Begin typing your search above and press return to search.

ఎంపీలంతా రాజీనామా చేయాలన్న పవన్

By:  Tupaki Desk   |   11 Sept 2016 11:21 AM IST
ఎంపీలంతా రాజీనామా చేయాలన్న పవన్
X
కాకినాడలో నిర్వహించిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సదస్సులో పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చిన జనసేన అధినేత..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ను ఆయన రాజీనామా చేయాలన్నారు. అవంతి కనుక తన పదవికి రాజీనామా చేస్తే.. తాను అనకాపల్లి వచ్చి.. ఆయన్ను గెలిపించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. పవన్ నోటి నుంచి ఈ మాట వచ్చి 36 గంటలు గడిచినా ఇప్పటివరకూ అవంతి స్పందించింది లేదు.

ఇదిలా ఉంటే తాజాగా పవన్ కల్యాణ్ కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. కాకినాడకు సమీపంలోని ఒక ఫాండేషన్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన.. ప్రత్యేక హోదా అంశంపై తమకు ఒక ప్రణాళిక ఉందని.. హోదా విషయంలో స్పష్టత ఉందన్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యులంతా రాజీనామా చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని .. అందుకే వారంతా రాజీనామా చేయాలంటూ పవన్ కల్యాణ్ డిమాండ్ చేయటం గమనార్హం.

కేంద్రం హోదా ఇవ్వాల్సిందేనని మరోసారి స్పష్టం చేసిన పవన్.. హోదా కోసం పోరాటం చేస్తామన్న విషయాన్ని స్పష్టం చేశారు.ఏపీ ఎంపీలకు కేంద్రంలో విలువ లేదన్న విషయం అర్థమవుతుందని.. అందుకే వారు బయటకు వచ్చిపోరాడాలని.. అందులో భాగంగానే వారంతా తమ పదవులకు రాజీనామా చేయాలని వ్యాఖ్యానించారు. పవన్ లాంటి వారి నోటినుంచి రాజీనామా వచ్చిన వేళ.. ఎంపీలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.