవచ్చు కానీ.. రేపు మాత్రం తప్పించుకోలేరన్నారు. సదరు అధికారుల వివరాల్ని కేంద్రానికి పంపుతామన్న ఆయన.. కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా లేఖలు రాస్తామన్నారు. ఏపీలో ఇటీవల నిర్వహించిన స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. కార్యకర్తలు వ్యవహరించిన తీరు.. దాడి చేసిన ఉదంతాలకు సంబంధించిన వీడియోలతో తానుఢిల్లీకి వెళ్లనున్నట్లు చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి.. వీడియోలు చూపించనున్నట్లు చెప్పారు. మరి.. జనసేనాని చూపించే వీడియోలకు షా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.